
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టు ఆగ్రహం
నాగారం భూముల్లో నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీత
వారంలోగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశం; ఇదే చివరి అవకాశమని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలంటే లెక్కలేదా అంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్వరం మండలం నాగారంలోని గైరాన్ సర్కారీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని తాము ఆదేశించామని, ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని జూన్‌లో తాము ఆదేశించామని.. 4 నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు ఎందుకు సమర్పించలేదని నిలదీసింది.
ఆ భూముల వద్దకు వెళ్లి నిర్మాణాలు జరుగుతున్నాయా.. లేదా..పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఏం ఇబ్బందని అడిగింది. కలెక్టర్ నుంచి ఇంత నిర్లక్ష్యాన్ని ఊహించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది న్యాయస్థానం ఉత్తర్వుల ధిక్కరణే అవుతుందని స్పష్టం చేసింది. చివరి అవకాశం ఇస్తున్నామంటూ.. వారంలోగా నివేదిక అందజేయాలని, అందులో ఆలస్యానికి కారణాలను వెల్లడించాలని తెలియచెప్పింది.
ఇదీ కేసు..: నాగారం గ్రామంలోని సర్వే నంబర్ 181, 182, 194, 195లోని గైరాన్ భూములను కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి బంధువులు అక్రమంగా కొనుగోలు చేశారని బిర్లా మల్లేశ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం గానీ, బదిలీ చేయడం గానీ, నిర్మాణాలు చేపట్టడం సహా ఎలాంటి మార్పులు చేయవద్దని ప్రతివాదులకు తేల్చిచెప్పింది. ఈ విధంగా న్యాయస్థానం ఉత్తర్వులున్నా వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మల్లేశ్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
జూన్‌లో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు వారాల్లో పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు సమాధానమిస్తూ నివేదిక అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అయినా కలెక్టర్ నివేదిక దాఖలు చేయకపోవడంతో మహేశ్ మరో ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు వారం గడువిస్తూ తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేశారు.