
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫుడ్ పాయిజన్ అంశం చాలా తీవ్రమైనదని వ్యాఖ్యలు చేసింది.
నారాయణపేట జిల్లాలో మాగనూర్లోని పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులు కుర్ కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్టు కోర్టుకు తెలిపారు. ఈ ఘటన విషయంలో బాధులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఏఏజీ చెప్పారు.
ఈ సందర్భంగా.. సదరు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో మాగనూరు, కరీంనగర్, బురుగుపల్లి ఘటనలపై కూడా నివేదిక ఇవ్వాలని న్యాయ స్థానం కోరింది. ఈ ఘటనలపై సోమవారంలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవలే 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, అధికారులు రంగంలోకి హెచ్ఎం సహా మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరువకముందే నిన్న(బుధవారం) మళ్లీ ఫుడ్ పాయిజన్ కారణంగా మరో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వరుస ఘటనలపైనే నేడు హైకోర్టులో విచారణ జరిగింది.