అంతర్జాతీయ మారథాన్‌లలో వరంగల్‌ ‘జ్యోతి’ 

Telangana: Warangal ZP Chairman Gandra Jyothi Participates In London Marathon - Sakshi

51 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం

జర్మనీ, బోస్టన్, షికాగో, న్యూయార్క్, లండన్‌లలో ప్రతిభచాటి..

టోక్యో మారథాన్‌లోనూ పాల్గొని కల నెరవేర్చుకునే దిశగా అడుగులు

వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్రజ్యోతి పరుగు ప్రస్థానంపై ‘సాక్షి’ కథనం  

సాక్షి, వరంగల్‌: పాప జన్మించిన సమయంలో ఆమెకు థైరాయిడ్‌ సమస్య నిర్ధారణ అయింది. మందులతోనే సమస్య తగ్గదన్న వైద్యుడి సూచన మేరకు తొలుత యోగా, వాకింగ్‌ మొదలుపెట్టిన ఆమె.. ఆ తరువాత పరుగుపై దృష్టిపెట్టింది. ఆమె ప్రారంభించిన పరుగు 46వ ఏట పూర్తిస్థాయిలో పట్టాలెక్కింది. తొలుత భారత్‌లో జరిగిన మారథాన్‌లలో పరుగులు పెట్టిన ఆమె కాళ్లు...అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న ఐదు మారథాన్‌లను చుట్టివచ్చాయి.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య, వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి వయస్సు 51 ఏళ్లు. ఆమె ఇటీవల లండన్‌ మారథాన్‌లో లక్ష్యాన్ని పూర్తి చేసి మెడల్‌ దక్కించుకొని వరంగల్‌ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 

నమ్మకాన్ని పెంచిన ముంబై మారథాన్‌  
23 ఏళ్ల వయసులో థైరాయిడ్‌ వచ్చింది. బరువు పెరిగి ఏ పని చేయాలన్నా శరీరం సహకరించలేదు. మందులతోపాటు వ్యాయామం చేస్తే ఫలితాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. కొన్నాళ్ల పాటు ఇంటి పరిసరాల్లోనే యోగా, వాకింగ్‌ చేసేదాన్ని. అయితే కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌ వెళ్లా. ఆ సమయంలో మారథాన్‌ క్లబ్‌ గురించి తెలుసుకొని వారి వద్ద శిక్షణలో చేరా. ఇందుకోసం అత్యంత కష్టమైన ట్రెక్కింగ్‌ కూడా చేశాను.

వారానికి రెండుసార్లు లాంగ్‌రన్‌లు, నిత్యం వ్యాయామం చేశా. విశాఖపట్నం, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో ఎక్కడా మారథాన్‌ నిర్వహించినా వెళ్లి పాల్గొన్నా. 2016 మేలో శిక్షణ ప్రారంభించిన ఏడాదిలోనే విశాఖపట్నంలో జరిగిన హాఫ్‌ మారథాన్‌ పూర్తి చేశా. 2017 జనవరిలో ముంబైలో జరిగిన 42.2 కిలోమీటర్ల మారథాన్‌ను 4.55 గంటల్లో పూర్తి చేయగలిగా. అప్పుడు నాకు నమ్మకం బాగా పెరిగింది. 2018లో హైదరాబాద్‌లో జరిగిన 55 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్‌లో రెండో స్థానం సాధించా. వీటన్నింటి తర్వాత నా దృష్టి విదేశాల్లో జరిగే మారథాన్‌లపై పడింది. 

మేజర్‌ మారథాన్‌లలో పాల్గొంటూ.. 
జర్మనీలోని బెర్లిన్, అమెరికాలో బోస్టన్, షికాగో, న్యూయార్క్, లండన్, జపాన్‌లోని టోక్యోలో అంతర్జాతీయ మారథాన్‌లు జరుగుతాయి. విపరీతమైన వేడి ఉండే దుబాయ్‌ మారథాన్‌లో ఐదు గంటలపాటు పరిగెత్తాను. ఉక్కపోతతో పరుగు తీయడం కష్టంగా మారినా లక్ష్యాన్ని చేరుకున్నా. 2018 నుంచి 2019లోపు వరల్డ్‌ మేజర్‌ మారథాన్‌లైన బెర్లిన్, బోస్టన్, షికాగో, న్యూయార్క్‌ మారథాన్‌లలో దిగ్విజయంగా పరుగులు పెట్టా. ఇటీవల లండన్‌లో జరిగిన మారథాన్‌లో 42.6 కిలోమీటర్లను ఐదు గంటల 15 నిమిషాల్లో చేరా. జపాన్‌లోని టోక్యోలో జరిగే మారథాన్‌లో పాల్గొంటే నా కల పూర్తిగా సాకారమవుతుంది.  

వరంగల్‌లోనూ మారథాన్‌ నిర్వహించేలా 
పరుగు కోసం చాలా సమయం కేటాయించాలి. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరోవైపు మారథాన్‌లో పాల్గొనడంపై దృష్టి సారించా. హైదరాబాద్‌ రన్నర్స్‌ ఏటా మారథాన్‌ నిర్వహిం చినట్టుగా వరంగల్‌తోపాటు భూపాలపల్లిలోనూ 5కే, 10కే రన్‌ నిర్వహించాలనుకుంటున్నా. టోక్యో లో మారథాన్‌ పూర్తిచేశాకే దీనిపై దృష్టిసారించి యువతకు ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తా. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top