తెలంగాణకు ఐఎండీ బిగ్‌ అలర్ట్‌ | Telangana Weather: Heavy Rains These Districts IMD Big Alert | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ఐఎండీ బిగ్‌ అలర్ట్‌

Jun 3 2026 7:53 AM | Updated on Jun 3 2026 11:19 AM

Telangana Weather: Heavy Rains These Districts IMD Big Alert

హైదరాబాద్‌: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయడం గమనార్హం.

తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు మరింత ఉధృతంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట.. 

.. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.

అదే సమయంలో నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడును తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాల తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. తల్లాడలో 6 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 4 సెం.మీ, దమ్మపేటలో 3 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెం.మీ వర్షం కురిసింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరో 27 జిల్లాల్లో 40.2 నుంచి 44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement