London marathon
-
రికార్డు ‘బ్రేక్’
ఏ క్రీడలో అయినా... రికార్డులు ఉండేది బద్దలు కావడానికే. అసాధ్యం అనుకున్న రికార్డులు సైతం అద్భుత ప్రదర్శన ముందు తలవంచాల్సిందే. ఇటీవల పురుషుల మారథాన్‌లో కెన్యా అథ్లెట్ సెబాస్టియన్ సావీ కూడా ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రతిష్టాత్మక లండన్ మారథాన్‌లో ఈ కెన్యా అథ్లెట్... 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటి వరకు మారథాన్‌ను రెండు గంటల లోపు ఎవరూ పూర్తి చేయలేకపోగా... ఆ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా సెబాస్టియన్ సావీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వేర్వేరు క్రీడాంశాల్లో ఇలాంటి మరికొన్ని రికార్డులను ఓసారి పరిశీలిస్తే... సాహో... సెబాస్టియన్ మారథాన్‌లో కెన్యా రన్నర్లకు తిరుగులేదని సెబాస్టియన్ సావీ మరోసారి నిరూపించాడు. ఈ నెల 26న లండన్ మారరథాన్లో అతడు 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలోనే చేరుకొని రికార్డు నెలకొల్పాడు. 2023లో కెన్యాకే చెందిన కెలి్వన్ కిప్టుమ్ 2 గంటల 35 సెకన్లలో మారథాన్ రేసును పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించగా... తాజాగా సెబాస్టియన్ దీన్ని సవరించాడు. భారత్ విషయానికి వస్తే... సావన్ భర్వాల్ ఇటీవల 48 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ నెల 12 రోటెర్డామ్ మారథాన్‌ను సావన్ 2 గంటల 11 నిమిషాల 58 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో దిగ్గజ అథ్లెట్ శివనాథ్ సింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. 1978లో శివనాథ్ సింగ్ 2 గంటల 12 నిమిషాల్లో గమ్యాన్ని చేరగా... ఇప్పుడు రెండు సెకన్ల తేడాతో సావన్ నేషనల్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. 15సార్లు రికార్డు బద్దలు... పురుషుల పోల్‌వాల్ట్‌లో స్వీడన్‌కు చెందిన అర్మాండ్ డుప్లాంటిస్ రికార్డు స్థాయిలో ఏకంగా 15 సార్లు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో ప్రస్తుతం 6.31 మీటర్ల ఎత్తు దూకి డుప్లాంటిస్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. 2020 నుంచి డుప్లాంటిస్ ఈ రికార్డును తిరగరాస్తూ వస్తున్నాడు. అయితే అంతకుముందు ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ బుబ్కా 1993లో నమోదు చేసిన రికార్డు (6.15 మీటర్లు) 21 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2014లో దాన్ని ఫ్రాన్స్‌కు చెందిన రెనాడ్ లావిలెనీ (6.16 మీటర్లు) బ్రేక్ చేయగా... ఆ తర్వాత నుంచి డుప్లాంటిస్ జోరు కొనసాగిస్తున్నాడు.41 ఏళ్ల తర్వాత... మహిళల 400 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కే బోల్ 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2023, ఫిబ్రవరి 19న జరిగిన పోటీల్లో బోల్ 400 మీటర్ల దూరాన్ని 49.26 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 1982లో చెకోస్లోవేకియాకు చెందిన జర్మిలా క్రాటోచ్విలోవా 49.59 సెకన్లతో రికార్డు సృష్టించగా... నాలుగు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్ అథ్లెట్ దీన్ని బద్దలు కొట్టింది.35 ఏళ్లుగా పదిలంగా... పురుషుల లాంగ్‌జంప్‌లో 23 ఏళ్లుగా నిలిచి ఉన్న ప్రపంచ రికార్డును అమెరికా అథ్లెట్ 1991లో బద్దలు కొట్టగా... అప్పటి నుంచి ఈ రికార్డు అతడి పేరిటే ఉంది. అమెరికాకు చెందిన మైక్ పావెల్ 1991 ఆగస్టు 30న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 8.95 మీటర్ల దూరం దూకి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముదు ఈ ఘనత అమెరికాకే చెందిన బాబ్ బీమన్ పేరిట ఉంది. బాబ్ 1968లో 8.90 మీటర్ల దూరం లంఘించాడు.కెన్యా అథ్లెట్లదే హవా...మహిళల మారథాన్‌లో బ్రిటన్ రన్నర్ పౌలా రాడ్‌క్లిఫ్ నెలకొల్పిన రికార్డు 16 ఏళ్ల పాటు పదిలంగా కొనసాగింది. 2003లో రాడ్‌క్లిఫ్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేయగా... 2019లో కెన్యా అథ్లెట్ బ్రిగిడ్ కొస్గెయ్ 2 గంటల 14 నిమిషాల 4 సెకన్లలో గమ్యాన్ని చేరి రికార్డు బ్రేక్ చేసింది. ఈ విభాగంలో ప్రస్తుతం కెన్యాకే చెందిన రుత్ చెప్గెటిచ్ (2 గంటల 9 నిమిషాల 56 సెకన్లు) పేరిట ఈ రికార్డు ఉంది. గ్యారీ సోబర్స్ పేరిట 36 ఏళ్లు... టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సుదీర్ఘ కాలం వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ పేరిటే ఉంది. 1958లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సోబర్స్ 365 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత 1994లో ఈ రికార్డును విండీస్‌కే చెందిన బ్రియాన్ లారా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 375 పరుగులతో సవరించాడు. ఆ తర్వాత 2003లో ఆ్రస్టేలియా ప్లేయర్ మాథ్యూ హెడెన్ జింబాబ్వేపై 380 పరుగులతో లారా రికార్డును బ్రేక్ చేయగా... 2004లో లారా మరోసారి ఇంగ్లండ్‌పై 400 పరుగులు చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఘనత లారా పేరిటే కొనసాగుతోంది. → నాలుగేళ్ల క్రితం భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు థామస్ కప్ గెలుచుకుంది. 73 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో భారత జట్టు థామస్ కప్ గెలవడం అదే మొదటిసారి. → ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి 61 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. చివరిసారిగా భారత్ నుంచి 1965లో దినేశ్ ఖన్నా ఈ టోర్నమెంట్లో ఫైనల్ ఆడారు. → భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 2023లో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం కాగా... ఓవరాల్‌గా 1965లో దినేశ్ ఖన్నా తర్వాత 58 ఏళ్లకు మరోసారి భారత్‌కు ఈ టోర్నమెంట్లో బంగారు పతకం లభించింది. → ఆంధ్రప్రదేశ్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 2018 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నాడు. 1980లో మన దేశం నుంచి చివరిసారిగా ప్రకాశ్ పదుకోన్ ఈ ఘనత సాధించగా... 38 ఏళ్ల తర్వాత శ్రీకాంత్ దానిని పునరావృతం చేశాడు. → 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా సాయిప్రణీత్ 36 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు. 1983లో భారత్ నుంచి చివరిసారిగా ప్రకాశ్ పదుకోన్ ఈ టోర్నమెంట్లో పతకం గెలిచాడు. సాయిప్రణీత్ తర్వాత భారత్ నుంచి 2021లో కిడాంబి శ్రీకాంత్ రజతం... లక్ష్య సేన్ కాంస్యం... 2023లో ప్రణయ్ కాంస్యం సాధించారు. → బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత ప్లేయర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. 2019లో సింధు ఈ ఘనత అందుకుంది. వరుస ఒలింపిక్స్‌లో (2016లో రజతం; 2020లో కాంస్యం) పతకాలు సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గానూ సింధు చరిత్రకెక్కింది.మరికొన్ని... బ్యాడ్మింటన్‌లో ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. భారత్ తరఫున తొలిసారి ప్రకాశ్ పదుకోన్ 1980లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించగా... 21 ఏళ్ల తర్వాత పుల్లెల గోపీచంద్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత మరే భారత షట్లర్ ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లో విజేతగా నిలవలేకపోయాడు. –సాక్షి క్రీడావిభాగం -
అసీఫా ప్రపంచ రికార్డు
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ రేసులో మహిళల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఆదివారం జరిగిన ఈ రేసులో ఇథియోపియాకు చెందిన టిగ్స్ట్ అసీఫా విజేతగా అవతరించింది. 42.195 కిలోమీటర్ల దూరాన్ని 28 ఏళ్ల అసీఫా 2 గంటల 15 నిమిషాల 50 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని అందుకుంది. ఈ క్రమంలో 2 గంటల 16 నిమిషాల 16 సెకన్లతో పెరెస్ జెప్చిర్చిర్ (కెన్యా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అసీఫా బద్దలు కొట్టింది. గత ఏడాది లండన్ మారథాన్‌లోనే పెరెస్ జెప్చిర్చిర్ ఈ ప్రపంచ రికార్డును సృష్టించి స్వర్ణ పతకాన్ని సాధించగా... అసీఫా రెండో స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. ఈ సంవత్సరం పెరెస్ జెప్చిర్చిర్ లండన్ మారథాన్‌కు దూరం కాగా... అసీఫా అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకోవడంపాటు ప్రపంచ రికార్డును లిఖించింది. జాయ్స్లిన్ జెప్కోస్గి (కెన్యా; 2గం:18ని:44 సెకన్లు) రజతం, సిఫాన్ హసన్ (నెదర్లాండ్స్; 2గం:19నిమిషాలు) కాంస్యం సాధించారు. గత ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన అసీఫా 2022, 2023 బెర్లిన్ మారథాన్ రేసుల్లోనూ విజేతగా నిలిచింది. లండన్ మారథాన్ పురుషుల విభాగంలో సెబాస్టియన్ సావీ (కెన్యా) విజేతగా నిలిచాడు. సెబాస్టియన్ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 2 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. జేకబ్ కిప్లిమో (ఉగాండా; 2గం:3ని:37 సెకన్లు) రజతం, అలెగ్జాండర్ ముతిసో (కెన్యా; 2గం:4ని:20 సెకన్లు) కాంస్యం సాధించారు. -
లండన్ మారథాన్‌లో ప్రపంచ రికార్డు!
లండన్: ప్రతిష్టాత్మక లండన్ మారథాన్ పరుగు ప్రపంచ రికార్డు కొల్లగొట్టనుంది. రికార్డు స్థాయిలో అథ్లెట్లు లండన్ మారథాన్ రేసును పూర్తి చేస్తారనే అంచనాలు అమాంతం పెరిగాయి. వచ్చే నెల 27న లండన్ నగరంలో జరిగే ఈ మారథాన్ (42.195 కిలోమీటర్లు) పరుగులో పోటీపడేందుకు ఇప్పటికే 8 లక్షల 40 వేల మందికిపైగా ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గతేడాది ఈ ఈవెంట్లో 5,78,304 రన్నర్లకంటే ఇది చాలా అధికం. పురుషులతో దీటుగా మహిళా రన్నర్లు ఆసక్తి చూపడం విశేషం. 8 లక్షల 40 వేల ఔత్సాహికుల్లో 49 శాతం మహిళలు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పేర్లు నమోదు చేసుకున్న వారిలో 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయస్సున్న యువతులు ఏకంగా 105 శాతం పెరగడం విశేషం! ఇప్పటివరకు పూర్తి మారథాన్ పరుగు దూరాన్ని 55,646 మంది పూర్తి చేశారు. గత నవంబర్‌లో న్యూయార్క్ మారథాన్‌లో ఈ రికార్డు నమోదైంది. అయితే ఈసారి సుమారు ఎనిమిదిన్నర లక్షల మంది బరిలో దిగడానికి ఆసక్తి చూపడంతో పూర్తి చేసేవారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే పెరుగుతుందని నిర్వాహకులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఏప్రిల్ 27న జరిగే 45వ లండన్ మారథాన్ కొత్త మైలురాయికి చేరుకోబోతోంది. అత్యధిక సంఖ్యలో పరుగును పూర్తిచేసే రికార్డు సాకారం కానుంది. ఇదే జరిగితే ముమ్మాటికి మా మారథాన్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది’ అని లండన్ మారథాన్ ఈవెంట్స్ సీఈఓ హ్యూజ్ బ్రాషెర్ తెలిపారు. నగరంలోని గ్రీన్విచ్ నుంచి ద మాల్ వరకు సాగే 42.195 కిలోమీటర్ల దూరాన్ని ఈసారి 56 వేల పైచిలుకు మంది పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. 1981లో లండన్ మారథాన్ మొదలైంది. ఆ ఏడాది తొలి మారథాన్‌లో ఏకంగా 13 లక్షల మంది బరిలోకి దిగారు. -
విషాదం నింపిన మారథాన్.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్
గత ఆదివారం నిర్వహించిన లండన్ మారథాన్ 2022లో విషాదం నెలకొంది. మారథాన్‌లో పాల్గొన్న 36 ఏళ్ల అథ్లెట్ ట్రాక్‌పైనే కుప్పకూలాడు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అథ్లెట్ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. అయితే చనిపోయిన అథ్లెట్ కుటుంబసభ్యుల వినతి మేరకు నిర్వాహకులు పేరును వెల్లడించలేదు. అయితే అథ్లెట్ మాత్రం సౌత్-ఈస్ట్ ఇంగ్లండ్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరో మూడు మైళ్లు చేరుకుంటే అతని రేసు పూర్తయ్యేది.. కానీ విధి మరోలా తలిచింది అంటూ మారథాన్ నిర్వాహకులు తమ బాధను వ్యక్తం చేశారు. ''లండన్ మారథాన్‌లో పాల్గొన్న ప్రతి అథ్లెట్ ఇవాళ మరణించిన తమ సహచర అథ్లెట్‌కు నివాళి అర్పిస్తున్నారు. అతని కుటుంబసభ్యుల వినతి మేరకు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచాలని భావించాం. అతని కుటుంబసభ్యులకు ఇవే మా ప్రగాడ సానభుతి.''అంటూ పేర్కొంది. ఇక అథ్లెట్ మరణంపై తుది రిపోర్టు రావాల్సి ఉందని నిర్వహాకులు పేర్కొన్నారు. ఇక ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా లండన్ మారథాన్ 2022 ఘనంగా జరిగింది. దాదాపు 40వేల మంది ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. 26.2 మైళ్ల దూరంలో భాగంగా సౌత్ లండన్‌లోని గ్రీన్విచ్ నుంచి మాల్ వరకు ఈ మారథాన్ జరిగింది. పురుషుల విభాగంలో కెన్యాకు చెందిన అమోస్ కిప్రుటో విజయం సాధించాడు. కిప్రుటో రెండు గంటల నాలుగు నిమిషాల 39 సెకన్లలో మారథాన్‌ను పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఇథియోపియాకు చెందిన యెహువాలా మారథాన్‌ను 2 గంటల 17 నిమిషాల 25 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ -
అంతర్జాతీయ మారథాన్లలో వరంగల్ ‘జ్యోతి’
సాక్షి, వరంగల్: పాప జన్మించిన సమయంలో ఆమెకు థైరాయిడ్ సమస్య నిర్ధారణ అయింది. మందులతోనే సమస్య తగ్గదన్న వైద్యుడి సూచన మేరకు తొలుత యోగా, వాకింగ్ మొదలుపెట్టిన ఆమె.. ఆ తరువాత పరుగుపై దృష్టిపెట్టింది. ఆమె ప్రారంభించిన పరుగు 46వ ఏట పూర్తిస్థాయిలో పట్టాలెక్కింది. తొలుత భారత్‌లో జరిగిన మారథాన్లలో పరుగులు పెట్టిన ఆమె కాళ్లు...అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న ఐదు మారథాన్లను చుట్టివచ్చాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భార్య, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి వయస్సు 51 ఏళ్లు. ఆమె ఇటీవల లండన్ మారథాన్‌లో లక్ష్యాన్ని పూర్తి చేసి మెడల్ దక్కించుకొని వరంగల్ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమ్మకాన్ని పెంచిన ముంబై మారథాన్ 23 ఏళ్ల వయసులో థైరాయిడ్ వచ్చింది. బరువు పెరిగి ఏ పని చేయాలన్నా శరీరం సహకరించలేదు. మందులతోపాటు వ్యాయామం చేస్తే ఫలితాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. కొన్నాళ్ల పాటు ఇంటి పరిసరాల్లోనే యోగా, వాకింగ్ చేసేదాన్ని. అయితే కొన్నాళ్ల తర్వాత హైదరాబాద్ కేబీఆర్ పార్కుకు వాకింగ్ వెళ్లా. ఆ సమయంలో మారథాన్ క్లబ్ గురించి తెలుసుకొని వారి వద్ద శిక్షణలో చేరా. ఇందుకోసం అత్యంత కష్టమైన ట్రెక్కింగ్ కూడా చేశాను. వారానికి రెండుసార్లు లాంగ్‌రన్‌లు, నిత్యం వ్యాయామం చేశా. విశాఖపట్నం, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో ఎక్కడా మారథాన్ నిర్వహించినా వెళ్లి పాల్గొన్నా. 2016 మేలో శిక్షణ ప్రారంభించిన ఏడాదిలోనే విశాఖపట్నంలో జరిగిన హాఫ్ మారథాన్ పూర్తి చేశా. 2017 జనవరిలో ముంబైలో జరిగిన 42.2 కిలోమీటర్ల మారథాన్‌ను 4.55 గంటల్లో పూర్తి చేయగలిగా. అప్పుడు నాకు నమ్మకం బాగా పెరిగింది. 2018లో హైదరాబాద్‌లో జరిగిన 55 కిలోమీటర్ల అల్ట్రా మారథాన్‌లో రెండో స్థానం సాధించా. వీటన్నింటి తర్వాత నా దృష్టి విదేశాల్లో జరిగే మారథాన్లపై పడింది. మేజర్ మారథాన్లలో పాల్గొంటూ.. జర్మనీలోని బెర్లిన్, అమెరికాలో బోస్టన్, షికాగో, న్యూయార్క్, లండన్, జపాన్‌లోని టోక్యోలో అంతర్జాతీయ మారథాన్లు జరుగుతాయి. విపరీతమైన వేడి ఉండే దుబాయ్ మారథాన్‌లో ఐదు గంటలపాటు పరిగెత్తాను. ఉక్కపోతతో పరుగు తీయడం కష్టంగా మారినా లక్ష్యాన్ని చేరుకున్నా. 2018 నుంచి 2019లోపు వరల్డ్ మేజర్ మారథాన్‌లైన బెర్లిన్, బోస్టన్, షికాగో, న్యూయార్క్ మారథాన్లలో దిగ్విజయంగా పరుగులు పెట్టా. ఇటీవల లండన్‌లో జరిగిన మారథాన్‌లో 42.6 కిలోమీటర్లను ఐదు గంటల 15 నిమిషాల్లో చేరా. జపాన్‌లోని టోక్యోలో జరిగే మారథాన్‌లో పాల్గొంటే నా కల పూర్తిగా సాకారమవుతుంది. వరంగల్లోనూ మారథాన్ నిర్వహించేలా పరుగు కోసం చాలా సమయం కేటాయించాలి. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరోవైపు మారథాన్‌లో పాల్గొనడంపై దృష్టి సారించా. హైదరాబాద్ రన్నర్స్ ఏటా మారథాన్ నిర్వహిం చినట్టుగా వరంగల్‌తోపాటు భూపాలపల్లిలోనూ 5కే, 10కే రన్ నిర్వహించాలనుకుంటున్నా. టోక్యో లో మారథాన్ పూర్తిచేశాకే దీనిపై దృష్టిసారించి యువతకు ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తా. -
అంతరిక్షంలో 42 కిలోమీటర్ల పరుగు పందెం!
లండన్: బ్రిటన్ వ్యోమగామి టిమ్ పీక్ రికార్డు సృష్టించారు. అంతరిక్షంలో 42 కిలోమీటర్ల మారథాన్ అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ఔరా అనిపించాడు. తాను చేసిన ఈ సాహసాన్ని లండన్‌లో పలువురు ప్రత్యక్షంగా వీక్షించారు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ రికార్డు నమోదైంది. బ్రిటిష్ యూరోపియన్ ఎజెన్సీకి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. మొత్తం ఆరు నెలల కార్యక్రమం కోసం ఈ స్టేషన్ కు వెళ్లిన టిమ్ ఆ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఒక ట్రెడ్ మిల్ ను ఏర్పాటుచేసుకొని ఈ మారథాన్ ప్రారంభించాడు. మొత్తం 3గంటల 35 నిమిషాల్లో ఈ మారథాన్ పూర్తి చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. గతంలో ఈ రికార్డు భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునితా విలియమ్స్ పేరిట ఉంది. ఆమె బోస్టన్ మారథాన్ పేరిట 2007లో ఇదే లక్ష్యాన్ని 4 గంటల 24 నిమిషాల్లో పూర్తి చేశారు. కాగా, టిమ్ మాత్రం లండన్ మారథాన్ పేరిట ఈ పరుగును పూర్తి చేసి గిన్నిస్ కు చేరారు. అసలు గ్రావిటీ ఏమాత్రం ఉండని కక్షలో ఉండి ఇంత వేగంగా మారథాన్ పూర్తి చేయడం నిజంగా ఒక ప్రపంచ రికార్డు అని గిన్నిస్ వరల్డ్ తెలిపింది. ఈ 44 ఏళ్ల మారథాన్ వీరుడు.. భూమిపై ఉన్న 39 వేలమంది మారథాన్ పోటీ దారుల్లో ఒకరు కూడా.


