
నిర్మల్ కొయ్య బొమ్మ.. పోచంపల్లి చీర.. చేర్యాల పెయింటింగ్..
ప్రత్యేకంగా పోటీల్లో వాటికి సంబంధించిన ప్రశ్నలు..
ఇందుకోసం పోటీదారులకు హస్తకళలపై అవగాహన
21న శిల్పారామంలో లైవ్ డెమానిస్ట్రేషన్
కళాకారులతో సుందరీమణులకు మెళకువలు
సాక్షి, హైదరాబాద్: నిత్యం ఫ్యాషన్ ప్రపంచంలో మునిగితేలే సుందరీమణులు నిర్మల్ కొయ్య బొమ్మలను చెక్కనున్నారు.. పోచంపల్లి చీరల తయారీకి పోగులు సిద్ధం చేయబోతున్నారు. చేర్యాల పెయింటింగ్స్‌కు రంగులద్దనున్నారు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ సంప్రదాయ హస్తకళలకు సంబంధించి కాసేపు ‘కళాకారులు’కాబోతున్నారు. పోటీలో భాగంగా తెలంగాణ హస్తకళలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. ‘ప్రపంచ సుందరి’ 72వ ఎడిషన్ పోటీలకు వేదికైన హైదరాబాద్ కొత్త ‘అందం’తో తళుకులీనుతోంది.
ఇప్పటికే కొన్ని దేశాలకు చెందిన పోటీదారులు నగరానికి చేరుకోగా, మరికొందరు సోమ, మంగళవారాల్లో వస్తున్నారు. వీరి రాకకు దాదాపు వారం ముందే మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ, చైర్‌పర్సన్ జూలియా మోర్లే తన సిబ్బందితో నగరానికి చేరుకున్నారు. హైటెక్‌సిటీ సమీపంలోని ట్రైడెంట్ స్టార్ హోటల్‌లో ఆమె తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోటీల నిర్వహణ పూర్తిగా మిస్ వరల్డ్ లిమిటెడ్ కనుసన్నల్లోనే జరగనుంది. పోటీల షెడ్యూల్, ఇతివృత్తాలను ఆ సంస్థే నిర్ణయించింది.
రాష్ట్రప్రభుత్వ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని డిజైన్ చేసింది. ఇదే సందర్భంలో జూలియా మోర్లే రాష్ట్రప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సంప్రదాయ హస్తకళలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, వాటిని పోటీల్లో భాగంగా చేర్చాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయా హస్తకళలపై పోటీదారులకు అవగాహన కల్పించాలని కోరారు. దీంతో రాష్ట్రప్రభుత్వం శిల్పారామంలో ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.
22 రకాల హస్తకళల లైవ్ డెమానిస్ట్రేషన్ ఇక్కడ ఉండనుంది. ఈ నెల 21న వివిధ దేశాల పోటీదారులు అక్కడికి రానున్నారు. వారి ముందే నిపుణులైన కళాకారులు ఆయా కళాకృతులను తీర్చిదిద్ది, వాటి ప్రత్యేకతలను వివరించనున్నారు. వాటి తయారీలో పోటీదారులు కూడా స్వయంగా పాల్గొంటారు. శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది.
స్టాళ్లు చూసి ఆసక్తి..
మార్చి 20న మిస్ వరల్డ్ పోటీల వివరాలను తొలిసారి జూలియా మోర్లే పర్యాటక భవన్‌లో మీడియాకు వెల్లడించారు. మిస్ వరల్డ్–2024 విజేత, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టీనీ పిజ్కోవా కూడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వాగతం పలికేందుకు తెలంగాణ హస్తకళలను స్వయంగా రూపొందిస్తూ కళాకారులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని జూలియా, క్రిస్టీనీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. క్రిస్టీనా పిజ్కోవా అయితే కాసేపు మగ్గం మీద కూర్చుని పోచంపల్లి చీర అల్లికను పరిశీలించారు.
అప్పుడే వీటిపై మిస్‌వరల్డ్ సీఈఓకు ప్రత్యేకాసక్తి కలిగిందని సమాచారం. ఆమె సూచనతో అధికారులు ప్రత్యేకంగా వాటి లైవ్ డెమానిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేశారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ చిత్రకళ, నిర్మల్ కొయ్య బొమ్మలు, బిద్రి వేర్, బంజారా ఎంబ్రాయిడరీ, పోచంపల్లి, కొత్తకోట, నారాయణపేట, గద్వాల హ్యాండ్‌లూమ్స్, పెంబర్తి ఇత్తడి బొమ్మలు, సిల్వర్ ఫిలిగ్రీ, సిద్ది పేట గొల్లభామ చీరలు, నకాషీ, మట్టికుండల తయారీ, కళంకారీ.. ఇలా పలు కళలకు సంబంధించిన ఏర్పాట్లు చేయటం విశేషం.