
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ సుందరి పోటీల ద్వారా తెలంగాణకు, హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభిస్తోంది. పోటీలకు వచ్చిన ప్రతినిధులు వివిధ మీడియా సంస్థలకు, మిస్ వరల్డ్ సంస్థ ఏర్పాటు చేసిన సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో హైదరాబాద్, తెలంగాణ గురించి గొప్పగా వర్ణిస్తున్నారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన ఆధునిక నగరమని, తెలంగాణ తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆకట్టుకుంటోందని ప్రశంసిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారమవుతున్నాయి. ఒక్కో ప్రపంచ సుందరి పోటీదారుకు సోషల్‌మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వీరి వీడియోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. అలా హైదరాబాద్, తెలంగాణకు మంచి ప్రచారం లభిస్తోంది.
3,300 విదేశీ ఛానల్స్‌కు సమాచారం..
మిస్ వరల్డ్ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నారని, దాదాపు మూడున్నర వేల మంది విదేశీ జర్నలిస్టులు పోటీలయ్యేవరకు హైదరాబాద్‌లో ఉండి ఆయా దేశాలకు ఇక్కడి పరిస్థితులపై సానుకూల సంకేతాలను పంపుతారని ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. కానీ, ఈ పోటీల కవరేజీకి వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులు 20 మంది వరకు మాత్రమే. దీంతో ప్రభుత్వ అంచనా తప్పిందన్న భావన వ్యక్తమైంది.
అయితే, మిస్ వరల్డ్ లిమిటెడ్ ఈ పోటీల ప్రచారం కోసం బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేసి, పోటీలకు సంబంధించి సమగ్ర వివరాలను 3,300 విదేశీ టీవీ ఛానల్స్‌కు అందిస్తున్నారు. పోటీలో ఉన్న 113 దేశాలకే కాకుండా, పోటీల్లో లేని దేశాలకు చెందిన టీవీ ఛానల్స్ కూడా ఆ జాబితాలో ఉన్నాయని మిస్ వరల్డ్ ప్రతినిధులు తెలిపారు. దీంతో తెలంగాణకు ప్రపంచం నలుమూలలా ప్రచారం లభిస్తోంది.
భిన్న సంస్కృతుల కేంద్రం
ఆశ్చర్యపరిచే భిన్న సంస్కృతులకు కేంద్రం తెలంగాణ. విద్య, వైద్య పరంగా ఇక్కడ గొప్ప వసతున్నాయి. మా దేశం నుంచి ఎంతోమంది ఇక్కడ చదువుకునేందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి వసతులను ప్రత్యక్షంగా చూస్తున్నాను
–అయోమ్ టీటో మటీస్, సౌత్ సూడాన్.
సొంత ప్రాంతంలో ఉన్నట్లుంది
ఆఫ్రికా ఖండంలో సంస్కృతికి గొప్పగా ఉంటుంది. తెలంగాణను చూసిన తర్వాత మాలాగే ఇక్కడి ప్రజలు సంస్కృతిని కాపాడుకుంటూ కొనసాగిస్తున్న తీరు అబ్బురపరిచింది. నాకు సొంత ప్రాంతంలో ఉన్న అనుభూతి కలుగుతోంది.
–జైనబ్, సొమాలియా
ఇక్కడి అభివృద్ధి ఆశ్చర్యకరం
మా దేశంలో చాలా మందిలో ఇండియా అభివృద్ధి చెందని దేశం అన్న భావన ఉంది. కానీ, హైదరాబాద్‌ను చూసిన తర్వాత ఇక్కడి ఆధునిక పోకడలు, తక్కువ సమయంలో అభివృద్ధి చెందిన తీరు తెలుసుకుని ఆశ్చర్యపోయాను.
– అతెన్నా క్రోస్బీ, అమెరికా
ఇదెంతో సురక్షిత ప్రాంతం
ఇక్కడికి రావటం సురక్షితం కాదని, విదేశీ యువతులను రేప్ చేసి చంపేస్తారని నేను ఇక్కడికి వచ్చేముందు కొందరు సలహా ఇచ్చారు. కానీ, ఇక్కడికి వచ్చాక తెలిసింది.. ఈ ప్రాంతం చాలా సురక్షితమని. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో నా ధృక్కోణం పూర్తిగా మారింది.
–నటాషా న్యోన్యోజీ, ఉగాండా.
ఇక్కడ బౌద్ధానికిస్తున్న ప్రాధాన్యం ఆశ్చర్యపరిచింది
భారతీయ సంప్రదాయాలంటే జపనీయులకు ఎంతో ఇష్టం. వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి పులకిస్తున్నాను. ఈ ప్రాంతంలో బౌద్ధానికి ప్రాధాన్యం ఇస్తున్న తీరు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. నాకు ఇండియా సినిమాలంటే చాలా ఇష్టం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు మా దేశంలో యువత రీల్స్ రూపొందించారు. ఆ పాటలో నటించిన తెలుగు నటుల సొంత ప్రాంతంలో ఇప్పుడు నేనున్నానన్న అనుభూతి గొప్పగా ఉంది.
–కియానా తుమీత, జపాన్.