అంతా ముందస్తు ప్రణాళికతోనే! రూ.35 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం మాయం

Telangana Millers Sell Custom Milled Rice Worth Of Rs 35 Crore - Sakshi

మిల్లులో విలువైన సామగ్రి సైతం అమ్మకం 

కాపుగల్లులో మిగిలింది ఖాళీ షెడ్డే 

దానికే తాళం వేసి, సీల్‌ వేసిన అధికారులు 

మిల్లుపై రూ. 3 కోట్ల బ్యాంక్‌ లోన్‌! 

కోదాడ: రూ.35 కోట్ల కస్టంమిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను మాయం చేసిన కేసులో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన మిల్లర్‌.. అంతా ముందస్తు ప్రణాళికతోనే పకడ్బందీగా పని కానిచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మూడు, నాలుగు నెలలుగా దశలవారీగా మిల్లు నుంచి ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. నాలుగు నెలలుగా అధికారులు మిల్లులో ధాన్యం తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. పౌరసరఫరాల అధికారులు మిల్లర్‌తో కుమ్మక్కు కాకుంటే అది సాధ్యపడదని, దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

మిల్లు సామగ్రి కూడా అమ్మకం?:
మిల్లులో సీఎంఆర్‌ ధాన్యం మాయం చేసిన మిల్లర్, లోపల ఉన్న విలువైన యంత్ర సామగ్రిని కూడా దా దాపు రూ.3 కోట్లకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మి ల్లంతా ఖాళీ అయిందని, ప్రస్తుతం ఉత్తి షెడ్డు మాత్ర మే ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. దానికే అధికారులు తాళం, సీలు వేసి నిఘా పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఈ మిల్లర్‌ తన స్వగ్రా మం మేళ్లచెరువు మండలం రేవూరులో గతంలో ధాన్యం కోనుగోలు చేసి, రైతులను మోసగించి ఐపీ పెట్టి కాపుగల్లుకు వచ్చాడని గ్రామస్తులు వెల్లడించారు.  

బ్యాంక్‌ తనఖాలో మిల్లు ఆస్తులు! 
కాపుగల్లు రైస్‌ మిల్లర్‌ కోదాడలోని ఓ జాతీయ బ్యాంక్‌ నుంచి మిల్లు మీద దాదాపు 3 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మిల్లు ఆస్తులను మొత్తం బ్యాంక్‌కు తనఖా పెట్టాడు. దీంతో ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంక్‌ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల విభాగం అధికారులు ఆ మిల్లర్‌పై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగించినా అక్కడ ఏమీ దొరకదని అంటున్నారు. 

మిల్లర్‌ కోసం గాలింపు.. 
రూ.35 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం మాయం చేసిన కేసులో మిల్లర్‌ ఆచూకీ కోసం కోదాడ రూరల్‌ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మిల్లులో పనిచేసే వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వారి నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం దొరకడం లేదని తెలుస్తోంది. మిల్లర్‌ కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అతను ఇచ్చి న సమాచారంతో పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు వెళ్లగా, పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని మిల్లర్‌ అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెనుదిరిగి వచ్చినట్లు సమాచారం.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top