
సైన్ బోర్డుల కోసం చెట్లకు మేకులతో గాయాలు
వైర్లు, మేకులతో వేరు వ్యవస్థ బలహీనమై కూలుతున్న చెట్లు
భద్రాద్రి జిల్లాలో ఉధృతంగా సాగుతున్న మేకుల తొలగింపు ప్రక్రియ
ఇలాంటి కార్యక్రమం రాష్ట్రమంతటా చేపట్టాలంటున్న ప్రకృతి ప్రేమికులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: హరితహారం, వనమహోత్సవం పేరిట భారీగా మొక్కలు నాటుతున్నారు. అయితే ఇలా నాటే చెట్లలో అనేకం మహా వృక్షాలుగా మారకముందే నేలకూలుతున్నాయి. 10–15 ఏళ్ల వయసున్న చెట్లకు పబ్లిసిటీ కోసం ఇష్టారీతిన మేకులు కొట్టడం, వైర్లు చుట్టడంతో ఈ దుస్థితి దాపురిస్తోంది. అయితే చెట్లకు జరుగుతున్న నష్టాలను నివారించే కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదలైంది.
ఫ్రీ పబ్లిసిటీ కావడంతో..
దారి వెంట వచ్చిపోయే వారికి పచ్చదనం పంచుతూ చల్లని నీడనిచ్చే చెట్ల మనుగడ కొందరి ప్రచార ఆర్భాటాలతో ప్రమాదంలో పడుతోంది. వందల ఏళ్లు బలంగా బతకాల్సిన చెట్లు బలహీనమై అర్ధంతరంగా నేలకూలుతున్నాయి. విద్యుత్ స్తంభాలను ప్రైవేటు వ్యక్తులు వినియోగిస్తే అందుకు తగ్గ చార్జీలు ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంటుంది. ఇళ్ల ముందు ఏర్పాటు చేస్తే దాని యజమానులు తొలగిస్తారు.
కానీ చెట్ల విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు, ఇదేంటని అడిగే వారూ లేరు. రూపాయి ఖర్చు లేకుండా బోలెడంత ప్రచారం చేసుకునే వెసులుబాటు కలుగుతోంది. దీంతో అడ్డూఅదుపు లేకుండా చెట్లకు మేకులు దించి, బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకునే కార్యక్రమం రాష్ట్రమంతటా సాగుతోంది. మరోవైపు ఈ చెట్లను ఆసరాగా చేసుకుని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్విస్ ప్రొవైడర్లు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వైర్లు గట్టిగా పట్టుకుని ఉండేందుకు వీలుగా ఇష్టారీతిగా చెట్లకు మేకులు కొట్టడం, ముడేయడం వంటివి చేస్తున్నారు.
నష్టాలు ఇలా..
వేర్ల నుంచి చెట్టు పైభాగాలకు వెళ్లే పోషకాల సరఫరాలో బెరడు భాగం ఎంతో కీలకం. చెట్టు ప్రధాన కాండానికి పదుల సంఖ్యలో మేకులు దించడం వల్ల చెట్టు చుట్టూ ఉండే బెరడులోని దారు భాగం దెబ్బతింటుంది. దీని వల్ల భూమి నుంచి చెట్టుకు కావాల్సిన నీరు అందదు. చెట్టు చుట్టూ బిగుతుగా వైర్లు కట్టడంతో పోషకాలు అందించే ప్రసరణ వ్యవస్థ పనితీరులో ప్రభావం చూపుతుందని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చెట్లు బలహీనంగా మారుతాయని అంటున్నారు. ఇటీవల చిన్నపాటి వానలు, గాలులకే రోడ్ల పక్కన చెట్లు కూలిపోవడం వెనుక ప్రధాన కారణాల్లో మేకుల మర్మం ఉందంటున్నారు.
మేకుల తొలగింపు
రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి మోహన్ చంద్ర పర్గాయి ప్రస్తుతం సింగరేణి సంస్థకు సలహాదారుగా పని చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వస్తుండగా రోడ్లకు ఇరువైపులా చెట్లకు ఇబ్బడిముబ్బడిగా మేకులతో కొట్టిన సైన్‌బోర్డులు కనిపించాయి. చెట్ల మనుగడకే ప్రమాదకారులుగా మారుతున్న ఈ బోర్డులు, మేకుల విషయాన్ని ఆయన జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఈనెల 6 నుంచి జిల్లావ్యాప్తంగా చెట్లకు కొట్టిన మేకులు, కేబుల్ వైర్లు తొలగించాలంటూ ఎంపీడీఓలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గత 10 రోజులుగా జిల్లాలో చెట్లకు మేకులు తొలగించే కార్యక్రమం సాగుతోంది. దీన్ని ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో కూడా అమల్లోకి తేవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
చెట్లకు నష్టం
యాభై ఏళ్ల వయసు ఉన్న పెద్ద వృక్షాలకు మేకుల వల్ల అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఐదు నుంచి పదిహేనేళ్ల వయసున్న చెట్లపై మేకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మేకుల కారణంగా మహా వృక్షాలుగా రూపాంతరం చెందాల్సిన చెట్లు మధ్యలోనే బలహీనపడి చనిపోతాయి. భారీగా మొక్కలు నాటడం, వాటిని బతికించడంతోపాటు చెట్లను మహా వృక్షాలుగా మార్చే బాధ్యత కూడా మనం తీసుకోవాలి.
– మోహన్ చంద్ర పర్గాయి, రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి, సింగరేణి సలహాదారు
ప్రసరణ వ్యవస్థపై ప్రభావం
ఎదుగుదలకు అవసరమైన కార్బన్‌డయాక్సైడ్, సూర్యరశ్మి తదితర పోషకాలను చెట్లు వాతావరణం నుంచి తీసుకుంటాయి. కానీ నీరు ప్రధానంగా భూమి నుంచే తీసుకుంటాయి. మేకులు, వైర్ల వలన చెట్ల ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. – రమేష్, బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పాల్వంచ