రేపే ఈఏపీసెట్‌ ఫలితాలు | TS EAMCET results 2025 will be declared on May 11 | Sakshi
Sakshi News home page

రేపే ఈఏపీసెట్‌ ఫలితాలు

May 10 2025 4:23 AM | Updated on May 10 2025 4:23 AM

TS EAMCET results 2025 will be declared on May 11

11 గంటలకు విడుదల చేయనున్న సీఎం 

సెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్న అధికారులు 

కాలేజీల్లో సీట్లకు ఏఐసీటీఈ నుంచి రాని అనుమతి 

కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్‌) ఫలితాలు ఆదివా రం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో ఫలితాలు వెల్లడిస్తారని ఈఏపీసెట్‌ కో–కనీ్వనర్‌ డాక్టర్‌ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ సెట్‌ ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో జరిగింది. ఇంజనీరింగ్‌ సెట్‌ మే 2 నుంచి 4 వరకూ జరిగింది. మొత్తం 2,88,388 మంది పరీక్షలు రాశారు. ఫలితాల కోసం  https://eapcet.thche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వొచ్చని అధికారులు తెలిపారు. సెట్‌ ఫలితాలను త్వరగా అందించేందుకు ‘సాక్షి’దినపత్రిక ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. www. sakshieducation.com వెబ్‌సైట్‌లో ఫలితాలు వేగంగా తెలుసుకోవచ్చు. 

ఏఐసీటీఈ అనుమతి ఎప్పుడు? 
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజనీరింగ్‌ సీట్లకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకూ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి మంజూరు చేయలేదు. కొన్ని కాలేజీలు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని, మరికొన్ని డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ బ్రాంచీల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నాయి. ఏఐసీటీఈ అనుమతిని ఇస్తేనే కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టడానికి వీలవుతుంది.

రాష్ట్రంలో గత ఏడాది లెక్కల ప్రకారం 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు (కన్వీనర్, మేనేజ్‌మెంట్‌ కలిపి) ఉన్నాయి. ఇందులో గత సంవత్సరం 1.03 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో దాదాపు 35 శాతానికి పైగా సీట్లు మిగిలిపోయాయి. వీటిల్లో కొన్ని తగ్గించుకునేందుకు ప్రైవేటు కాలేజీలు దరఖాస్తు చేశాయి. అయితే ప్రభుత్వం సీట్ల తగ్గింపు విషయంలో తమ అభిప్రాయం తీసుకోవాలని ఏఐసీఈటీని కోరింది.  

ఖరారు కాని ఫీజులు 
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ఫీజులను రాష్ట్ర ఫీజులు, ప్రవేశాల నియంత్రణ మండలి ఇంతవరకూ ఖరారు చేయలేదు. ప్రతి మూడేళ్ళకోసారి ఫీజులను టీఎఫ్‌ఆర్‌సీ సమీక్షిస్తుంది. మూడేళ్ళ క్రితం నిర్ణయించిన ఫీజులు 2024–25 విద్యా సంవత్సరం వరకూ వర్తించాయి. 2025–26 నుంచి మూడేళ్ళకు గాను కొత్త ఫీజుల ఖరారుపై ఎఫ్‌ఆర్‌సీ కొన్ని నెలలుగా కసరత్తు చేస్తోంది. ప్రైవేటు కాలేజీలతో సంప్రదింపులు కూడా చేపట్టింది. కొన్ని కాలేజీలు ఏకంగా రూ.1.45 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వార్షిక ఫీజును డిమాండ్‌ చేస్తున్నాయి. గత ఏడాది రూ.75 వేలున్న ఫీజులను రూ.1.25 వేలకు పెంచాలని 50 కాలేజీలు ప్రతిపాదనలు పంపాయి. వీటన్నింటినీ సమీక్షించిన ఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తోంది. 

పూర్తవ్వని అనుబంధ గుర్తింపు ప్రక్రియ 
రాష్ట్రంలోని 159 కాలేజీలకు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపు రావాల్సి ఉంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియే. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ బృందాలు ఆయా కాలేజీలను తని ఖీ చేయాల్సి ఉంటుంది. కాలేజీల్లో మౌలిక వసతులు, అర్హత గల అధ్యాపకులు ఉన్నారా? అనే అంశాలను పరిశీలిస్తారు. ఇది ఇంతవరకూ పూర్తవ్వలేదు. కొన్ని కాలేజీలు కోర్‌ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత కొత్త బ్రాంచీల్లో సీట్లు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కోర్సులకు అవసరమై న లైబ్రరీ, లేబొరేటరీ తదితర సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయనేది పరిశీలించిన తర్వాతే అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు సెట్‌ ఫ లితాలు వెలువడుతుంటే, మరోవైపు కాలేజీల తనిఖీలు, అనుబంధ గుర్తింపు ఎప్పుడు పూర్తవుతుందో అధికారులు చెప్పలేక పోతుండటం గమనార్హం. 

విడుదల కాని జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ 
ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలైన వెంటనే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కౌన్సెలింగ్‌ ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇప్పటివరకు విడుదల కాలేదు. దీన్ని బట్టే రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తారు. మరోవైపు సీట్లకు ఏఐసీటీఈ నుంచి అనుమతి రాకపోవడం, కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు పూర్తి కాకపోవడంతో ఈసారి కౌన్సెలింగ్‌ ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement