రికార్డు ‘బ్రేక్‌’  | Athletes records in different sports | Sakshi
Sakshi News home page

రికార్డు ‘బ్రేక్‌’ 

Apr 30 2026 5:52 AM | Updated on Apr 30 2026 5:51 AM

Athletes records in different sports

ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న అథ్లెట్లు 

దశాబ్దాల నాటి గణాంకాలకు కొత్త సొబగులు

ఏ క్రీడలో అయినా... రికార్డులు ఉండేది బద్దలు కావడానికే. అసాధ్యం అనుకున్న రికార్డులు సైతం అద్భుత ప్రదర్శన ముందు తలవంచాల్సిందే. ఇటీవల పురుషుల మారథాన్‌లో కెన్యా అథ్లెట్‌ సెబాస్టియన్‌ సావీ కూడా ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్రతిష్టాత్మక లండన్‌ మారథాన్‌లో ఈ కెన్యా అథ్లెట్‌... 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇప్పటి వరకు మారథాన్‌ను రెండు గంటల లోపు ఎవరూ పూర్తి చేయలేకపోగా... ఆ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా సెబాస్టియన్‌ సావీ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. వేర్వేరు క్రీడాంశాల్లో ఇలాంటి మరికొన్ని రికార్డులను ఓసారి పరిశీలిస్తే... 
 

సాహో... సెబాస్టియన్‌ 
మారథాన్‌లో కెన్యా రన్నర్‌లకు తిరుగులేదని సెబాస్టియన్‌ సావీ మరోసారి నిరూపించాడు. ఈ నెల 26న లండన్‌ మారరథాన్‌లో అతడు 42.195 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 59 నిమిషాల 30 సెకన్లలోనే చేరుకొని రికార్డు నెలకొల్పాడు. 2023లో కెన్యాకే చెందిన కెలి్వన్‌ కిప్టుమ్‌ 2 గంటల 35 సెకన్లలో మారథాన్‌ రేసును పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించగా... తాజాగా సెబాస్టియన్‌ దీన్ని సవరించాడు. 
 
భారత్‌ విషయానికి వస్తే... సావన్‌ భర్వాల్‌ ఇటీవల 48 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ నెల 12 రోటెర్‌డామ్‌ మారథాన్‌ను సావన్‌ 2 గంటల 11 నిమిషాల 58 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో దిగ్గజ అథ్లెట్‌ శివనాథ్‌ సింగ్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలైంది. 1978లో శివనాథ్‌ సింగ్‌ 2 గంటల 12 నిమిషాల్లో గమ్యాన్ని చేరగా... ఇప్పుడు రెండు సెకన్ల తేడాతో సావన్‌ నేషనల్‌ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.  

15సార్లు రికార్డు బద్దలు...  
పురుషుల పోల్‌వాల్ట్‌లో స్వీడన్‌కు చెందిన అర్మాండ్‌ డుప్లాంటిస్‌ రికార్డు స్థాయిలో ఏకంగా 15 సార్లు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ విభాగంలో ప్రస్తుతం 6.31 మీటర్ల ఎత్తు దూకి డుప్లాంటిస్‌ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు. 2020 నుంచి డుప్లాంటిస్‌ ఈ రికార్డును తిరగరాస్తూ వస్తున్నాడు. అయితే అంతకుముందు ఉక్రెయిన్‌కు చెందిన సెర్గీ బుబ్కా 1993లో నమోదు చేసిన రికార్డు (6.15 మీటర్లు) 21 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంది. 2014లో దాన్ని ఫ్రాన్స్‌కు చెందిన రెనాడ్‌ లావిలెనీ (6.16 మీటర్లు) బ్రేక్‌ చేయగా... ఆ తర్వాత నుంచి డుప్లాంటిస్‌ జోరు కొనసాగిస్తున్నాడు.

41 ఏళ్ల తర్వాత... 
మహిళల 400 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్‌కే బోల్‌ 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2023, ఫిబ్రవరి 19న జరిగిన పోటీల్లో బోల్‌ 400 మీటర్ల దూరాన్ని 49.26 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు 1982లో చెకోస్లోవేకియాకు చెందిన జర్మిలా క్రాటోచ్‌విలోవా 49.59 సెకన్లతో రికార్డు సృష్టించగా... నాలుగు దశాబ్దాల తర్వాత నెదర్లాండ్స్‌ అథ్లెట్‌ దీన్ని బద్దలు కొట్టింది.

35 ఏళ్లుగా పదిలంగా... 
పురుషుల లాంగ్‌జంప్‌లో 23 ఏళ్లుగా నిలిచి ఉన్న ప్రపంచ రికార్డును అమెరికా అథ్లెట్‌ 1991లో బద్దలు కొట్టగా... అప్పటి నుంచి ఈ రికార్డు అతడి పేరిటే ఉంది. అమెరికాకు చెందిన మైక్‌ పావెల్‌ 1991 ఆగస్టు 30న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 8.95 మీటర్ల దూరం దూకి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముదు ఈ ఘనత అమెరికాకే చెందిన బాబ్‌ బీమన్‌ పేరిట ఉంది. బాబ్‌ 1968లో 8.90 మీటర్ల దూరం 
లంఘించాడు.

కెన్యా అథ్లెట్లదే హవా...
మహిళల మారథాన్‌లో బ్రిటన్‌ రన్నర్‌ పౌలా రాడ్‌క్లిఫ్‌ నెలకొల్పిన రికార్డు 16 ఏళ్ల పాటు పదిలంగా కొనసాగింది. 2003లో రాడ్‌క్లిఫ్‌ 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 15 నిమిషాల 56 సెకన్లలో పూర్తి చేయగా... 2019లో కెన్యా అథ్లెట్‌ బ్రిగిడ్‌ కొస్‌గెయ్‌ 2 గంటల 14 నిమిషాల 4 సెకన్లలో గమ్యాన్ని చేరి రికార్డు బ్రేక్‌ చేసింది. ఈ విభాగంలో ప్రస్తుతం కెన్యాకే చెందిన రుత్‌ చెప్‌గెటిచ్‌ (2 గంటల 9 నిమిషాల 56 సెకన్లు) పేరిట ఈ రికార్డు ఉంది.  

గ్యారీ సోబర్స్‌ పేరిట 36 ఏళ్లు... 
టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సుదీర్ఘ కాలం వెస్టిండీస్‌ దిగ్గజం గ్యారీ సోబర్స్‌ పేరిటే ఉంది. 1958లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సోబర్స్‌ 365 పరుగులు చేశాడు. 36 ఏళ్ల తర్వాత 1994లో ఈ రికార్డును విండీస్‌కే చెందిన బ్రియాన్‌ లారా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 375 పరుగులతో సవరించాడు. ఆ తర్వాత 2003లో ఆ్రస్టేలియా ప్లేయర్‌ మాథ్యూ హెడెన్‌ జింబాబ్వేపై 380 పరుగులతో లారా రికార్డును బ్రేక్‌ చేయగా... 2004లో లారా మరోసారి ఇంగ్లండ్‌పై 400 పరుగులు చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిట మార్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఘనత లారా పేరిటే కొనసాగుతోంది.  

→ నాలుగేళ్ల క్రితం భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు థామస్‌ కప్‌ గెలుచుకుంది. 73 ఏళ్ల ఈ టోర్నమెంట్‌ చరిత్రలో భారత జట్టు థామస్‌ కప్‌ గెలవడం అదే మొదటిసారి.  

→ ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా భారత యువ షట్లర్‌ ఆయుశ్‌ శెట్టి 61 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. చివరిసారిగా భారత్‌ నుంచి 1965లో దినేశ్‌ ఖన్నా ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌ ఆడారు. 

→ భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 2023లో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం కాగా... ఓవరాల్‌గా 1965లో దినేశ్‌ ఖన్నా తర్వాత 58 ఏళ్లకు మరోసారి భారత్‌కు ఈ టోర్నమెంట్‌లో 
బంగారు పతకం లభించింది.  

→ ఆంధ్రప్రదేశ్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 2018 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకున్నాడు. 1980లో మన దేశం నుంచి చివరిసారిగా ప్రకాశ్‌ పదుకోన్‌ ఈ ఘనత సాధించగా... 38 ఏళ్ల తర్వాత శ్రీకాంత్‌ దానిని పునరావృతం చేశాడు.  

→ 2019 బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకోవడం ద్వారా సాయిప్రణీత్‌ 36 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేశాడు. 1983లో భారత్‌ నుంచి చివరిసారిగా ప్రకాశ్‌ పదుకోన్‌ ఈ టోర్నమెంట్‌లో పతకం గెలిచాడు. సాయిప్రణీత్‌ తర్వాత భారత్‌ నుంచి 2021లో కిడాంబి 
శ్రీకాంత్‌ రజతం... లక్ష్య సేన్‌ కాంస్యం... 2023లో ప్రణయ్‌ కాంస్యం సాధించారు.  

→ బ్యాడ్మింటన్‌ మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత ప్లేయర్‌గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. 2019లో సింధు ఈ ఘనత అందుకుంది. వరుస ఒలింపిక్స్‌లో (2016లో రజతం; 2020లో కాంస్యం) పతకాలు సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గానూ సింధు చరిత్రకెక్కింది.

మరికొన్ని... 
బ్యాడ్మింటన్‌లో ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. భారత్‌ తరఫున తొలిసారి ప్రకాశ్‌ పదుకోన్‌ 1980లో ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించగా... 21 ఏళ్ల తర్వాత పుల్లెల గోపీచంద్‌ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఆ తర్వాత మరే భారత షట్లర్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలవలేకపోయాడు.  

 –సాక్షి క్రీడావిభాగం  

Advertisement
 
Advertisement
Advertisement