ఈటలపై చర్యలు ఏమయ్యాయి? 

Telangana: TPCC Chief Revanth Reddy Speaks To Media - Sakshi

ఆయన బీజేపీలో చేరాక కేసీఆర్‌ ఎందుకు మాట్లాడట్లేదు? 

బండి, కిషన్‌రెడ్డిల యాత్రలు కేసీఆర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాల పోరాటం 

మీడియాతో చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములను ఆక్రమించారని, అవినీతికి పాల్పడ్డారని హడావుడి చేసి ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈటల బీజేపీలో చేరిన తర్వాత దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడడం లేదని, విచారణ నివేదికలు ఎటు పోయాయని నిలదీశారు. ఆదివారం గాంధీభవన్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ మల్లు రవిలతో కలిసి ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ టీఆర్‌ఎస్, బీజేపీలవి కొనుగోలు రాజకీయాలని మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరిక సందర్భంగా ఆయనతో చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చిన ప్రైవేట్‌ విమానం కేసీఆర్‌ ఏర్పాటు చేసిందేనని ఆరోపించారు.

బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ల యాత్రలపై స్పందిస్తూ అవి బీజేపీలోని కేసీఆర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలు చేస్తున్న యాత్రలని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక వ్యవహారం దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ చూసుకుంటుందన్నారు. తాను రావిర్యాల సభలో మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయమైనవి కావని, ఐపీఎస్‌ అధికారిగా ఆయన పనితీరు గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు.

బీఎస్పీతో కలిసి పనిచేయాలన్న చర్చ తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో జరగలేదని చెప్పారు. సీఎం హోదాలో కేసీఆర్‌ దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని, మేడ్చల్‌ జిల్లాలోని మూడుచింతలపల్లి కూడా అదే కోవలోకి వస్తుందని, ఆ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగిందో తాము మీడియాకు చూపిస్తామన్నారు. ఇందుకోసమే ఆ గ్రామంలో 24, 25 తేదీల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నామని చెప్పారు.  

మూడో అడుగు ఖాయం 
మూడో అడుగు కేసీఆర్‌ నెత్తిమీద పెట్టడం ఖాయమని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను గజ్వేల్‌కు వెళ్లడం ఖాయమన్నారు. గజ్వేల్‌లో ఉప ఎన్నికలు రావాలంటే ముందు కేసీఆర్‌ రాజీనామా చేయాలి కదా అని ఓ ప్రశ్నకు బదులిచ్చిన రేవంత్‌.. గజ్వేల్‌కు ఉప ఎన్నికలు వస్తే  తాను పోటీ చేయాలా వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. టీపీసీసీ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని, ఇప్పుడు ప్రజాసమస్యలపైనే కాంగ్రెస్‌ పార్టీ దృష్టి పెట్టిందని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top