వచ్చి చర్చించండి.. వర్సిటీల కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై సబితకు గవర్నర్‌ పిలుపు

Telangana Universities Common Recruitment Bill Tamilisai Sabitha - Sakshi

బిల్లుపై తమిళిసై అభ్యంతరాలు

ఇప్పుడున్న విధానంతో ఉన్న ఇబ్బందులు ఏమిటి?

కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులొస్తే మరింత జాప్యం 

ఎనిమిదేళ్లుగా వర్సిటీల పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు? 

మూడేళ్లలో ఎన్నోసార్లు లేఖలు రాసినా ఏం చేశారు? 

రాజ్‌భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రికి పిలుపు 

కొత్త విధానం చెల్లుబాటుపై యూజీసీ సలహా కోరిన గవర్నర్‌  

రెండు నెలలుగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో 7 బిల్లులు 

ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య ముదిరిన విభేదాలు?

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ షాకిచ్చారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు–2022’ విషయంలో పలు సందేహాలు ఉన్నాయని.. దీనిపై రాజ్‌భవన్‌కు వచ్చి తనతో చర్చించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి సోమవారం గవర్నర్‌ లేఖ రాశారు. వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇప్పుడున్న విధానంలో ఇబ్బందులేమిటని.. కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలాగని ప్రశ్నించారు.

ఇదే సమయంలో ఈ కొత్త విధానంపై అభిప్రాయం వ్యక్తం చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)కి గవర్నర్‌ లేఖ రాశారు. కొంతకాలం నుంచి రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై లేఖలు చర్చనీయాంశంగా మారాయి. యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి విద్యా మంత్రికి రాసిన లేఖలో గవర్నర్‌ పలు సందేహాలు లేవనెత్తారు.

‘‘ప్రస్తుత విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంలో ఉన్న ఇబ్బందులు ఏమిటి? కొత్త విధానంతో న్యాయపరమైన చిక్కులు ఎదురై పోస్టుల భర్తీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగార్థులు నష్టపోరా? గత ఎనిమిదేళ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోలేదు? యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని గత 3 ఏళ్లలో తాను ఎన్నోసార్లు లేఖలు రాసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అని ప్రశ్నించారు.

ఈ అంశాలపై చర్చించడానికి రాజ్‌భవన్‌కు రావాలని మంత్రి సబితను కోరారు. ఇక రాష్ట్రంలోని వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయడం చట్టబద్ధమేనా? న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవుతుందా? అన్న విషయంలో అభిప్రాయం చెప్పాలని యూజీసీని గవర్నర్‌ తమిళిసై కోరారు. ఈ మేరకు యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. 

ఇంకా పెండింగ్‌లోనే 7 బిల్లులు 
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 13న తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుతోపాటు మరో ఏడు బిల్లులను శాసనసభ, శాసనమండలిలలో ఆమోదించి గవర్నర్‌కు పంపింది. అందులో ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లును గవర్నర్‌ ఆమోదించి తిరిగి పంపారు. వర్సిటీల బిల్లు సహా ఏడు బిల్లులు ఇంకా రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ములుగు అటవీ కళాశాలను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, తెలంగాణ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లు, పురపాలికల చట్ట సవరణ బిల్లు, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు, పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్ట సవరణ బిల్లు, మోటార్‌ వాహనాలపై పన్నుల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి.

గవర్నర్‌ ఆమోదిస్తే వెంటనే వాటిని అమల్లోకి తీసుకువస్తూ గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో యూనివర్సిటీల బోర్డు బిల్లును గవర్నర్‌ మంగళవారంలోగా ఆమోదించకపోతే.. రాజ్‌భవన్‌ను వేలాది మందితో ముట్టడిస్తామని యూనివర్సిటీ విద్యార్థుల జేఏసీ ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ తమిళిసై మంత్రి సబితకు లేఖ రాసినట్టుగా చెప్తున్నారు. 
 
ఎత్తులు.. పైఎత్తులతో.. 
ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని.. ఈ క్రమంలోనే పరస్పరం బహిరంగ ఆరోపణలు, విమర్శలు వినవస్తున్నాయని రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడీ విభేదాలు ముదిరినట్టుగా కనిపిస్తున్నాయని అంటున్నాయి. గతంలో నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్‌ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంతో విభేదాలు బయటపడ్డాయి. సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లేందుకు గవర్నర్‌ హెలికాప్టర్‌ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వివాదంగా మారింది. తర్వాత గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కే పరిమితం చేసి సాదాసీదాగా నిర్వహించడం పట్ల గవర్నర్‌ బహిరంగంగానే విమర్శలు చేశారు.

సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు రావడం మానేశారని ఆమె ఎన్నో పర్యాయాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించడాన్ని తప్పుపట్టారు. మరోవైపు మంత్రులు బీజేపీ కార్యకలాపాలకు రాజ్‌భవన్‌ అడ్డాగా మారిందని గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఎన్నో వివాదాలు తలెత్తాయి. ఇటీవల తన వ్యక్తిగత ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడం లేదని గవర్నర్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. తనను కలిసేందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులెవరూ రాకపోవడంతోనే.. యూనివర్సిటీల నియామకాల బిల్లును అడ్డు పెట్టుకుని మంత్రిని పిలుస్తూ గవర్నర్‌ లేఖ రాశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

రాజ్‌భవన్‌కు వెళ్తారా? 
సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు ఏడాదికాలం నుంచి రాజ్‌భవన్‌తో అంటీముట్టనట్టు ఉంటున్న నేపథ్యంలో ఓ రాష్ట్ర మంత్రికి గవర్నర్‌ నుంచి పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్‌ లేఖకు స్పందించి మంత్రి సబిత రాజ్‌భవన్‌కు వెళ్తారా, లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోతే మాత్రం మంత్రి సబితను రాజ్‌భవన్‌కు పంపించే అవకాశాలు ఉండవని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇటీవల గవర్నర్‌ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... ‘‘శాసనసభలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా నా పరిధిలోనిది. గవర్నర్‌గా నాకు విస్తృత అధికారాలు ఉంటాయి. నా పరిధిలోనే నేను నడుచుకుంటున్నాను’’ అని పేర్కొనడం గమనార్హం.   
చదవండి: మోదీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top