సత్తుపల్లిలో 250 పడకల ఆస్పత్రి

Telangana: Harish Rao Was Chief Guest At Hospital Logo Launch Event - Sakshi

నిర్మాణానికి శ్రీ షిరిడీ సాయి జనమంగళం ట్రస్ట్‌ శ్రీకారం

ఆస్పత్రి నమూనా ఆవిష్కరణ.. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌

ప్రభుత్వపరంగా ఏ సాయమైనా అందిస్తామని హామీ  

పంజగుట్ట: దేశంలో అన్నింటికన్నా వైద్యం ఎంతో ఖరీదుగా మారిందని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో శ్రీ షిరిడీసాయి జన మంగళం ట్రస్ట్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలో 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఆసుపత్రి లోగో, నమూనా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామని, గతంలో 5 మెడికల్‌ కాలేజీలు ఉండగా ప్రస్తుతం మరో 12 పెంచి మొత్తం 17 మెడికల్‌ కాలేజీలు, ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్యం అందించాలని 700 పీసీహెచ్‌ సెంటర్‌లకు అదనంగా గ్రామాల్లో 4 వేల పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  ్డట్రస్ట్‌ ఆస్పత్రికి ప్రభుత్వపరంగా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. 

గొప్ప కార్యక్రమం: టీటీడీ చైర్మన్‌ 
అందరూ ఆస్పత్రిని పెద్ద నగరంలో కడితే బాగుంటుందని అనుకుంటారని, కానీ సాయి ట్రస్ట్‌ మాత్రం సత్తుపల్లిలోని మారుమూల గిరిజన గ్రామాన్ని  ఎంచుకుందని, ఇది గొప్ప కార్యక్రమమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి  చెప్పారు.

ఏపీ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలోనే ఆస్పత్రి రానుండటం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారికీ ఉపయోగంగా ఉంటుందన్నారు. టీటీడీ తరఫున తామూ కొన్ని ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందిస్తున్నామని, ఇటీవల పీడియాట్రిక్‌ ఆస్పత్రి పారంభించామని చెప్పారు. 

అభినందనీయం: నటుడు మోహన్‌బాబు 
ఎదుటివారి కష్టాలు తెలుసుకొని తీర్చేందుకు మారుమూల ప్రాంతంలో ఆస్పత్రి నిర్మిస్తున్న సాయి ట్రస్ట్‌ ప్రతినిధులు అభినందనీయులని ప్రముఖ నటుడు, నిర్మాత డాక్టర్‌ మోహన్‌బాబు అన్నారు. రెండేళ్లుగా ప్రజలు కొత్తకొత్త వ్యాధులతో సతమతమౌతున్నారని వారి ఇబ్బందులు చూసి మారుమూల ప్రాంతంలోని ప్రజలకు వైద్యం అందించేందుకు ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఐపీఎస్‌ చంద్రభాను సత్‌పతి, ట్రస్ట్‌ ప్రతినిధి రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top