మావోయిస్టు అగ్రనేతల అమ్మ.. మధురమ్మ కన్నుమూత

Top Maoist Leader Mallojula Venugopal Rao Mother Passed Away - Sakshi

పెద్దపల్లిరూరల్‌: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల కోటేశ్వర్‌రావు (కిషన్‌జీ), వేణుగోపాల్‌రావుల మాతృమూర్తి మధురమ్మ (96) మంగళవారం తుదిశ్వాస విడిచారు. మూడునెలల క్రితం ఇంటి ఆవరణలో జారిపడగా తుంటి ఎముక విరిగింది. వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. వారం క్రితం మళ్లీ అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు.

పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. ఇంటి ఆవరణలోనే తుదిశ్వాస విడవాలన్న ఆమె కోరికపై వెంటిలేటర్‌పైనే పెద్దపల్లిలోని సొంతింటికి తీసుకొచ్చారు. మధురమ్మను పరీక్షించిన వైద్యులు శ్వాస ఆగిపోయిందని ధ్రువీకరించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రజాసంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు.

పోరాట కుటుంబం..
మావోయిస్టు అగ్రనేతలు కోటేశ్వర్‌రావు, వేణుగోపాల్‌రావుది పోరాట కుటుంబం. తండ్రి మల్లోజుల వెంకటయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ప్రభుత్వ గుర్తింపు పొందారు. తామ్రపత్ర గ్రహీత. అదే పోరాట పటిమను పుణికిపుచ్చుకున్న కోటేశ్వర్‌రావు 1975లో అడవిబాట పట్టారు. మరో ఐదేళ్ల తరువాత వేణుగోపాలరావు సైతం కోటన్న బాటనే అనుసరించారు.

11ఏళ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో..
కిషన్‌జీ పీడిత, తాడిత ప్రజలకోసం సుదీర్ఘకాలం పనిచేశారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ పోరాటం పాలకులకు కంటగింపుగా మారింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని మిడ్నాపూర్‌ జిల్లాలో 2011 నవంబర్‌ 25న జరిగిన ఎన్‌కౌంటర్‌లో కోటేశ్వర్‌రావు అమరుడయ్యారు. వేణుగోపాల్‌రావు ప్రస్తుతం కేంద్రకమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

మొదట పోలీసులు ఒత్తిడి పెంచినా..
పీపుల్స్‌వార్‌ గ్రూప్‌లో కోటేశ్వర్‌రావు, వేణుగోపాల్‌రావు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కాలంలో మల్లోజుల కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరిగింది. 1986లో అప్పటి డీఎస్పీ బుచ్చిరెడ్డిని నక్సల్స్‌ కాల్చిచంపారు. ఆ కోపంతో పోలీసులు వెంకటయ్య, మధురమ్మల ఇంటిని కూల్చివేశారు. ఆ తర్వాత తాటికమ్మలతో గుడిసె వేసుకుని వారు కొంతకాలం జీవనం సాగించారు.

1997 డిసెంబర్‌ 26న మల్లోజుల వెంకటయ్య మరణించారు. మధురమ్మకు ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు ఆంజనేయరావు కేడీసీసీ బ్యాంకులో పనిచేసి విరమణ పొందారు. మిగిలిన ఇద్దరు ‘కోటేశ్వర్‌రావు, వేణుగోపాల్‌రావు జనం కోసం పోరాడుతున్నారు.. అలాంటి కొడుకుల కన్నందుకు గర్వంగా ఉంది’ అని మధురమ్మ చెప్పేదని జనం గుర్తు చేసుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top