నియంత్రణలోనే ఉన్నా నిర్లక్ష్యమొద్దు

Telangana: Speed Up COVID Vaccination Says Harish Rao - Sakshi

ప్రజలకు మంత్రి హరీశ్‌ సూచన

15–18 ఏళ్లవారికి, 60 ఏళ్లు పైబడినవారికి టీకా కోసం ఏర్పాట్లు 

70 లక్షల డోసులు అవసరమవుతాయని అంచనా 

వైద్య ఆరోగ్య అధికారులతో సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, అలా అని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ వ్యాప్తి, వ్యాక్సినేషన్‌ తదితర అం శాలపై సోమవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే మొదటిడోసు లక్ష్యం వంద శాతానికి చేరువైందని, ఇదే స్ఫూర్తితో రెండోడోసును వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. 15– 18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్, 60 ఏళ్లు పైబడిన వారికి మూడో డోసు (బూస్టర్‌ డోస్‌) విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

15–18 ఏళ్ల వయస్సువారు 22.78 లక్షలు, 60 ఏళ్ల పైబడిన వారు 41.60 లక్షలు, హెల్త్‌ కేర్, ఫ్రంట్‌లైన్‌ వారియర్లు 6.34 లక్షలున్నారని, వీరందరికీ దాదాపు 70 లక్షల వ్యాక్సిన్‌ అవసరం ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మూడో వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేలా ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఏర్పాట్లను విభాగాలవారీగా సమీక్షించుకోవాలన్నారు.

ఒమిక్రాన్‌ సోకి టిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు కోలుకుంటున్నారని అధికారులు వివరించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, టీఎస్‌ఎంఐడీసీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top