టానిక్‌ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్‌ ఎగవేత! | Sakshi
Sakshi News home page

టానిక్‌ మోసాలు.. 100 కోట్ల ట్యాక్స్‌ ఎగవేత!

Published Thu, Mar 7 2024 7:14 PM

Tonique Wine Mart Raids: Govt Ready For Strict Actions - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: నగరంతో పాటు శివారుల్లో టానిక్‌ వైన్‌ మార్ట్‌ పేరిట జరిగిన భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. సులువుగా అనుమతులు పొందడం మొదలు.. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరపడం, ట్యాక్సులు ఎగ్గొట్టడం దాకా.. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వంద కోట్ల రూపాయల ట్యాక్స్‌ ఎగ్గొట్టినట్లు తేలగా.. ఇందుకు గత ప్రభుత్వ హయాంలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 

ఎలైట్ లిక్కర్ మార్ట్ కోసం పర్మినెంట్‌ లైసెన్స్‌ను 2016లో ప్రత్యేక జీవో 271ను పేరిట జారీ చేసింది గత ప్రభుత్వం. ఈ జీవో ప్రకారం ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే.. మొదటి మూడు సంవత్సరాలు లిక్కర్ అదనపు అమ్మకాలపై ఎలాంటి ప్రివిలేజ్ ఫీజ్ చెల్లిచకుండా వెసులుబాటు కల్పించారు. 

ఇదిలా ఉంటే.. ఎలైట్ వైన్ షాపు కోసం 2016లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. టానిక్ బేవరేజెస్ మాత్రమే టెండర్ కోట్‌ చేసింది. దీంతో.. టానిక్ కు ఎలైట్ వైన్ షాప్ పర్మినెంట్‌ అనుమతి సులువైంది. అయితే.. తెలంగాణ లో ఒక్క ఎలైట్ ఔట్ లెట్‌కు మాత్రమే అనుమతి ఇవ్వగా.. హైదరాబాదు, నగర శివారుల్లో మరో 10 ఎలైట్ వైన్ షాపులను ‘Q By టానిక్’ పేరుతో నిర్వహిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం.. ఎలైట్ వైన్స్ లైసెన్స్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశమే లేకపోవడం గమనార్హం. 

ఇక.. ఈ లైనెస్స్‌ ప్రకారం లిక్కర్‌ను బాటిల్స్‌గా మాత్రమే విక్రయించాలి. లూజ్ వైన్‌కు అనుమతి లేదు. ఇతర పానీయాలు ,ఆహార పదార్ధాల అమ్మకానికి వీలులేదు. అయితే ఈ వ్యవహారం మొత్తంలో సాధారణ మద్యం లైసెన్స్‌ అనుమతులు తీసుకుని విదేశీ మద్యం అమ్మకాలు జరపడం ఇక్కడ కొసమెరుపు. రీటైల్‌గా ఫారెన్ లిక్కర్ తోపాటు ప్రీమియం ఇండియన్ లిక్కర్ అమ్మడానికి టానిక్‌కు వెసలుబాటు కల్పించారు. 

ఇక.. టానిక్‌ వైన్‌ మార్టులో  పని చేసే ఉద్యోగుల పేరిట లైసెన్సులు తీసుకున్నారు. అంతేకాదు.. ఈ ఫ్రాచైజీల్లో బడా బాబుల పిల్లల పెట్టుబడులు పెట్టారు. గత ప్రభుత్వ అనుమతులతోనే ఈ తతంగం అంతా నడిచినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు శివారులో వైన్‌ మార్టులు ఏర్పాటు చేసింది టానిక్‌. ఇందుకు ఓ ఐఏఎస్‌ అధికారితో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులు సహకరించినట్లు ఎక్సైజ్‌ శాఖ గుర్తించింది. గచ్చిబౌలి, బోడుప్పల్‌, మాదాపూర్‌లో ఏర్పాటైన టానిక్‌ మార్టులో ఈ ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. అలాగే సీఎంవో మాజీ అధికారి ఒకరి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఇవన్నీ ఒక ఎత్తయితే.. టానిక్‌ షాపులకు ఎక్సైజ్‌ శాఖ షాకిచ్చింది. ప్రత్యేక జీవోతో అర్ధరాత్రి 2 గంటల దాకా లిక్కర్‌ అమ్ముకునే వెసులుబాటును తొలగించింది. రెగ్యులర్‌ లిక్కర్‌ దుకాణాల మాదిరే రాత్రి 11 గం. వరకే అమ్ముకోవాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పన్నుల ఎగవేతపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చాకే ఈ నిర్ణయం ప్రకటించింది. ఇక.. పూర్తిస్థాయి తనిఖీల అనంతరం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. 

Advertisement
Advertisement