ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్‌! | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్‌!

Published Sat, Nov 26 2022 2:10 AM

Telangana: NTA Preparing To Conduct JEE Mains 2023 In February. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్‌ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ జేఈఈ మెయిన్స్‌ (2023) ఫిబ్రవరిలో నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలో పరీక్ష షెడ్యూల్‌ను వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ బోర్డుల అభిప్రాయాలను కోరింది. ఫిబ్రవరిలో నిర్వహణకు సమ్మతమేనా? ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా? అనే అంశాలపై వివరణ కోరినట్టు తెలిసింది. దీనిపై కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్టు ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి.  

ఈ ఏడాది సకాలంలోనే తరగతులు 
2022కు సంబంధించిన జేఈఈ మెయిన్స్‌ పరీక్షను మే, జూలై నెలల్లో నిర్వహించారు. ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌ కూడా నిర్వహించి ప్రవేశాల ప్రక్రియ ముగించారు. ఈ మొత్తం వ్యవహారం అక్టోబర్‌లో పూర్తయింది. వాస్తవానికి జేఈఈ మెయిన్స్‌ 2019 వరకు జనవరి నెలలోనే నిర్వహించారు. కోవిడ్‌ నేపథ్యంలో మూడేళ్లుగా ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ ఏడాది తరగతులు సకాలంలోనే మొదలవ్వడంతో మెయిన్స్‌ త్వరగా నిర్వహించాలని ఎన్‌టీఏ సంకల్పించింది.  

రెండు విడతలుగానే.. 
కరోనా సమయంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్స్‌ నిర్వహించారు. ఈసారి 2 విడతలుగానే చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో తొలి విడత ఉంటే, ఏప్రిల్‌లో రెండో విడత ఉండొచ్చన్న సంకేతాలు ఎన్‌టీఏ వర్గాల నుంచి వస్తున్నాయి. ఏప్రిల్‌లో రాష్ట్రాల పరిధిలోని ఇంటర్‌ బోర్డులు పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఈ ప్రక్రియను మే నెలలో చేపట్టాలని భావిస్తోంది. జూన్‌ లేదా జూలైలో అడ్వాన్స్‌డ్‌ చేపట్టి, సెప్టెంబర్‌ నాటికి ప్రవేశాల ప్రక్రియను ముగించాలనే యోచనలో ఉంది.

ఇందుకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా 2023–24  సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలి అభిప్రాయాన్ని కూడా ఎన్‌టీఏ కోరినట్టు తెలిసింది. మరోవైపు పరీక్ష విధానంపైనా ఎన్‌టీఏ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టు తెలిసింది. పార్ట్‌–1కు మాత్రమే కరోనా కాలంలో నెగెటివ్‌ మార్కింగ్‌ అమలు చేశారు. 360 మార్కులతో 90 ప్రశ్నల విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నట్టు తెలిసింది.  

ఫిబ్రవరి మొదటి వారమేనా? 
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఫిబ్రవరి రెండో వారంలో ప్లస్‌ టు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సమయంలో జేఈఈ వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గుర య్యే అవకాశం ఉందని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్ర­వరి మొదటి వారంలో తొలి విడత పరీక్ష చేపట్టాలనే యో చనలో ఎన్‌టీఏ ఉంది. రెండో వారం పరీక్షలపై సీబీఎస్‌ఈతో పాటు తెలంగాణ కూడా అభ్యంతరాలు వ్య­క్తం చేస్తోంది. రెండో వారంలో ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉండటమే  కారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో తొలి విడత, ఏప్రిల్‌ మూడో వారం లేదా మే మొదటి వారంలో జేఈఈ మెయి­న్స్‌ ఉంటే బాగుంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఎన్‌టీఏకి సూచించే ఆలోచనలో ఉన్నారు.  

మొదటి వారమైతే అభ్యంతరం లేదు  
జేఈఈ మెయిన్స్‌ తొలి విడత ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదు. రెండో విడత పరీక్షల ఖరారులోనూ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షల తేదీలను, విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిగణనలోనికి తీసుకోవాలి.  
– ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్‌)   

Advertisement
Advertisement