సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై విషయంలో తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. గవర్నర్‌పై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ తరఫు లాయర్ దుశ్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో బడ్జెట్ తేదీ మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 3వ తేదీ బదులు 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ తెలంగాణ సర్కార్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
బడ్జెట్ సిఫార్సులకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో.. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. ఈ నాటకీయ పరిణామల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌కు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం.
చదవండి: కేసీఆర్ సర్కార్ Vs గవర్నర్.. మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
గతంలో ఏం జరిగింది?
రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుండగా, ఇందుకు విరుద్ధంగా గతేడాది బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి సాంకేతికంగా వెసులుబాటు ఉంది. దీనిని ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధమైంది.
తనను అవమానించడానికే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగాన్ని రద్దు చేసుకుందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిఫారసు చేశానని గతేడాది గవర్నర్ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే సిఫారసు చేయకుండా పెండింగ్‌లో ఉంచగలనని కూడా అప్పట్లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు మరింత తీవ్రమైన నేపథ్యంలో.. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను తక్షణమే సిఫారసు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. దీనిపై సోమవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగం ఉంటుందని టీఎస్ సర్కార్ హైకోర్టుకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment