
ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల బ్యాన్ ప్రధాన ధ్యేయం
120 మైక్రాన్ల కంటే తక్కువ ఉంటే నిషేధం
పకడ్బందీగా అమలుకు చర్యలు
చట్ట సవరణ చేయనున్న జీహెచ్‌ఎంసీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగాన్ని త్వరలో పూర్తిగా నిషేధించనున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో నగరంలో దీని నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే క్యారీ బ్యాగ్‌లను సంపూర్ణంగా నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పేరిట దీన్ని అమల్లోకి తేనున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు నిరీ్ణత మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆదిలో అట్టహాసమే తప్ప అమలులో అటకెక్కింది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
ప్లాస్టిక్ నిషేధం కోసం 2007 నుంచే ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిషేధం అమలు కోసమని పెనాలీ్టలను రూ.5 వేల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు విధిస్తూ పలు సర్క్యులర్లు, జీవోలు జారీ అయినప్పటికీ, అమలులో మాత్రం నీరు గారింది. ఈ నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తాజాగా జీహెచ్‌ఎంసీ చట్ట సవరణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నారు. తద్వారా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగంలో లేని నగరంగా హైదరాబాద్ ఉండాలని భావిస్తున్నారు. టీసీయూర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్)వరకు దీన్ని అమలు చేసే ఆలోచనలున్నప్పటికీ.. తొలుత చట్ట సవరణ ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధి వరకు కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని చట్ట సవరణ చేయనున్నారు.
గతంలో ఇలా..
ఎన్ని మైక్రాన్ల లోపు ఉంటే సింగిల్ యూజ్ ప్లాస్టికో క్రమేపీ మారుతోంది. 20 మైక్రాన్ల లోపు వాటిని ఒకప్పుడు సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌గా పరిగణించగా, ప్రస్తుతం ఇది 120 మైక్రాన్లకు చేరింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలోనే 2007 ఆగస్ట్ 8న జారీ అయిన సర్కులర్ మేరకు 20 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ అమ్మినవారికి రూ.5వేలు, వినియోగించిన వారికి రూ.500 జరిమానాలు విధించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2011లో 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలు జరగరాదన్నారు.
2016లో మొదటిసారి రూ.10వేల జరిమానాతో పాటు మూడోసారి సంస్థ మూసివేత వరకు చర్యలుంటాయని పేర్కొన్నారు. 2017లో వెలువడిన జీవో మేరకు నిషేధం అమల్లో జీహెచ్‌ఎంసీ విఫలమైతే జీహెచ్‌ఎంసీకి పీసీబీ రూ.25వేల జరిమానా విధిస్తుందని పేర్కొన్నారు. దాదాపు మూడేళ్ల క్రితం 2022లో డీలర్లు, డి్రస్టిబ్యూటర్లకు లక్ష రూపాయల జరిమానా నుంచి ప్రారంభించి సంస్థల సీజ్ వరకు చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వు జారీ చేశారు. ఒక టాస్‌్కఫోర్స్ సైతం ఏర్పాటు చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. పర్యవసానంగా ఏ మార్కెట్‌కు, దుకాణానికి వెళ్లినా ప్రజలకు మాత్రం క్యారీబ్యాగ్‌ల భారం అదనంగా పడుతోంది. గత పాలకమండలిలోనూ నగరంలో ప్టాస్టిక్ సంపూర్ణ నిషేధానికి ఆమోదం తెలిపిన సర్వసభ్య సమావేశం ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాక తిరిగి పట్టించుకోలేదు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు..
నిషేధానికి చేయనున్న చట్ట సవరణలోనూ కొన్ని ప్రత్యేక అవసరాలకు మినహాయింపులు ఉండనున్నట్లు తెలిసింది. నిషేధం అమల్లోకి వస్తే నగరంలో వివిధ సమస్యలు తగ్గుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాలాల్లో వ్యర్థాలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా వరద సమస్యలు తగ్గుతాయి. ఎగుమతి కోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ ఉత్పత్తి చేసేవారికి, సీల్డు సరుకుల ప్యాకేజీలు, పాలు,పాల ఉత్పత్తుల ప్యాకింగ్స్, నర్సరీల అవసరాలకు అనుమతించే అవకాశం ఉంది. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగా మినహాయింపులు ఉండనున్నాయి.