తెలంగాణ: రానున్న 15 ఏళ్లలో భారీగా తగ్గనున్న యువత..

Telangana Statistical Abstract Report: Youth Declining In The Next 15 Years - Sakshi

 వచ్చే పదిహేనేళ్లలో 15.9 శాతం తగ్గనున్న 15–40 ఏళ్లలోపు వారి జనాభా

42.5 శాతానికి పెరగనున్న 40 ఏళ్ల పైబడిన వారి జనాభా

తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ 2021  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న 15 ఏళ్లలో యువశక్తి తగ్గిపోనుంది. రాష్ట్ర జనాభాలో ప్రస్తుతం 15–40 ఏళ్లలోపు యువత 43.6% ఉండగా 2036 నాటికి ఇందులో 15.9% తగ్గి.. 27.7% కానున్నట్లు అంచనా. బుధవారం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌–2021’లో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. ప్రణాళిక, ఆర్థిక శాఖలు సంయుక్తంగా తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం రానున్న 15 ఏళ్లలో 40 ఏళ్ల పైబడిన వారి జనాభా 42.5 శాతానికి పెరగనుంది.

15–40 ఏళ్లలోపు గణాం కాలను పరిగణనలోకి తీసుకునే 6 శ్లాబుల్లో 35–39 ఏళ్ల శ్లాబు మినహా అన్ని శ్లాబుల్లోనూ తగ్గుదల నమోదు కానుండటం గమనార్హం. 80ఏళ్ల పైబడిన వారి సంఖ్య 82% పెరగనుంది. ఈ గణాంకాల ప్రకారం 2021 నాటికి రాష్ట్ర జనాభా 3,77,25,000 కాగా దేశ జనాభాలో ఇది 2.8 శాతమని అంచనా. రాష్ట్రంలో 50.3 శాతం మంది పురుషులు కాగా, 49.7 శాతం మంది మహిళలున్నారు. 

జోనల్‌ విధానం ఇలా..
2021లో ఏర్పాటైన జోనల్‌ విధానం ప్రకారం రాష్ట్రా న్ని 7 జోన్లుగా విభజించారు. ఇందులో బాసర, భద్రా ద్రి, కాళేశ్వరం, రాజన్న, చార్మినార్, జోగు లాంబ, యాదాద్రి జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్‌లో 4,5 జిల్లాలున్నాయి. బాసర, భద్రాద్రి, కాళేశ్వరం, రాజన్న జోన్లు మల్టీజోన్‌–1గా, చార్మినార్, జోగు లాంబ, యాదాద్రి జోన్లు మల్టీజోన్‌–2 పరిధిలోకి వస్తాయి. 

కోటి దాటిన టూవీలర్లు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల సంఖ్య కోటి దాటింది. మొత్తం వాహనాలు కోటిన్నరకు చేరువలో ఉన్నాయి. గత మూడేళ్లలోనే కొత్తగా 26 లక్షల వాహనాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం గణాంకాల్లో స్కూటర్లు, మోటారు సైకిళ్లు, మోపెడ్లు కలిపి 1.02 కోట్లు, అన్ని రకాల వాహనాలు 1,38,11,466 ఉన్నాయి. ఇవి గత ఆర్థిక సంవత్సరం లెక్కలు. ప్రస్తుతం ఫిబ్రవరి మూడో వారం వరకు నమోదైన ద్విచక్ర వాహనాలు 5 లక్షలు, మిగతా అన్ని వాహనాల సంఖ్యను కలిపి లెక్కిస్తే ఈ సంఖ్య కోటిన్నరకు చేరువైంది. 1,45,00,000గా నమోదైంది.

మరో రెండు మూడు నెలల్లో ఈ సంఖ్య కోటిన్నర దాటనుంది. ప్రస్తుతం సంవత్సరానికి 8 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. 2020–21లో కొత్తగా 8,22,416 వాహనాలు నమోదయ్యాయి. 2019– 20 సంవత్సరంలో ఈ సంఖ్య అత్యధికంగా నమోదైంది. కరోనా వల్ల వ్యక్తిగత వాహనాల కోసం జనం పోటెత్తటంతో కొత్త వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. 12,38,778 వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 లక్షల వాహనాలు అమ్ముడవుతాయని అంచనా.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top