హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు

TS Government Removes Dethadi Harika Appointment Details Of Brand Ambassador - Sakshi

తెలంగాణ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌ నియామకంపై వివాదం

మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన దేత్తడి హారికకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌ హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడమే కాక ఆమెకు అపాయిట్‌మెంట్ ఆర్డర్ సైతం  అందజేశారు. అయితే దీనిపై వివాదం రాజుకుంది. మంత్రికి, ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా నియామకం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై టూరిజం శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం చీఫ్ సెక్రటరీ వరకు వెళ్లింది. దీంతో వెంటనే అలర్టెయిన అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో హారికకు నియామకానికి సంబంధించిన వివరాలను తొలగించారు. అయితే తెలంగాణ టూరిజం అధికారిక ట్విట్టర్‌లో మాత్రం ఆమె నియామకానికి సంబంధించిన వివరాలు అలాగే ఉన్నాయి.

హారికకు ముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా నియమించిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో తాజాగా హారికను నియమించగా.. ప్రస్తుతం ఆమె పేరును వెబ్‌సైట్ నుంచి తొలగించడం కలకలం రేపుతుంది. ఇక హారిక నియామకంపై ఓ రేంజ్‌లో విమర్శలు వచ్చాయి. అసలు ఏ అర్హత ఆధారంగా ఆమెని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారంటూ నెటిజనులు విమర్శించారు.

యూట్యూబ్ స్టార్‌గా సత్తా చాటడం, బిగ్ బాస్‌లో పాల్గొనడమే అర్హతలా అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఆరు ఎత్తయిన పర్వతాలను అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికై వారణాసి మానస తదితరులను ఎంపిక చేయవచ్చు కదా అంటూ సూచించారు.

చదవండి: స్టార్‌ హీరోయినే నా డ్రీమ్‌: దేత్తడి హారిక

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top