
వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు
‘వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరణలో సజ్జల
28న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు
నవంబర్ 24న పార్టీ కార్యాలయానికి చేరుకోనున్న కోటి సంతకాలు
గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులను సమర్పించనున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో సాకారమైన కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడతామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తమతో కలసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలసి ఉద్యమిస్తామని తెలిపారు. ‘వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్‌ను బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శైలజానాథ్, చెల్లుబోయిన వేణు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణతోపాటు ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు సజ్జల చెప్పారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తి చేసి వైఎస్ జగన్ పార్టీ నేతలతో కలసి గవర్నర్‌కి అందజేస్తారని చెప్పారు.
ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం..
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో భావి తరాలు ఎంత నష్టపోతాయో ప్రజలకు వివరిస్తున్నాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం. ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ అక్టోబర్ 23న అన్ని జిల్లా కేంద్రాల్లో, 24న నియోజకవర్గ కేంద్రాల్లో, 25న మండల కేంద్రాల్లో జరుగుతుంది. కోటి సంతకాల ప్రతులు నవంబర్ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్ర కార్యాలయాలకు, నవంబర్ 24న కేంద్ర కార్యాలయానికి చేరతాయి.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే 7 కాలేజీలు పూర్తి..
వైఎస్సార్‌సీపీ దిగిపోయే నాటికి 7 కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేశాం. మరో 3 కాలేజీలు ఆదోని, మదనపల్లె, మార్కాపురంలో 80 నుంచి 90 శాతం పనులు పూర్తి చేసుకుని అడ్వాన్స్ దశలో ఉండగా మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీల నిర్మాణం ఒక్క రోజులో జరిగే పనికాదు. కేంద్రం నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రి పూర్తి కావడానికి 9 ఏళ్లు పట్టిందనే విషయాన్ని చంద్రబాబు మర్చిపోతే ఎలా? ఒకపక్క మెడికల్ కాలేజీలను ప్రైవేటుకి కట్టబెడుతూ, తాను ఉచితంగా వైద్యం అందిస్తానంటే వైఎస్ జగన్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థలు లాభాపేక్ష లేకుండా మెడికల్ కాలేజీలు ఎలా నడుపుతాయి? చంద్రబాబు చెబుతున్న పీపీపీ మోడల్ వల్ల భూమి, భవనాలు వినియోగించుకుని ప్రైవేట్ వ్యక్తులు జేబులు నింపుకొంటే పేదలు వైద్యం కోసం మరింత నిరుపేదలుగా మారిపోతారు. అలాంటప్పుడు పీపీపీతో నష్టం లేదని ఎలా చెబుతారు?