
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విద్య, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత
రూ.1.42 లక్షల కోట్ల మూలధన వ్యయంలో రూ.లక్ష కోట్లకు పైగా సాగునీటి రంగానికే...
తొమ్మిదేళ్లలో విద్యారంగంలో మూలధన వ్యయం కేవలం రూ.2,250 కోట్లు
వైద్యానికి రూ.6,496 కోట్లు.. గ్రామీణాభివృద్ధికి రూ.11 వేల కోట్లు
రెవెన్యూ వ్యయంలో విద్య, వ్యవసాయానికే ప్రాధాన్యత... రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఏటా రూ. 9,300 కోట్లు
అన్ని రంగాల్లో కలిపి మొత్తం ఖర్చు రూ.11.68 లక్షల కోట్లు..
ఆరు రంగాలకు రూ.5.34 లక్షల కోట్లు.. అనివార్య ఖర్చులు రూ.3.9 లక్షల కోట్లు
2013–14 నుంచి 2022–23 వరకు రాష్ట్రాల ఆర్థిక పురోగతి నివేదికలో వెల్లడించిన కాగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి తొమ్మిది సంవత్సరాలలో సాగునీటి రంగానికి ప్రభుత్వం రూ.1,14,145 కోట్లు ఖర్చు చేసినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది. అందులో మూలధన వ్యయం కింద రూ.1,03,894 కోట్లు, రెవెన్యూ వ్యయం కింద రూ.10,251 కోట్లు వెచ్చించినట్టు తెలిపింది. స్టేట్ ఫైనాన్సెస్ (2022–23) పేరుతో రూపొందించిన నివేదికను ఇటీవల జరిగిన అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో కాగ్ విడుదల చేసింది.
పదేళ్ల విశ్లేషణ పేరుతో 2013–14 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, రెవెన్యూ రాబడులు, ఖర్చులు, రాష్ట్రాల సొంతపన్నుల ఆదాయం, కేంద్రం నుంచి పలు రూపాల్లో అందే సాయం, అప్పులు, చెల్లింపులు, అనివార్యంగా చేయాల్సిన ఖర్చులు ఆ పదేళ్ల కాలంలో ఎలా పెరిగాయి.. అన్ని రాష్ట్రాలు ఎలా ఖర్చు పెట్టాయి.. జీఎస్డీపీలో ఈ రంగాల ఖర్చులు, అప్పుల శాతం ఎంత? ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి అనుగుణంగా ఏ రాష్ట్రాలు ఎలా ఖర్చు చేస్తున్నాయనే అంశాలను విశ్లేషించింది. అయితే, తెలంగాణ రాష్ట్రం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ఏర్పాటైనందున తొమ్మిదేళ్ల గణాంకాలను అందులో పొందుపరిచారు.
ఒకటిరెండు రంగాలే..
కాగ్ నివేదిక ప్రకారం అనేక రంగాల్లో దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతూ తొమ్మిదేళ్ల తన ప్రయాణాన్ని కొనసాగించింది. మొదటి తొమ్మిదేళ్లలో సాగునీరు, విద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్టు రెవెన్యూ, మూలధన ఖర్చుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. తొమ్మిదేళ్లలో రూ.1.42 లక్షల కోట్లను మూల ధన వ్యయం కింద ఖర్చు పెట్టగా, రూ.లక్ష కోట్లకు పైగా ఒక్క సాగునీటి రంగంలోనే ఆస్తుల కల్పనకు ఖర్చు చేశారు.
ఆ తర్వాత రవాణా రంగంలో రూ.20 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.11 వేల కోట్లు వెచ్చించారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో మాత్రం మూలధన వ్యయం ఆశించిన మేర జరగలేదు. రెవెన్యూ వ్యయం విషయానికి వస్తే.. విద్యకు రూ.1,08,941 కోట్లు, వ్యవసాయా నికి రూ. 1,08,881 కోట్లు వెచ్చించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి తొమ్మిదేళ్లలో రూ.76,440 కోట్లు ఖర్చు చేశారు.
మూలధన వ్యయంతో కలిపి ఏడాదికి సగటున రూ.9,300 కోట్లు ఖర్చు చేశారని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇక, తొమ్మిదేళ్లలో మొత్తం బడ్జెటరీ ఖర్చు (రెవెన్యూ, మూల ధన వ్యయం కలిపి) రూ.11,68,401 కోట్లు. అందులో విద్య, వైద్యం, సాగునీరు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు రూ.5,34,346 కోట్లు వెచ్చించారు. రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు, పింఛన్లు, అప్పులకు వడ్డీల కింద అనివార్యంగా చేయాల్సిన వాటి కోసం రూ.3,95,941 కోట్లు ఖర్చు పెట్టినట్లు కాగ్ నివేదిక తెలిపింది.
