breaking news
Engineering Institute
-
ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్స్ (2023) ఫిబ్రవరిలో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో పరీక్ష షెడ్యూల్‌ను వెలువరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ బోర్డుల అభిప్రాయాలను కోరింది. ఫిబ్రవరిలో నిర్వహణకు సమ్మతమేనా? ఇతర అభ్యంతరాలు ఏవైనా ఉన్నాయా? అనే అంశాలపై వివరణ కోరినట్టు తెలిసింది. దీనిపై కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్టు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సకాలంలోనే తరగతులు 2022కు సంబంధించిన జేఈఈ మెయిన్స్ పరీక్షను మే, జూలై నెలల్లో నిర్వహించారు. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కూడా నిర్వహించి ప్రవేశాల ప్రక్రియ ముగించారు. ఈ మొత్తం వ్యవహారం అక్టోబర్‌లో పూర్తయింది. వాస్తవానికి జేఈఈ మెయిన్స్ 2019 వరకు జనవరి నెలలోనే నిర్వహించారు. కోవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ ఏడాది తరగతులు సకాలంలోనే మొదలవ్వడంతో మెయిన్స్ త్వరగా నిర్వహించాలని ఎన్టీఏ సంకల్పించింది. రెండు విడతలుగానే.. కరోనా సమయంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్స్ నిర్వహించారు. ఈసారి 2 విడతలుగానే చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో తొలి విడత ఉంటే, ఏప్రిల్‌లో రెండో విడత ఉండొచ్చన్న సంకేతాలు ఎన్టీఏ వర్గాల నుంచి వస్తున్నాయి. ఏప్రిల్‌లో రాష్ట్రాల పరిధిలోని ఇంటర్ బోర్డులు పరీక్షలు నిర్వహిస్తే మాత్రం ఈ ప్రక్రియను మే నెలలో చేపట్టాలని భావిస్తోంది. జూన్ లేదా జూలైలో అడ్వాన్స్డ్ చేపట్టి, సెప్టెంబర్ నాటికి ప్రవేశాల ప్రక్రియను ముగించాలనే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కూడా 2023–24 సంవత్సరం షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండలి అభిప్రాయాన్ని కూడా ఎన్టీఏ కోరినట్టు తెలిసింది. మరోవైపు పరీక్ష విధానంపైనా ఎన్టీఏ స్పష్టమైన వైఖరి తీసుకున్నట్టు తెలిసింది. పార్ట్–1కు మాత్రమే కరోనా కాలంలో నెగెటివ్ మార్కింగ్ అమలు చేశారు. 360 మార్కులతో 90 ప్రశ్నల విధానాన్నే అనుసరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి మొదటి వారమేనా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫిబ్రవరి రెండో వారంలో ప్లస్ టు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సమయంలో జేఈఈ వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గుర య్యే అవకాశం ఉందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి మొదటి వారంలో తొలి విడత పరీక్ష చేపట్టాలనే యో చనలో ఎన్టీఏ ఉంది. రెండో వారం పరీక్షలపై సీబీఎస్ఈతో పాటు తెలంగాణ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రెండో వారంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఉండటమే కారణం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలో తొలి విడత, ఏప్రిల్ మూడో వారం లేదా మే మొదటి వారంలో జేఈఈ మెయిన్స్ ఉంటే బాగుంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఎన్టీఏకి సూచించే ఆలోచనలో ఉన్నారు. మొదటి వారమైతే అభ్యంతరం లేదు జేఈఈ మెయిన్స్ తొలి విడత ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండదు. రెండో విడత పరీక్షల ఖరారులోనూ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీలను, విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఉన్న అవకాశాలను పరిగణనలోనికి తీసుకోవాలి. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) -
ఇష్టపడి చదివి.. విజయం సాధించా!
దేశంలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్.. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం) యునివర్సిటీ-ధన్‌బాద్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకునే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు రంగారెడ్డిజిల్లాకు చెందిన ఏడ్ల అభిలాష్ రెడ్డి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉన్నత విద్య లక్ష్యమే ఈ విజయానికి కారణమంటున్నారు అభిలాష్ రెడ్డి. ఈ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను అభిలాష్ సాక్షి ‘భవిత’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. అమ్మానాన్న సమక్షంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టం. అంతేకాకుండా ఎస్బీఐ గుడ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వరించింది. చివరి సంవత్సరం చదువుతుండగానే నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఎంపికకావడం ద్వారా న్యూఢిల్లీలోని మారుతి సుజుకి కంపెనీలో మెకానికల్ డిజైనర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. నేపథ్యం: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రామన్నగూడ నా స్వస్థలం. నాన్న రాంరెడ్డి, అమ్మ లక్ష్మి. నిరుపేద వ్యవసాయ కుటుంబం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా చదువుకు ఆటంకం కలగకూడదని అమ్మ, నాన్న కష్టపడ్డారు. వారి ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. నాన్న ఓ తండ్రిలా కాకుండా స్నేహితునిలా తన వెన్ను తట్టి ధైర్యం చెప్పేవాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాన్న ఆశయాన్ని నెరవేర్చాను. ఈ విజయం వారికే అంకితమిస్తున్నాను. మొదటి నుంచి టాపర్నే: చిన్నప్పటి నుంచి చదువులో ముందే. పాఠశాల స్థాయి నుంచి ఇప్పటి వరకు అన్ని తరగతుల్లో నేనే టాపర్‌ని. 10వ తరగతిలో 96 శాతం మార్కులు వచ్చాయి. అంతేకాకుండా రాష్ర్ట స్థాయిలో 10వ ర్యాంకు దక్కింది. ఇంటర్మీడియెట్‌లో 96.8 శాతం, బీటెక్‌లో 92.3 శాతం మార్కులు సాధించాను. ఎంసెట్, ఏఐఈఈఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చినా.. ఐఐటీ-జేఈఈ కి ప్రాధాన్యమిచ్చి ఐఎస్‌ఎంలో చేరాను. మొదటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఉన్న మక్కువతో ఆ బ్రాంచ్ ఎంచుకున్నా. ఆ ప్రోత్సాహంతోనే: కోర్సులో చేరిన మొదట్లో కొత్త ప్రదేశం, ఇతర రాష్ట్రం కావడంతో ఇంజనీరింగ్ అంటే ఒక రకమైన భయం ఏర్పడింది. ఆ సమయంలో నాన్న ప్రోత్సాహం, అధ్యాపకుల సలహాలు నన్ను ముందుకు నడిపించాయి. కోర్సు విషయానికొస్తే.. మెకానికల్ ఇంజనీరింగ్‌లోని అన్ని సబ్జెక్ట్‌లు ముఖ్యమైనవే అని చెప్పాలి. మెకానికల్ డిజైన్, ధర్మోడైనమిక్స్, ఈ-ట్రాన్స్ఫర్, ఏయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేటర్ ఇలా అన్ని అంశాలు ఎంతో కీలకమైనవి. అయితే ఇష్టపడి చదవడంతో పెద్దగా కష్టమనిపించలేదు. ప్రణాళికతో ప్రిపరేషన్: వారానికి ఐదు రోజులు తరగతులు ఉండేవి. మిగిలిన రెండు రోజులను మాత్రం ఆ వారంలో చెప్పిన సబ్జెక్టులను క్షుణ్నంగా చదివేందుకు కేటాయించే వాణ్ని. సాధ్యమైనంత వరకు ఏ రోజు సబ్జెక్టును ఆ రోజే పూర్తి చేసే వాణ్ని. దాంతో నాలుగేళ్ల కోర్సులో ప్రతి సెమిస్టర్లో టాపర్‌గా నిలిచే అవకాశం లభించింది. కేవలం అకడమిక్ అంశాలకే పరిమితం కాకుండా కాలేజీలో ఏ ఈవెంట్‌ను నిర్వహించినా ముందుండి అందరి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేవాణ్ని. తద్వారా కెరీర్ ఎదుగుదలకు కీలకమైన నైపుణ్యాలు అలవడ్డాయి. ఇది కూడా నా విజయానికి ఒక రకంగా దోహదం చేసింది. ఉన్నత విద్య లక్ష్యం: బీటెక్‌తోనే నా చదువును ముగించాలని అనుకోవటంలేదు. భవిష్యత్‌లో ఉన్నత కోర్సులను చదవాలనే లక్ష్యంతో ఉన్నా. దానికి అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు, అంతేకాకుండా అనుభవం కోసం ప్రస్తుతానికి మారుతి సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. -ఎస్. రాకేశ్, న్యూస్‌లైన్, చేవెళ్లగ్రామీణం. అకడెమిక్ ప్రొఫైల్ పదో తరగతి: 576 మార్కులతో ఉత్తీర్ణత (2007) ఇంటర్మీడియెట్: 96 శాతం మార్కులతో ఉత్తీర్ణత బీటెక్ : 92.3 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఐఎస్ఎం-ధన్‌బాద్)