
సాక్షి, హైదరాబాద్/విజయనగరం: తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ కారణంగా నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్ భగ్నమైంది. ఈ క్రమంలో ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్(28) ఇద్దరూ కలిసి.. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పేలుళ్లకు పక్కా ప్లాన్ చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి ఐసీసీ మాడ్యుల్ ద్వారా వీరికి ఆదేశాలు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పోలీసులు.. ఒక ఇంటిలో తనిఖీలు నిర్వహించగా పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు. ఇరువురిని కోర్టులో హాజరుపర్చనున్నట్లుగా తెలిపారు.