ప్రమోషన్లు, బదిలీలకు బ్రేక్‌!

Telangana: No Promotions For Teachers This Year 2022 - Sakshi

ఈ ఏడాదీ టీచర్లకు పదోన్నతులు లేనట్టే?

ముందుకు సాగని బదిలీల ప్రక్రియ

సమస్యలతో ముందుకెళ్లడం కష్టమంటున్న అధికారులు

ఆందోళనలకు సిద్ధమవుతున్న టీచర్ల సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల ఆశలపై విద్యాశాఖ ఈ ఏడాది కూడా నీళ్లు చల్లినట్టే కన్పిస్తోంది. పదోన్నతులు, బదిలీలపై ఇంతకాలం హడావుడి∙చేసిన అధికారులు మళ్లీ చల్లబడ్డారు. జిల్లాస్థాయిలో సీనియారిటీ జాబితాలతో ముసాయిదాలు సిద్ధం చేసినా, షెడ్యూల్‌ విడుదలకు విద్యాశాఖ సుముఖంగా కన్పించడం లేదు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద సోమవారం జరిగిన సమావేశంలో పలువురు అధికారులు పదోన్నతులు, బదిలీలపై అనేక సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఈ తేనెతుట్టెను ఇప్పుడు కదిలించకపోవడమే మంచిదని ఓ అధికారి చెప్పినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పదోన్నతులు, బదిలీల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా 317 జీవో అమలుకావడంతో ఈ అంశం వెనక్కివెళ్లింది. తాజాగా జూన్‌ చివరి నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగించాలని విద్యాశాఖ నిర్ణయించి, ముందుకు కదిలింది.

సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ), స్కూల్‌ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) వరకూ ప్రమోషన్లకు ఎలాంటి సమస్యలూ లేవని భావించి, ముందుగా దీన్ని చేపట్టాలనుకున్నారు. హెచ్‌ఎంలు, ఎంఈవో, డీఈవోల భర్తీ, పదోన్నతుల ప్రక్రియలో అనేక సమస్యలు విద్యాశాఖను భయపెడుతున్నాయి. ఇవన్నీ పరిష్కరించకుండా ముందుకెళ్లడం కష్టమని ఉన్నతాధికారులు మంత్రికి సూచించినట్టు సమాచారం. దీంతో మంత్రి కూడా వెనక్కితగ్గారని తెలిసింది. 

ఇచ్చేదుంటే షెడ్యూల్‌ ఏది?
ప్రమోషన్లు ఇచ్చే విషయంలో పురోగతి ఉంటే, ఏప్రిల్‌ చివరి నాటికే షెడ్యూల్‌ విడుదల కావాలి. ఆ తర్వాత మే రెండో వారం నుంచి ప్రక్రియ మొదలవ్వాలి. జూన్‌లో కౌన్సెలింగ్‌ చేపట్టి బదిలీలు చేయాలి. కానీ ఇప్పటివరకు షెడ్యూల్‌ కూడా విడుదల కాలేదు. ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పోస్టుల విషయంలో కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులకూ ఈ పోస్టులు ఇవ్వాలన్న డిమాండ్‌ వచ్చింది.

కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు (నేరుగా నియమించబడ్డవారు) దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వీరిని దారికి తెచ్చేందుకు విద్యాశాఖ మంత్రి అనేక దఫాలు చర్చలు జరిపినా, పెద్దగా ప్రయోజనం లేదు. అసలీ కేసులకు సంబంధించి కోర్టులోనూ విద్యాశాఖ అవసరమైన కౌంటర్‌ పత్రాలు దాఖలు చేయలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. అదీగాక, జూన్‌ 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆ తర్వాత బదిలీలు చేయడం, పదోన్నతుల ద్వారా కొత్త టీచర్లు స్కూళ్లకు వస్తే విద్యార్థులకు సాంకేతికంగా ఇబ్బందిగా ఉండే వీలుంది. దీంతో ప్రమోషన్లు, బదిలీలు ఈ ఏడాది ఉండకపోవచ్చనే వాదన విద్యాశాఖ నుంచి బలంగా విన్పిస్తోంది.

ఉద్యమమే శరణ్యం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ బుధవారం జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చింది. కమిటీ సోమవారం సమావేశమై ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఖరారు చేసినట్టు యూటీఎఫ్‌ నేత చావా రవి చెప్పారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేక టీచర్లు నష్టపోతున్నారని, సర్కార్‌ స్పందించకపోవడంతోనే ఉద్యమించాల్సి వస్తోందన్నారు.

తక్షణమే షెడ్యూల్‌ ఇవ్వాలి టీఎంఎస్‌టీఏ
పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయుల సంఘం (టీఎంఎస్‌టీఏ) డిమాండ్‌ చేసింది. దీనిపై మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌తో కలిసి, సంఘం అధ్యక్షుడు భూతం యాకమల్లు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. మే నెల సగం గడిచినా షెడ్యూల్‌ విడుదల చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top