పచ్చని సంసారంలో ‘అత్తింటి ఇల్లు’ చిచ్చు! | Tragedy in Mahabubabad district | Sakshi
Sakshi News home page

పచ్చని సంసారంలో ‘అత్తింటి ఇల్లు’ చిచ్చు!

Oct 11 2026 5:31 AM | Updated on Oct 11 2026 5:31 AM

Tragedy in Mahabubabad district

అనూష, వర్షిణి, వృశాంత్‌కృష్ణ

ఖాళీ చేయాలని పెద్దల తీర్మానంతో కుటుంబంలో కలహాలు 

ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య 

రెండు రోజుల నుంచి భార్యతో భర్త గొడవ

మహబూబాబాద్‌ జిల్లా లింగ్యా తండాలో విషాదం

కురవి: పచ్చని సంసారంలో కుటుంబ కలహాలు చిచ్చుపెట్టాయి. అత్తింటి స్థలంలో కట్టుకున్న ఇల్లును రెండు రోజుల్లో ఖాళీ చేయాలని పెద్దలు తీర్మానం చేయడంతో భార్యతో భర్త గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికిగురైన భార్య..కూతురు, కొడుకును తీసుకొని తమ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండా గ్రామశివారులోని సామ్యకుంట వద్ద శనివారం జరిగింది.

మృతురాలి తమ్ముడు చిన్ని, కురవి ఎస్సై సతీష్‌ కథనం ప్రకారం...లింగ్యా తండాకు చెందిన బానోత్‌ బాబులాల్‌ కుమారుడు నవీన్‌కు అదే తండాలోని మాలోత్‌ సుశీల–వీరుల కుమార్తె అనూష(31)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు రుతి్వక, వర్షిణి (8), వృశాంత్‌కృష్ణ (4)లు ఉన్నారు. అనూష తండ్రి వీరు, అన్నయ్య గణేశ్‌ గతంలోనే చనిపోయారు. దీంతో బానోత్‌ నవీన్‌ అత్త సుశీల ఇచ్చిన స్థలంలో రేకుల ఇల్లు నిర్మించుకొని కిరాణాషాపు పెట్టుకుని జీవిస్తున్నాడు.  

కొన్నాళ్లుగా అత్తతో పంచాయితీ.. 
అత్త సుశీలతో నవీన్‌కు కొన్నాళ్లుగా గొడవ జరుగుతోంది. తన కూతురు, అల్లుడికి ఇంటి స్థలంలో పాటు రెండెకరాల భూమి ఇచ్చానని, తన బాగోగులు చూసుకోవడం లేదని సుశీల వారంరోజుల క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టింది. దీంతో ఆమె ఇచ్చిన స్థలంలో కట్టుకున్న ఇంటిని ఖాళీ చేయాలని తీర్మానం చేశారు. మరో రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాల్సి ఉండగా..భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతోపాటు శనివారం ఉదయం చిట్టీ డబ్బుల విషయంలో మరోసారి గొడవ జరిగింది. మనస్తాపం చెందిన అనూష తన ముగ్గురు పిల్లలను తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి పొలం వద్దకు వెళ్తుండగా ఆమెను తన చిన్నాన్న కొడుకు చిన్ని చూసి ప్రశ్నించగా పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తున్నాని చెప్పింది.

అనుమానం వచ్చిన చిన్ని బావి వద్ద కరెంట్‌ లేదు... నీళ్లు ఎలా పెడతావు..అని ప్రశ్నించి వారిని బైక్‌ ఎక్కించుకుని తండా వైపు వెళ్లాడు. ఈ క్రమంలో అనూష బండి ఆపమని చెప్పి తన కొడుకు, కూతురుతో సహా బండి దిగింది. ఈ క్రమంలో బండిపై ఉన్న మరో కూతురు వర్షిణి కిందపడిపోయింది. వారిద్దరినీ అనూష తీసుకొని బావి వద్దకు వెళ్లగా, రుతి్వకను చిన్ని తన బండిపై ఇంటికి తీసుకెళ్లాడు.

ఈ విషయాన్ని నవీన్‌కు చెప్పాడు. వెంటనే అతడు బావి వద్దకు వెళ్లగా.. అక్కడ కూడా ఇద్దరూ గొడవపడ్డారు, అనంతరం నవీన్‌ ఇంటికి వచ్చాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష కూతురు వర్షిణి, కుమారుడు వృశాంత్‌ కృష్ణతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమీప రైతులు సమాచారం ఇవ్వడంతో తండావాసులు వచ్చి బావి నుంచి మృతదేహాలను బయటికి తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement