
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్ ప్లాంట్‌లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కూలిపోయింది. మృతులను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సురేష్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24), అమిత్రాయ్ (20)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గత నెల సూరారంలోని ఓ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్‌మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. కాగా, మెహదీపట్నంలోని ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది.