రేవంత్‌ పాదయాత్రకు సమాయత్తం

TPCC Chief Revanth Reddy likely To Start Padayatra On 26th Jan - Sakshi

26న భద్రాచలం నుంచి రేవంత్‌ యాత్ర షురూ! 

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. హాథ్‌సే హాథ్‌జోడో యా త్రల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా చేసుకుంటున్నారు. ఈనెల 26న భద్రాచలం నుంచి ప్రారంభం కానున్న తన పాదయాత్ర షెడ్యూల్‌ను ఇప్పటికే ఏఐసీసీ అధిష్టానానికి పంపిన రేవంత్‌.. ఈ షెడ్యూల్‌ మేరకు క్షేత్రస్థాయిలో అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో రేవంత్‌ భేటీ అయ్యారు.  

మా దగ్గరి నుంచే ప్రారంభించండి 
రేవంత్‌ను పొదెం వీరయ్య కలిసిన సందర్భంగా పాదయాత్ర అంశం చర్చకు వచ్చిందని గాంధీభవన్‌ వర్గాల ద్వారా తెలిసింది. తన నియోజకవర్గం నుంచే యాత్రను ప్రారంభించాలని రేవంత్‌ను వీరయ్య కోరారు. అయితే యాత్ర ప్రారంభానికి ముందే అన్ని అడ్డంకులను తొలగించుకునే యోచనలో రేవంత్‌ ఉన్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర నాయకత్వంతో ఆయన పాదయాత్ర గురించి చర్చించనున్నారు.

హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలు ఎలాగూ రెండు నెలల పాటు రాష్ట్రమంతటా చేయాల్సి ఉన్న నేపథ్యంలో, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను పొడిగించి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరనున్నట్టు సమాచారం. ఈ యాత్రకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవికి రేవంత్‌ అప్పగించే అవకాశముంది.

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పార్టీ సమన్వయ బాధ్యతలను మల్లు రవికి అప్పగించారు. ఈ బాధ్యతలకు అనుగుణంగానే నూతన సంవత్సరం సందర్భంగా మల్లు రవి పలువురు కాంగ్రెస్‌ నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే రాష్ట్రంలోని ముఖ్య కాంగ్రెస్‌ నేతలందరినీ మల్లు రవి కలుస్తారని, రేవంత్‌ పాదయాత్ర ఉద్దేశం, ఆవశ్యకత గురించి వారితో చర్చిస్తారని తెలుస్తోంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top