‘గులాబ్’ తుపాను: హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్..

నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం సాయంత్రం 5.30 గంటల సమయంలో ‘గులాబ్’తుపానుగా మారింది. ఇది గోపాల్‌పూర్‌కు 370 కిలోమీటర్లు, కలింగపట్నంకు తూర్పు, ఈశాన్య దిశలో 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను పశ్చి మ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరప్రాంతాల్లోని కలింగపట్నం, గోపాల్‌పూర్ మధ్యలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈనెల 27న ఈశాన్య, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తదుపరి 24 గంటల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా ప్రయాణించి ఈనెల 29న పశ్చిమ బెంగాల్ తీరం వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.