
కూటమి పాలనలో మహిళలని కూడా చూడకుండా కేసులు
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి
ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అంటే గంజాయి, బెల్ట్ షాప్‌లు,పర్మిట్ రూమ్స్, పేకాట క్లబ్‌లు, డ్రగ్స్, మహిళలపై అఘాయిత్యాలు
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన: మాజీ మంత్రి ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: మహిళలకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత మేలు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు తనతో పాటు అడుగులు వేయాలని, నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని వైఎస్ జగన్ నమ్మారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వైపు దేశం మొత్తం తిరిగిచూసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ. కూటమి పాలనలో మహిళలని కూడా చూడకుండా కేసులు పెడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నవారి ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. సంయమనం, క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉంటుందనే సందేశం ఇవ్వాలని సూచించారు. పార్టీ ఇతర అనుబంధ సంఘాల తరహాలోనే మహిళా విభాగం కూడా జిల్లా స్థాయిలో సమావేశం కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి నిర్దేశించారు.
జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని కలుపుకొంటూ ముందుకెళ్లాలన్నారు. పనిచేసే క్రమంలో అడ్డంకులు సహజమని, పార్టీలోని నాయకుల సహకారంతో వాటిని తొలగించుకోవాలని సూచించారు. అపోహలతో పార్టీకి దూరమైన వర్గాలకు మళ్లీ దగ్గర కావాలని చెప్పారు. ఈ కష్ట కాలంలోనూ పార్టీలో పది పదవులకు వందమంది పోటీకి వస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏ పార్టీలోనూ ఇలా జరగదని, వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెక్కుచెదరకపోగా మరింత పెరిగింది అనేందుకు నిదర్శనం ఇదేనని వివరించారు.
మహిళలను నిలువునా మోసం చేసిన కూటమి: వరుదు కళ్యాణి
కూటమి ప్రభుత్వం మహిళలను నిలువునా మోసం చేసిందని వరుదు కళ్యాణి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు సంక్షేమం కింద ఒక్క రూపాయి కూడా అందడం లేదని, మహిళా లోకం కుమిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు జగనన్న పాలనలో జరిగిన లబ్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని, సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు.
ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అంటే గంజాయి, బెల్ట్ షాప్‌లు, పర్మిట్ రూమ్‌లు, పేకాట క్లబ్‌లు, డ్రగ్స్, మహిళలపై అఘాయిత్యాలు అని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలకు బదులు సూపర్ స్కామ్స్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్రలకు, ప్రజా నాయకుడైన జగనన్నకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.
ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుంబిగించాలి
మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా వారి నరకాసుర పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవమానాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే సూపర్ సిక్స్ అని అన్నారు. వైఎస్సార్‌సీపీలోని ప్రతి మహిళా సత్యభామలా మారి ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మహిళా లోకాన్నే మోసం చేసిందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ మహిళా నేతలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు.
మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఐదేళ్లూ పరిపాలన మీదే దృష్టిపెట్టారని, మేనిఫెస్టోలో చెప్పినవాటితో పాటు, చెప్పని హామీలనూ నెరవేర్చారని అన్నారు. ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ... కూటమి నాయకుడి మనసులో మెదిలితే చాలు మన మీద తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు.
సమావేశంలో అనుబంధ విభాగాల ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ మాజీ చైర్ పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు.