రాజమౌళి బాహుబలి నుంచే మొదలైంది..
టాలీవుడ్ ‘డార్లింగ్’ ప్రభాస్(Prabhas) దక్షిణాది నుంచి తొలి గ్లోబల్ స్టార్ హీరో అనేది అందరికీ తెలిసిందే. దేశ విదేశాల్లో ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ సామాన్యమైనది కాదు. బాహుబలి సిరీస్‌తో పాటు సలార్, కల్కి వంటి సినిమాలు ప్రభాస్‌ను సమకాలీన హీరోలకు అందనంత ఎత్తులో నిలబెట్టాయి. అయితే తన క్రేజ్‌ను ఆదరాబాదరా క్యాష్ చేసుకునే రెగ్యులర్ స్టార్స్‌కు భిన్నంగా అందివచ్చిన రూ.వందల కోట్లను మన రెబల్ స్టార్ పోగొట్టుకుంటున్నాడు. దీనికి తొలి బీజం బాహుబలి సినిమా సమయంలోనే పడిందని సమాచారం.
’బాహుబలి 2: ది కన్ క్లూజన్’ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టినప్పటి నుంచీ, అనేక టాప్ బ్రాండ్లు ప్రభాస్‌ను వాణిజ్య ప్రకటనల కోసం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయనకి పెద్ద మొత్తంలోనే డబ్బు ఆఫర్ చేస్తున్నాయి. దుస్తులు, ఫుట్‌వేర్, ఎలక్ట్రానిక్ ఫిట్‌నెస్ రంగాలకు చెందిన బ్రాండ్ల నుంచి అతనికి అంబాసిడర్‌గా ఉండేందుకు వచ్చిన ఆఫర్లను కాదని, ఒక్క సంవత్సరంలోనే రూ.150 కోట్లకు పైగా విలువైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఆఫర్‌లను తిరస్కరించడం ద్వారా ప్రభాస్ సినీ పరిశ్రమతో పాటు వ్యాపార రంగాల వారినీ ఆశ్చర్యపరచాడు.
గతంలో బాహుబలి 2 కోసం రూ. 10 కోట్ల విలువైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను వదులుకున్నాడని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించాడు. అయితే అనధికారికంగా ఆ సినిమా టైమ్‌లో ప్రభాస్ వదులకున్న ప్రకటనల విలువ రూ.80కోట్ల వరకూ ఉంటుందని అంచనా. తన లుక్‌లో మార్పు చేర్పులు చేసుకుంటే అది సినిమాకు నష్టం చేస్తుందనే ఆలోచనతోనే ఆయన అప్పట్లో వద్దనుకున్నాడట. ఆ తర్వాత కూడా అదే పంథా కొనసాగించాడు.
మరోవైపు టాలీవుడ్‌లో ప్రభాస్ తో పాటు టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు పెద్ద సంఖ్యలో ప్రకటనల్లో నటించడం గమనార్హం. ప్రభాస్ మాత్రం సమకాలీనుల మాదిరిగా కాకుండా వరుసగా అనేక ఆఫర్‌లను తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఒక ప్రధాన కోలా కంపెనీ వివిధ ఆటోమొబైల్ ఎండార్స్‌మెంట్‌లతో సహా అగ్ర బ్రాండ్‌ల ఒప్పందాలను ఇటీవల ఆయన తిరస్కరించినట్లు సమాచారం.
‘ కేవలం మూడు రోజుల పనికి ప్రభాస్ రూ.25 కోట్లకు పైగా సంపాదించవచ్చు. ఒక రోజు ఫోటోషూట్ కోసం, మరొక రోజు వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం చివరి రోజు ప్రమోషన్స్ కోసం వెచ్చిస్తే సరిపోతుంది.‘ అని ఒక సెలబ్రిటీ మేనేజర్ వెల్లడించాడు. అయితే ‘ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను తరచుగా అతను తిరస్కరించడానికి కారణం ఎండార్స్‌మెంట్‌లకు వ్యతిరేకమని కాదు. గతంలో బ్రాండ్‌లను ప్రమోట్ చేశాడు భవిష్యత్తులో కూడా చేస్తాడని, అయితే ఒక బ్రాండ్‌ను ఎండార్స్‌మెంట్ చేస్తున్నప్పుడు ఆచి తూచి వ్యవహరిస్తాడని సదరు మేనేజర్ తెలిపాడు.
తన విలువలకు అనుగుణంగా తన ప్రేక్షకులతో అనుబంధాన్ని చెడగొట్టని బ్రాండ్‌లను మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఎంచుకుంటాడని వివరించాడు. ఇంత వరకూ ఈ స్థాయిలో బ్రాండ్లను స్క్రూటినీ చేసే మరో స్టార్‌ను చూడలేదంటున్నాడు. ప్రస్తుతం ఒక అగ్రగామి వాహన కంపెనీకి, మరో మొబైల్‌కి మాత్రమే ప్రభాస్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
రూ.వందల కోట్ల సంపద ఉన్నా మద్యం ప్రకటనల నుంచి పాన్ మసాలా ప్రకటనల దాకా ఏదైనా సరే సై అనే నటీనటులున్న ఈ రోజుల్లో... తద్భిన్నంగా పైసా వెనుక పరుగులు తీయకుండా రూ.వందల కోట్లను వద్దు అనుకుంటున్న ఏకైక స్టార్‌గా ప్రభాస్ తన వ్యక్తిత్వంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు.


