
మిల్లర్లకు సీఎంఆర్ బిల్లుల చెల్లింపులో కమీషన్ల పర్వం
గుంటూరు జిల్లాలో ఒక్క మిల్లర్‌కే బిల్లులు, అడ్వాన్స్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో వసూళ్ల రాజ్యం నడుస్తోంది. రాజకీయ సిఫారసులు, అవినీతి కాసులే పరమావధిగా వ్యవస్థ పనితీరు దిగజారింది. అమాత్యుల ఆదేశాలతో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారిని కూటమి ప్రభుత్వం అందలం ఎక్కించింది. ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లోను ఇదేరీతిలో బదిలీలు చేపట్టడంతో వసూళ్లు మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగుతున్నాయి. ఇప్పుడు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు బిల్లుల చెల్లింపులో అవినీతి బహిర్గతమైంది. పీడీఎస్ బియ్యం సేకరణలో భాగంగా ప్రభుత్వం ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేయిస్తుంది.
దీనికిగాను ఏటా మిల్లర్లకు రూ.1,200 కోట్ల వరకు చెల్లిస్తుంది. ఆయా సీజన్లు ముగిసిన తర్వాత పౌరసరఫరాల సంస్థ ఎండీ బిల్లుల చెల్లింపునకు సర్క్యులర్ ఇచి్చన అనంతరమే ఈ బిల్లులు పెట్టాలి. నిధుల లభ్యతను బట్టి ఎండీ ఆదేశాలతోనే చెల్లించాలి. కానీ కొందరు ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఇష్టారీతిన చెల్లించేస్తున్నారు. సీఎంఆర్ 2023–24కు సంబంధించి చెల్లింపులకు గతేడాది ఆగస్టు–సెపె్టంబర్‌లో ఎండీ సర్క్యులర్ జారీచేయడంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు బిల్లులను ఆప్‌లోడ్ చేశారు. నిధులు లేకపోవడంతో చెల్లింపులు ఆలస్యమయ్యాయి.
ఇటీవల మార్కెఫెడ్ ద్వారా పౌరసరఫరాల సంస్థకు రూ.వెయ్యికోట్ల అప్పు అందింది. 2023–24 సీఎంఆర్ బిల్లుల చెల్లింపులకు ఎండీ ఆదేశించారు. ఏపీలో చాలామంది మిల్లర్లకు బిల్లులు చెల్లించారు. గుంటూరు జిల్లాలో మాత్రం పొన్నూరుకు చెందిన ఒక మిల్లరుకే డబ్బు జమచేశారు. దీనికి స్థానిక పౌరసరఫరాల సంస్థ అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గతంలో ప్రధాన కార్యాలయానికి ఆ ఒక్క మిల్లరు బిల్లును విడిగా పెట్టి, మిగిలిన మిల్లర్ల బిల్లులను కలిపి పెట్టించారు. కలిపి పెట్టిన బిల్లులను పలు కారణాలతో రిజెక్టు చేయించి సింగిల్‌గా పెట్టిన బిల్లులకు డబ్బులిచ్చేశారు.
అడ్వాన్స్ రూపంలో చెల్లింపులు
గుంటూరు జిల్లాలో 28 మిల్లులున్నాయి. వీటిలో పొన్నూరుకు చెందిన మిల్లర్‌కు మాత్రమే రెండు, మూడునెలల కిందటే అడ్వాన్సుగా రూ.20 లక్షలకుపైనే ఇచ్చేశారు. ఎండీ ఆదేశాలతో పనిలేకుండా ప్రధాన కార్యాలయంలోని ఫైనాన్స్ అధికారులతో కుమ్మకైన గుంటూరు అధికారి గుట్టుచప్పుడు కాకుండా ఈ అడ్వాన్స్‌ని ఇప్పించడం గమనార్హం. ఇంతటితో ఆగకుండా 2024–25 సీఎంఆర్ నిధుల చెల్లింపులకు ఎండీ సర్క్యులర్ రానప్పటికీ, పాత పద్ధతిలోనే పొన్నూరు మిల్లర్‌కు మరో రూ.80 లక్షల వరకు అడ్వాన్స్ ఇప్పించినట్టు సమాచారం.