ఖతర్‌ స్టేడియాల్లో ‘ఫిఫా’ పనులు చేస్తూ మరణాలు.. నయాపైసా చెల్లించని వైనం

Telangana Migrants Died While Working At Qatar Football Stadium For FIFA - Sakshi

సాక్షి, నిజామాబాద్‌/జగిత్యాల: నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం వెల్మల్‌వాసి కల్లెడ రమేశ్‌(50) ఖతర్‌లోని బూమ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తూ 2016లో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. ఫుట్‌బాల్‌ కప్‌(ఫిఫా) టోర్నీకి సంబంధించిన విధుల్లో పనిగంటలను విపరీతంగా పెంచడంతో తీవ్ర ఒత్తిడికి గురికావడమే కారణం. రమేశ్‌ కుటుంబానికి ఖతర్‌ ప్రభుత్వం, కంపెనీ పరిహారం చెల్లించలేదు. ఇతని మృతితో కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయింది. 

జగిత్యాల్‌ జిల్లా మల్లాపూర్‌ మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్‌కు చెందిన సురకంటి జగన్‌(32) 2021 నవంబర్‌ 11లో ఖతర్‌లో ఫుట్‌బాల్‌ స్టేడియంలో పైప్‌లైన్‌ పనులు చేస్తుండగా మట్టిపెళ్లలు కూలి సమాధి అయ్యాడు. అతని భార్య, కూతురు, కొడుకులు పెద్ద దిక్కును కోల్పోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకూ ఆధారం లేకుండా పోయింది. 

జగిత్యాల్‌ జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయిపల్లికి చెందిన నరుకుల్ల శ్రీనివాస్‌(30) 2020 జనవరి 4న ఖతర్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో టవర్‌ క్రేన్‌ ఆపరేటర్‌గా పని చేస్తుండగా మరణించాడు. అతని మరణంతో భార్య అనిత, ఇతర కుటుంబసభ్యులు కుంగిపోతున్నారు. ఫిఫా పోటీల కోసం ఖతర్‌ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టులో పని కోసం వెళ్లి ప్రమాదాలు, పని ఒత్తిడితో తీవ్ర అనారోగ్యానికి గురికావడం, అనుమానాస్పద స్థితిలో మరణించిన మన దేశ వలస కార్మికుల సంఖ్య 2,800 వరకు ఉంటుందని అంచనా.


నరుకుల్ల శ్రీనివాస్‌ అంతిమయాత్రలో ప్లకార్డులతో పాల్గొన్న గల్ఫ్‌ జేఏసీ నాయకులు  

ఆసియా దేశాలకు సంబంధించిన వలస కార్మికులు ఖతర్‌లో గడచిన పదేళ్లలో 6,500 మంది మరణించారని వలస కార్మికుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌(ఫిఫా) పోటీల కోసం ఖతర్‌ ప్రభుత్వం దాదాపు రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. స్టేడియంలు, క్రీడాకారులు, క్రీడాభిమానుల సౌకర్యాల కోసం ఎన్నో నిర్మాణాలను చేపట్టింది.

పోటీల కోసం ఖతర్‌ ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసినా వలస కార్మికుల కుటుంబాలకు మాత్రం పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిని సహజ మరణాలుగానే ధ్రువీకరించడం గమనార్హం. ఫిఫా పనుల కోసం ఖతర్‌ ప్రభుత్వం వివిధ కంపెనీలకు పదేళ్ల కిందనే కాంట్రాక్టులు ఇచ్చింది.  

ఖతర్‌ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి 
ఖతర్‌లో ఫిఫా పనుల కోసం ఉపాధి పొందుతూ ఏ కారణంతో మరణించినా అలాంటి వలస కార్మికుల కుటుంబాలను అక్కడి ప్రభుత్వం ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఖతర్‌ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి.
– గుగ్గిల్ల రవిగౌడ్, గల్ఫ్‌ జేఏసీ చైర్మన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top