‘పత్తి’ రైతు చిత్తు | Cotton farmers suffer loss: Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘పత్తి’ రైతు చిత్తు

Oct 23 2025 3:54 AM | Updated on Oct 23 2025 3:54 AM

Cotton farmers suffer loss: Andhra pradesh

దిగుబడులపై అధిక వర్షాల దెబ్బ

పైగా.. మద్దతు ధర దక్కక దగా పడుతున్న రైతు

2025–26 సీజన్‌లో కనీస మద్దతు ధర రూ.8,110 

కానీ, తేమ సాకుతో అడ్డగోలుగా కోతపెడుతున్న వ్యాపారులు 

మార్కెట్‌కొచ్చే పంటలో మూడొంతుల పత్తికి దక్కేది క్వింటాకు రూ.4వేల లోపే 

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని సీసీఐ.. పట్టించుకోని కూటమి ప్రభుత్వం

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం చేతి­లో పత్తి రైతు మరోసారి చిత్తయి­పోతున్నాడు. మా­ర్కెట్‌ మాయాజాలంతో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధరలు పడిపోతున్నా సర్కారు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దిగుమతి సుంకం మినహాయింపు ప్రభావంతో ఈ ఏడాది పత్తి కొనేవారు లేకపోవడంతో ఈ అవకాశాన్ని దళారులు తమకు అనుకూలంగా మలుచుకుని రైతులను నిలువునా దోచుకుంటున్నారు.

మరోవైపు.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పిలిచిన టెండర్లకు జిన్నింగ్‌ మిల్లు యజమానుల నుంచి స్పందన కరువైంది. ఫలితంగా.. ఎప్పుడు, ఎన్ని ఏర్పాటుచేస్తారో కూడా ఇప్పటి­వరకు స్పష్టత ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.

ముందుకు రాని జిన్నింగ్‌ మిల్లులు.. 
రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు. ఈ ఏడాది అతికష్టం మీద 10.75 లక్షల ఎకరాల్లో సాగవగా, 8 లక్షల టన్నుల దిగుబడులొస్తా­యని అంచనా వేశారు. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్‌ చేసేందుకు మిల్లులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో 122 జిన్నింగ్‌ మిల్లులు ఉండగా, గతేడాది కేవలం 45 మిల్లులు మాత్రమే సీసీఐతో ఎంపానల్‌ అయ్యాయి.

కానీ, ఈ ఏడాది పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గత నెల ఒకటిన సీసీఐ టెండర్లు పిలిచినా ఒక్క జిన్నింగ్‌ మిల్లు కూడా ముందుకు రాలేదు. దీంతో టెండర్ల ప్రక్రియ ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. మరోవైపు.. అధిక వర్షాలతో పత్తి పంట దెబ్బతింది. మిగిలిన దిగుబడినైనా మద్దతు ధరకు అమ్ముకుందామంటే వ్యాపారులు రైతుల్ని నిలువునా దోచేస్తున్నారు. 2025–26 ఖరీఫ్‌ సీజన్‌లో క్వింటాకు మధ్యస్థ రకం పత్తికి రూ.7,710, పొడవు రకానికి రూ.8,110గా కేంద్రం ప్రకటించింది.  

మూడొంతులు లాట్లకు దక్కే ధర రూ.3,960లే..
కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌ పరిధిలో ఏటా రూ.1,400 కోట్ల పత్తి వ్యాపారం జరుగుతుంది. ఈ యార్డుకు ప్రస్తుతం 10–12 వేల క్వింటాళ్ల పత్తి నిల్వలు వస్తున్నా.. రైతులకు మాత్రం మద్దతు ధర దక్కడంలేదు. ఏటా అక్టోబరు 1 నుంచి ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలు ఈసారి ఎప్పుడు తెరుస్తారో తెలీక రైతులు దళారులకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యమైన పత్తికి సైతం క్వింటా ధర సగటున రూ.5 వేల నుంచి రూ.7వేలే పలుకుతోంది. యార్డులో శనివారం గరిష్టంగా క్వింటా పత్తి రూ.7,499 పలికినప్పటికీ ఈ ధర దక్కింది కేవలం 5–10 శాతం లాట్లకు మాత్రమే.

మధ్యస్థ రకం క్వింటాకు రూ.7,299 దక్కింది. కానీ, ఈ ధర 15 శాతం లాట్లకు మించి లభించలేదు. ఇక దాదాపు 75 శాతం లాట్లకు క్వింటాకు రూ.3,960 చొప్పున మాత్రమే లభించింది. తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో అడ్డగోలుగా కోత పెడుతున్నారు. పెద్ద వాహనానికి 20–30 కిలోలు, చిన్న వాహనానికి 10–15 కిలోలు చొప్పున తక్కువ తూకాలు చూపుతున్నారు. పైగా.. క్వింటాకు 6–10 కిలోల తరుగు తీసేస్తున్నారు. కనిష్ట, మధ్యస్థ ధరలే కాదు.. గరిష్ట ధర కూడా కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు దరిదాపులో లేకపోవడంతో రైతులు ఏస్థాయిలో నష్టపోతున్నారో అర్ధమవుతుంది.

గతంలో సీజన్‌కు ముందుగానే..
నిజానికి.. వైఎస్‌ జగన్‌ ప్ర­­భుత్వ హయాంలో పంట కోతకొచ్చేందుకు కనీసం 45 రోజుల ముందుగానే కేంద్రాల ఏర్పా­టుపై స్వ­యంగా సీఎంతో పాటు వ్యవ­సాయ శాఖమంత్రి సమీక్ష చేసేవారు. ఏటా సెప్టెంబరు రెండో వారం నుంచే ఈ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టేవారు. మూడో వారంలో ఆర్బీకేల ద్వారా రైతుల వివరాలు నమోదుచేసి నాలుగో వారం నుంచి కొనుగో­లుకు శ్రీకారం చుట్టేవారు. పైగా.. ఏటా గిట్టు­బాటు ధర దక్కేలా చర్యలు తీసుకునేవారు. ఫలితంగా నాడు క్వింటా రూ.9,500 నుంచి రూ.10,600 వరకు ధర లభించింది. కానీ, కూటమి ప్రభుత్వంలో గతేడాది సగటున క్వింటాకు రూ.5,500 నుంచి రూ.6,200 మాత్రమే లభించింది. ఈ ఏడాది కూడా పంట పూర్తిగా మార్కెట్‌కు వచ్చే సమయానికి క్వింటాకు గరిష్టంగా రూ.5 వేలకు మించి లభించదని అంచనా వేస్తున్నారు.

కూలీ ఖర్చులు కూడా రావడం లేదు 
నాలుగు ఎకరాల్లో పత్తి వేశా. ఎకరాకు రూ.50 వేల చొప్పున రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. భారీ వర్షాలవల్ల పంట పూర్తిగా దెబ్బతింది. కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే చేతికొచి్చంది. అది కూడా సెకండ్‌ క్వాలిటీ. మార్కెట్‌లో క్వింటా రూ.4 వేల నుంచి రూ.5.50 వేలకు మించి పలకడంలేదు. కూలీ ఖర్చులు కూడా రావడంలేదు. 
– వాల్మీకి వీరేష్ , గోతులదొడ్డి, కర్నూలు జిల్లా

వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు.. 
మూడెకరాల్లో పత్తి పంట వే­శా. ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పె­ట్టా. భారీ వర్షాల­వల్ల ఎకరాకు ఐదు క్వింటాళ్లకు మించి రాలేదు. మార్కెట్‌లో ధర ఏమాత్రం బాగోలేదు. కొనేవారు కూడా కన్పించడంలేదు. వ్యాపా­రులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. క్వాలిటీ ఏదైనా రూ.8 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి. అప్పుడే రైతుకు పెట్టుబడి దక్కుతుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల పరిస్థితి అథోగతే.  
– హరిజన శివన్న, దొడ్డనగిరి, కర్నూలు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement