సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సనత్‌నగర్‌లో నేడు టిమ్స్ ప్రారంభోత్సవం
సర్కార్ దవాఖానాలో ఇక కార్పొరేట్ చికిత్సలు
1,080 పడకలతో అత్యాధునికంగా నిర్మాణం
దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఏర్పాటు
అవయవమార్పిడి సేవలకూ అవకాశం
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్‌లోని డా.మర్రిచెన్నారెడ్డి టిమ్స్ ఆస్పత్రి ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇప్పటికే పలుమార్లు ఈ ఆస్పత్రి ప్రారంభం వాయిదా పడిన సంగతి తెలిసిందే. సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నా రు. ఈ ఆస్పత్రిలో ఆరు కీలక విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దారు. ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలి సారిగా ప్రభుత్వ ఆస్పత్రి (టిమ్స్)లో ఏర్పాటు చేయడం విశేషం. ఫలితంగా రోగుల నుంచి సేకరించిన పరీక్షా నమూనాల ఫలితాలను ఒకటి, రెండు నిమిషాల వ్యవధిలో అందుబాటులోకి రానున్నాయి. కాగా, మంత్రి రాజనర్సింహ ఆదివారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జకారియా, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏ బ్లాక్‌లో ఏముంటుంది?
ఆస్పత్రిని నాలుగు బ్లాకులుగా నిర్మించారు. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. డయాగ్నోస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ, 12 మైక్రోబయాలజీ, 10 బయోకెమిస్ట్రీ, 5 ప్రత్యేక ల్యాబ్‌లు ఉన్నాయి. బ్లాక్–ఏలో అత్యవసర సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 300 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగం ఉంటాయి. బ్లాక్–బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌ల్యాబ్‌లు, బ్లాక్–సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు, బ్లాక్–డీలో పరిపాలన, విద్యా విభాగాలతో పాటు, ఆడిటోరియం ఉంటుంది. మొత్తం 1,080 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
నిమిషాల్లోనే రక్త నమూనాలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ టిమ్స్ సనత్ నగర్ లో ఏర్పాటు చేశారు. సీల్డ్ ట్యూబ్‌లు, గాలి ఒత్తిడితో రక్త నమూనాలు, మందులు, వైద్య నివేదికలు, అత్యవసర వినియోగ వస్తువులను వార్డులు, అత్యవసర విభాగం, ల్యాబ్‌లు, ఫార్మసీ, బ్లడ్ బ్యాంక్‌ల మధ్య కేవలం 1–2 నిమిషాల్లో ఈ విధానం ద్వారా తరలించవచ్చు.ఫలితంగా వేగవంతమైన చికిత్సలు అందుతాయి.
ఆరు కీలక విభాగాల్లో ..
టిమ్స్‌లో అవయవ మార్పిడి, కార్డియాక్ సైన్సెస్, ఆంకాలజీ, న్యూరోసైన్సెస్, నెఫ్రాలజీ, ట్రామా కేర్‌లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుంది. కిడ్నీ, కాలేయం, గుండె, బహుళ అవయవ మార్పిడి సేవలకు ఇక్కడ అవకాశం ఉంది. ఆధునిక కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్సలు, లీనాక్ ఆధారిత రేడియోథెరపీ, 24 గంటల అత్యవసర వైద్య సేవలు, ఐసీయూ బ్యాకప్‌తో 30 క్లినికల్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. 3 టెస్లా ఎంఆర్‌ఐ, 128 స్లైస్ సీటీ స్కానర్, అధునాతన మామోగ్రఫీ యూనిట్, ఐదు ఎక్స్‌రే యంత్రాలు ఏర్పాటు చేశారు.
సహాయకుల కోసం ధర్మశాల
రోగులతో వచ్చే సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో ధర్మశాలను నిర్మించారు. ఇందులో 200 మందికి వసతి కల్పించే సదుపాయం ఉంది. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీ, కేంద్ర వంటశాల, లాండ్రీ, వైద్య వాయువు పైప్‌లైన్ వ్యవస్థలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 200 మంది కూర్చునే ఆడిటోరియం కూడా ఉంది. పర్యావరణహిత నిర్మాణానికి టిమ్స్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. నీటి వినియోగాన్ని 75 శాతం వరకు తగ్గించే సాంకేతికతను అమలు చేశారు. మురుగునీరు, వ్యర్థ ద్రవాల శుద్ధికి ఎస్టీపీ, ఈటీపీలు ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సేకరించి మొక్కలు, పచ్చదనం కోసం వినియోగించే విధానం ఉంది. పర్యావరణహిత నిర్మాణం, ఇంధన సామర్థ్య వ్యవస్థల కారణంగా ప్రాజెక్టుకు ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది.
ఒకే మాస్టర్‌ప్లాన్‌తో నిర్మాణం
సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం దశలవారీగా సాగుతుండగా.. టిమ్స్ సనత్‌నగర్‌ను ఒకే దశలో, ఒకే మాస్టర్‌ప్లాన్ కింద సంపూర్ణ సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా నిర్మించారు. ప్రభుత్వ వైద్యరంగంలో అత్యాధునిక మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా టిమ్స్ సనత్‌నగర్ నిలవనుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లభించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను సామాన్యులకు ప్రభుత్వ వ్యవస్థలోనే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యానికి ఇది కీలక ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.


