
తిరుపతి కలెక్టరేట్‌లోకి వచ్చిన వరద నీరు
తిరుపతి జిల్లాను ముంచెత్తిన కుండపోత వాన
పాపమాంబపురంలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం
పలు జిల్లాల్లో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో రైతులు
5 జిల్లాలకు రెడ్.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం!
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా తడిసి ముద్దయింది. బుధవారం కూడా తిరుపతి జిల్లాలో వర్షం తెరిపినివ్వలేదు. శేషాచలం కొండల నుంచి వరదలు పోటెత్తడంతో స్వర్ణముఖి నది, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మాల్వాడిగుండం, కపిలతీర్థం సమీపంలోకి ప్రజలను అనుమతించడం లేదు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లలో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. చెన్నై– విజయవాడ జాతీయరహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చిల్లకూరు సమీపంలో వరగలి క్రాస్ రోడ్డు నుంచి 2 కి.మీ మేర వాహనాలు బారులు తీరాయి. వాకాడు వద్ద 10 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచి్చంది. తిరుమలలోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీనికితోడు పొగమంచు తిరుమలను కమ్మేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఘాట్‌రోడ్డులోని జలపాతాలు పొంగిప్రవహిస్తున్నాయి.
తిరుమలలోని గోగర్భం ఆకాశగంగ, పాపవినాశం, కుమారధార–పసుపుధార డ్యాముల్లో నీటి ప్రవాహం పెరిగింది. తిరుపతి, శ్రీకాళహస్తితో పాటు తొట్టంబేడు, కోడూరు, బుచి్చనాయుడి కండ్రిగ, వడమాలపేట, ఏర్పేడు, వెంకటగిరి, బాలాయపల్లె, పెళ్లకూరు, సూళ్లూరుపేట తదితరచోట్ల భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలతో అన్నమయ్య జిల్లాలోని చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పింఛ డ్యామ్ వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మారింది. రైల్వేకోడూరు రోడ్లు జలమయం అయ్యాయి.
⇒ కడప నగరం జలమయమైంది. రోడ్లపైకి నీరు భారీగా చేరింది. అనేకచోట్ల మోకాళ్ల లోతులో నిలిచి... జనజీవనం స్తంభించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో మిడతవాగు, ఉలవపాడు మండలంలో ఉప్పుటేరు, అనంతరసాగరం మండలంలోని కొమ్మలేరు, మనుబోలు–గూడూరు మధ్య ఉండే పంబలేరు, చేజర్ల మండలంలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు నీటమునిగి నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మతో పాటు, ముసి, మన్నేరు, పాలేరుతో పాటు ఇతర వాగుల్లో నీరు చేరి పారుతున్నాయి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో 33.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఎరతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో 2,296 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
పలుచోట్ల పది సెంటీమీటర్లకు పైనే...
⇒ మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పాపమాంబపురంలో 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏర్పేడులో 13.4, బాలాయపల్లి మండలం చిలమన్నూరులో 13.1, వెంకటగిరి మండలం లాలాపేటలో 12.8, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గంగరాజుపురంలో 12.4, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 12, అనుమసముద్రంపేట మండలం దూబగుంటలో 11.1, తిరుపతి జిల్లా బాలాయపల్లె మండలం హస్తకావేరిలో 11.9, గొల్లగుంటలో 11.6, వెంకటగిరిలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 8.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. లింగసముద్రం మండలం ముగిచర్లలో 7.8, కృష్ణా జిల్లా నాగాయలంక భావదేవరపల్లెలో 7.5, గుంటూరు జిల్లా దుగ్గిరాల, ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం ఉమరెడ్డిపల్లెలో 6.1, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జంగందొరువు రోడ్డులో 5.9 సెంటీమీటర్ల వర్షం పడింది.

వాయుగుండంగా బలపడొచ్చు!
⇒ తీవ్ర అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదులుతున్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ తీరాలకు ఆనుకుని ఉన్న పశి్చమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాత ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర తీరాల మీదుగా కదిలే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 4 రోజులు పలుచోట్ల అతి భారీ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
⇒ తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది.
అప్రమత్తంగా ఉండండి: సీఎస్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె.విజయానంద్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతోపాటు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీల మృతి
పొన్నూరు: పిడుగు పడి పొలంలో కలుపు తీస్తున్న ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నూరు 23వ వార్డులోని క్రిస్టియన్‌పేటకు చెందిన వలపర్ల మరియమ్మ (45), నీలం మాణిక్యమ్మ, 27వ వార్డు షరాఫ్ బజార్‌కు చెందిన షేక్ ముజాహిద (45), మరికొందరు మహిళా కూలీలు కలిసి బుధవారం పెద ఇటికంపాడు రోడ్డులోని ఓ పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షం మొదలై వారు పని చేస్తున్న ప్రాంతంలో పిడుగు పడింది. దాని తీవ్రత వల్ల వలపర్ల మరియమ్మ, షేక్ ముజాహిదా అక్కడికక్కడే మృతిచెందారు. నీలం మాణిక్యమ్మ కాలికి తీవ్ర గాయమైంది. ఆమెను 108 సహాయంతో నిడుబ్రోలు సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.