
‘రివర్స్ వాకింగ్’తో ఇతర కండరాలకూ పని
‘జంట నడక’గానూ కలిసి చేసే వ్యాయామం
వాకింగ్‌తో పోలిస్తే రెండింతల అదనపు ఫలితం
సాక్షి, సాగుబడి: నడక అంటే సాధారణంగా ముందుకు నడవటమే. అయితే, వెనక్కి నడిచే పద్ధతి కూడా వ్యాయామంలో ఒక భాగం. దీన్నే రివర్స్ వాకింగ్ లేదా రెట్రో వాకింగ్ లేదా బ్యాక్‌వర్డ్ వాకింగ్ అంటారు. సాధారణ నడక విసుగెత్తినప్పుడు మార్పు కోసం వెనక్కి అడుగులు వేయొచ్చు. దీనితో తొడ వెనుక కండరాలకు చక్కని వ్యాయామం లభిస్తుంది. మడమ శస్త్రచికిత్సల తర్వాత ఫిజియో థెరపీలో భాగంగా వెనక్కి నడిపిస్తారట. ముందుకైనా వెనక్కైనా నడక నడకే కదా.. అప్పుడప్పుడూ రివర్స్ గేరు వెయ్యండి మరి!
వెనక్కి నడిస్తే తొడ కండరాలు బలం పుంజుకుంటాయట. అంతకు పూర్వం.. అంతగా వాడని కండరాలకు దీంతో వ్యాయా మం దొరుకుతుందట. అంతేకాదు, శరీరం కొత్తగా వెనక్కి కదులుతున్నప్పుడు మనసు కూడా ఈ కొత్త సవాలుకు దీటుగా స్పందిస్తుందంటున్నారు నిపుణులు. అంటే మెదడుకు కూడా వ్యాయామమే. రివర్స్ వాకింగ్ ఫలితాలపై అమెరికాలోని నెవడ యూనివర్సిటీ ప్రొఫెసర్, బయోమెకనిస్ట్ డా.జానెట్ డ్యుఫెక్ అధ్యయనం చేశారు.
ట్రెడ్‌మిల్‌పై సేఫ్!
పార్కులోనో, వీధిలోనో వెనక్కి నడిచేటప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా, పడిపోకుండా జాగ్రత్తపడాలి. అదే, ట్రెడ్‌మిల్‌పై చేస్తే ఈ ఇబ్బంది ఉండదని అంటున్నారు పర్సనల్ ట్రైనర్లు. అయితే ట్రెడ్‌మిల్‌ను స్విచ్‌ఆఫ్ చేసి కరెంటు లేనప్పుడు ఉపయోగించాలి. ‘ట్రెడ్‌మిల్ బెల్ట్‌ను మన పాదాలతోనే నెడుతూ వెనక్కి నడవాలి. అలవాటయ్యే వరకు ఇది కొంచెం ఇబ్బందే. అందుకే మొదట్లో నెమ్మదిగా చేయాలి. కానీ, కండరాలకు ఇదొక భిన్నమైన వ్యాయామం’ అంటున్నారు ఆధునిక ట్రైనర్లు. రోజువారీ వ్యాయామం ప్రారంభంలో వార్మప్స్‌లో భాగంగా కాసేపు వెనక్కి నడిస్తే చాలని సూచిస్తున్నారు. మడమ గాయాల నుంచి కోలుకున్న వారికి లేదా శస్త్రచికిత్సల అనంతరం కోలుకుంటున్న వారికి ఈ రెట్రో వాకింగ్‌ను ఫిజియో థెరపిస్టులు సూచిస్తున్నారు.
వృద్ధులకు ఉపయోగం
‘ట్రెడ్‌మిల్‌పైన హ్యాండిల్స్ పట్టుకొని పడిపోకుండా వెనక్కి నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ట్రెడ్‌మిల్‌పై వెనక్కి నడవటం వృద్ధులకు ఉపయోగకరం. ఒక నిమిషంతో మొదలు పెట్టి పది నిమిషాల వరకు నెమ్మదిగా పెంచుకుంటూ పోవచ్చు. మీకు సౌలభ్యంగా ఉండేలా వేగాన్ని, దూరాన్ని ట్రెడ్‌మిల్‌లో సెట్ చేసుకుని ఈ రివర్స్ వాకింగ్ ప్రయత్నించవచ్చు’ అంటున్నారు డా.డ్యుఫెక్.
జంట నడక మేలు!
సాధారణంగా వ్యాయామం అంటే ఒక్కరే చేస్తుంటారు. కానీ, ఈ రెట్రో వాకింగ్‌లో స్నేహితులు లేదా భార్యాభర్తలు కలిసి చేసే వెసులుబాటు ఉంది. మీ భాగస్వామికి ఎదురుగా నిలబడి, రెండు చేతులను వేళ్లు చొప్పించి బిగుతుగా పట్టుకొని, ఒకరు ముందుకు నడుస్తుంటే.. మరొకరు వెనక్కి నడవొచ్చు. అంటే ఒకరికి మామూలు నడక.. మరొకరికి వెనక నడక అన్నమాట. కాసేపటి తర్వాత అటు ఇటు మారవచ్చు. ఈ ‘జంట నడక’ అక్కడే ఆగక్కర్లేదు. అలవాటు పడిన తరువాత నెమ్మదిగా జాగింగ్‌లా చేయవచ్చు.
ఎన్ని ప్రయోజనాలో...
⇒ అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అంచనాల ప్రకారం.. మామూలు వాకింగ్‌తో పోలిస్తే రెట్రో వాకింగ్ వల్ల దాదాపు రెట్టింపు సంఖ్యలో కేలరీలు ఖర్చవుతాయి.
⇒ నడుము నొప్పి, జాయింట్ పెయిన్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లకు ఇది మంచి వ్యాయామం అని నిపుణులు చెబుతున్నారు.
⇒ రెట్రో వాకింగ్ వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
⇒ ఎక్కువ మంది ఉన్నప్పుడు, వాహనాలు తిరిగే ప్రదేశాల్లో రెట్రో వాకింగ్ చేయవద్దు.
⇒ గరుకుగా ఉన్న ఉపరితలం లేదా రాళ్లు వంటివి ఉండే ప్రదేశాల్లో వద్దు.
⇒ హడావుడిగా, కంగారుగా చేయకూడదు.
⇒ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సూచనలు తీసుకోవాలి.