
సాక్షి, విజయవాడ: తాజా బదిలీల్లో తిరుపతి ఎస్పీగా మళ్ళీ సుబ్బారాయుడిని చంద్రబాబు సర్కార్ నియమించింది. సుబ్బారాయుడు హయాంలోనే తిరుపతిలో భక్తుల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. సుబ్బారాయుడు నిర్లక్ష్యం, అసమర్థతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. తొక్కిసలాటకి బాధ్యుడిని చేసిన ప్రభుత్వం.. గతంలో బదిలీ చేసింది.
జనవరి 9న వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల క్యూలో తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట సమయంలో ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడికి మళ్లీ అదే పోస్టింగ్‌ను సీఎం చంద్రబాబు ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాజీ సెక్యూరిటీ అధికారిగా సుబ్బారాయుడి పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తిరుపతి కోసం సుబ్బారాయుడిని మళ్లీ ఏపీకి తెచ్చిన చంద్రబాబు.. హిందు భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా రీపోస్టింగ్ ఇచ్చారు.
కాగా, తిరుపతిలో చోటు చేసుకున్న విషాదానికి బాధ్యుడైన తన అస్మదీయ అధికారిని కాపాడేందుకు సీఎం చంద్రబాబు శతవిధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఓ డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి జేఈవో గౌతమిని బదిలీ చేశారు.
భక్తుల భద్రతకు ఎస్పీ ప్రధాన బాధ్యత వహించాలి. కానీ ఎస్పీ సుబ్బారాయుడు చంద్రబాబుకు వీర విధేయుడు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయన్ని వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి వేధించేందుకే గతంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే కొద్ది నెలలుగా ఆయన అక్రమ కేసులతో అరాచకానికి తెర తీశారనే విమర్శలూ ఉన్నాయి. ఆరుగురు భక్తుల దుర్మరణానికి ప్రధాన బాధ్యుడు అయినప్పటికీ సుబ్బారాయుడిని సస్పెండ్ చేయకుండా బదిలీతో సరిపెట్టారు. మళ్లీ ఆయనకు తిరుపతి ఎస్పీగా రీ పోస్టింగ్ ఇచ్చారు.