టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు సన్నాహాలు షురూ

TRS Membership Registration Preparations Begin - Sakshi

నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నేతలతో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ 

సభ్యత్వ నమోదు పుస్తకాలు, మార్గదర్శకాలపై అవగాహన 

మండలాలు, గ్రామాలవారీగా పార్టీ కేడర్‌కు టార్గెట్‌లు 

ఈ నెల 25లోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయడమే లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ నెల 25లోగా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచే సంబంధిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నమోదయ్యే సభ్యుల్లో కనీసం 35 శాతం మందికి క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయిం చారు. 2019లో జరిగిన సభ్యత్వ నమోదులో 65 లక్షల మంది టీఆర్‌ఎస్‌ సభ్యులుగా నమోదు కాగా, ప్రస్తుతం ఈ లక్ష్యాన్ని 80 లక్షలుగా పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్దేశించారు.

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం 50వేలకు తగ్గకుండా పార్టీ సభ్యత్వ నమోదు జరిగి తీరాలని లక్ష్యం విధించారు. ఈ నెలాఖరులోగా సభ్యత్వ నమోదు పూర్తయితేనే మార్చిలో గ్రామ, మండల స్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాల నాటికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా సభ్యత్వ నమోదును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ వర్గాలు వెల్లడించాయి.  

ఎమ్మెల్యేలకే కంప్యూటరీకరణ బాధ్యత.. 
పార్టీ సభ్యత్వం తీసుకునేవారికి రూ.2 లక్షల ప్రమాదబీమా కల్పిస్తున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదు సందర్భంగా కార్యకర్తల వివరాలు పూర్తి స్థాయిలో సేకరించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ సూచించారు. గతంలో 65 లక్షల మంది పార్టీ సభ్యులుగా నమోదైనా వారి వివరాలు రాష్ట్ర కార్యాలయంలో పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఇన్సూరెన్స్‌ చెల్లింపు సందర్భంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండేళ్ల వ్యవధిలో వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు బీమా పరిహారంగా సుమారు రూ.16 కోట్ల మేర చెల్లించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రస్తుత సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత కార్యకర్తల వివరాలను నియోజకవర్గస్థాయిలోనే కంప్యూటరీకరించి, వివరాలను తెలంగాణ భవన్‌లో అందజేయాలని పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ క్షేత్ర స్థాయి నేతలు, క్రియాశీల కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌ తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా సేకరించాల్సిన సభ్యత్వాల సంఖ్యకు సంబంధించి క్షేత్ర స్థాయి నేతలకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే కొత్త జిల్లాలు, ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఇన్‌చార్జ్‌లను నియమించిన విషయం తెలిసిందే.  

కేసీఆర్‌ జన్మదిన వేడుకలకు సన్నాహాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా ఈ నెల 17న భారీగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ‘కేసీఆర్‌ కప్‌ 2021’పేరిట వాలీబాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కేసీఆర్‌ జన్మదినం నేపథ్యంలో స్థానికంగా క్రికెట్‌ టోర్నమెంట్‌లు నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఎంపీ సంతోశ్‌ ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు టీఆర్‌ఎస్‌ యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top