వేలానికి వేళాయె.. త్వరలో అసైన్డ్‌ భూముల వేలం! | Telangana Govt Decides Land Auction In Rangareddy District | Sakshi
Sakshi News home page

త్వరలో రంగారెడ్డి జిల్లాలోని అసైన్డ్‌ భూముల వేలం

Apr 8 2021 2:07 AM | Updated on Apr 8 2021 8:18 AM

Telangana Govt Decides Land Auction In Rangareddy District - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో పన్నేతర ఆదాయం కింద భారీగా 30 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించిన ప్రభుత్వం... ఆ నిధుల సమీకరణకు ఉద్యుక్తమవుతోంది. అందులో భాగంగా రాజధాని శివార్లలోని అసైన్డ్‌ భూముల అమ్మకం వ్యవహారంపై దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, గండిపేట మండలాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అమ్మకానికి అనువుగా ఉన్నాయని గుర్తించిన 1,636 ఎకరాల భూమిని ప్రభుత్వం త్వరలోనే వేలానికి పెట్టనున్నట్లు సమాచారం. ఈ భూముల అమ్మకాల ద్వారా రూ.4 వేల కోట్ల దాకా వస్తాయని తొలుత అంచనా వేశారు.

కానీ ప్రస్తుతం పెరిగిన మార్కెట్‌ ధరల ప్రకారం రూ.5 వేల కోట్ల వరకు రావొచ్చని రెవెన్యూ అధికారులు లెక్కలు గడుతున్నారు. వీటికి తోడు గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో ఖాళీగా ఉన్న మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయిస్తే రూ.3,500 కోట్ల వరకు సమకూరే అవకాశాలున్నాయి. ఈ లెక్కన అసైన్డ్‌ భూముల అమ్మకాల ద్వారా తొలివిడతలో రూ.8,500 కోట్ల వరకు రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

లబ్ధిదారులకు నష్టం లేకుండా
వాస్తవానికి నగర శివార్లలో ప్రభుత్వం వేలాది ఎకరాలను పలు దశల్లో పేదలకు అసైన్‌ చేసింది. ఎలాంటి ఆసరాలేని సదరు పేదలు ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని ఉపాధి పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ భూములు కొన్ని వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం, పేదలు తమ అవసరాలకు భూములను ఇతరులకు విక్రయించడంతో... ఇప్పుడు ఎక్కువ భూములు అటు ప్రభుత్వం దగ్గర, ఇటు అసైన్డ్‌దారుల దగ్గర కాకుండా థర్డ్‌పార్టీ చేతిలో ఉన్నాయి. ఇలాంటి భూములెన్ని ఉన్నాయన్న లెక్క భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇదివరకే ఓ కొలిక్కి వచ్చింది.

హైదరాబాద్‌ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరఖుర్దు, మాదాపూర్, రావిర్యాల, తుమ్మలూరు, రాయన్నగూడ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ గ్రామాల్లో అసైన్‌ చేసిన భూముల్లో అన్యాక్రాంతమైనవి, నిరుపయోగంగా ఉన్నవి కలిపి మొత్తం 1,636 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చింది. గత ఏడాది కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వేలం వేయడం లేదా బహుళ జాతి సంస్థలకు విక్రయించే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మరోమారు తెప్పించుకున్న ఉన్నతాధికారులు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రెవెన్యూవర్గాలు చెపుతున్నాయి.

అయితే అసైన్డ్‌ చేసిన పేదలకు నష్టం కలగకుండా ఈ భూములను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసైనీల చేతిలో ఉన్నప్పటికీ వారు వ్యవసాయం చేయకుండా ఉన్న భూములు, అసైనీలు ఇతరులకు అమ్ముకున్న భూములను తీసుకోవాలని, ఈ క్రమంలో అసైనీలకు లేదంటే థర్డ్‌పార్టీకి మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని యోచిస్తోంది. ఇందుకు గాను రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని కూడా రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 

పద్దు పూడాలంటే... అమ్మాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.30,557 కోట్లను చూపెట్టింది. కానీ గత మూడేళ్ల లెక్కలను పరిశీలిస్తే ఎప్పుడూ పన్నేతర ఆదాయం రూ.10 వేల కోట్లను దాటలేదు. 2018–19లో రూ. 10,007 కోట్లు, 2019–20లో రూ.7,360 కోట్లు, 2020–21లో అయితే రూ.5వేల కోట్లు దాటలేదు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పన్నేతర ఆదాయం కింద రూ. 30,600 కోట్లు పద్దు చూపెట్టినా అందులో ఆరో వంతు మాత్రమే వచ్చింది.

గత ఏడాదిలోనూ ప్రభుత్వ భూముల అమ్మకం ప్రతిపాదనలున్నప్పటికీ అమల్లోకి రాకపోవడంతో పన్నేతర ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 30,557 కోట్లను పన్నేతర పద్దు కింద ప్రభుత్వం చూపెట్టడంతో ఈసారి భూముల అమ్మకాలు అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లోనే నగర శివార్లలోని అసైన్డ్‌ భూముల అమ్మకాల ప్రతిపాదన ఫైలును మరోమారు ప్రభుత్వం తెరుస్తోంది. భూములు అమ్మకాల తొలిదశలో భాగంగా ఈ అసైన్డ్‌ భూములతో పాటు మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడం లేదంటే బహుళ జాతి సంస్థలకు నిర్దేశిత ధరకు విక్రయించడం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. 

అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చిన అసైన్డ్‌ భూముల లెక్క ఇది
గ్రామం               ఎకరాలు            ఆదాయం అంచనా (రూ.కోట్లలో)
మాదాపూర్‌         243.35                 243
రావిర్యాల            281.19                 843
తుమ్మలూరు       418.01                 1254
రాయన్నగూడ      69.09                  48.30
కొంగరఖుర్దు         435.18                1,196
(ఇవి గాక గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో 188 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని అమ్మితే రూ.3,500 కోట్లు వస్తాయని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.) 

చదవండి: సీరియస్‌గా ఉంటేనే అడ్మిషన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement