తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్‌

Telangana Suspends All Registration Activities - Sakshi

తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆపాలని ఉత్తర్వులు జారీ

వీలునామాలు, వివాహ రిజిస్ట్రేషన్లు యథాతథం

సోమవారం నుంచే ఈ–చలాన్‌ విక్రయాల నిలిపివేత.. ఆగిన కార్యకలాపాలు 

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం జీవో ఎంఎస్‌ నంబర్‌ 102 జారీచేశారు. రిజి స్ట్రేషన్‌ చట్టం–1908 ప్రకారం.. అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు సులభతర మైన, పారదర్శక సేవలందించేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, సాంకేతిక వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించినందున ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. వీలునామాలు, వివాహ రిజిస్ట్రేషన్లు, ఇతర సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కాగా, సోమవారం నుంచే రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ–చలాన్ల విక్రయాలను నిలిపి వేశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆపేయాలన్న ప్రభుత్వ మౌఖిక ఉత్తర్వుల మేరకు గతంలో తీసుకున్న ఈ చలాన్ల ద్వారా మాత్రమే పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు చేశారు. ఇక, మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోతు న్నాయన్న వార్తల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద క్రయవిక్రయదారుల రద్దీ కనిపించింది. (వీఆర్వో వ్యవస్థ రద్దు.. కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో రెవెన్యూ సేవలు)

ఏమో.. ఏం జరుగుతోందో! 
గతంలో ఎన్నడూ లేనివిధంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయడం రిజిస్ట్రేషన్ల శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అసలు శాఖలో ఏం జరుగుతుందోననే ఆందోళన ఆ శాఖ అధికారులు, సిబ్బందిలో వ్యక్తమవుతోంది. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు ఇస్తూ కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నారన్న వార్తల నేపథ్యంలో తమకు ప్రభుత్వం ఎలాంటి విధులు కేటాయిస్తుందో, ఇప్పటికే ఉన్న విధుల్లో ఎన్నిటికి కోత పెడుతుందో అనే చర్చ ఆ శాఖ వర్గాల్లో జరుగుతోంది.

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల వరకే తహసీల్దార్లకు ఇస్తారని.. వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను ప్రస్తుత విధానంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే నిర్వహించనున్నారని, రాష్ట్రంలో ఉన్న 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కొన్ని ఎత్తివేసి, మరికొన్ని కొత్తగా ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 25 కార్యాలయాలను తీసేసి, అదే సంఖ్యలో పట్టణ ప్రాంతాల్లో కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక సబ్‌రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు వీలునామాలు, పెళ్లిళ్లు, సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్లకే పరిమితమవుతారని, చిట్‌ఫండ్‌ వ్యవస్థ కూడా రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top