గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం.. మాట్లాడకుండా వెళ్లిపోయిన మంత్రి సబిత

Telangana Governor Tamilisai Soundararajan Sabitha Indra Reddy - Sakshi

ఉన్నతాధికారులతో సహా వెళ్లి గవర్నర్‌ తమిళిసైతో భేటీ 

వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుపై వివరణ..

బిల్లులోని అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించిన గవర్నర్‌ 

వర్సిటీలకు చాన్స్‌లర్‌ అయిన తనకు ముందే చెప్పకపోవడం ఏమిటని అసంతృప్తి 

ఈ బిల్లు చట్టమైతే వర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని స్పష్టీకరణ 

ఉమ్మడి భర్తీతో రాజకీయ జోక్యం ఉండదా అని ప్రశ్న 

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన మంత్రి, అధికారులు 

ప్రజల ప్రయోజనం కోసమే గవర్నర్‌ ఆరాటమంటూ రాజ్‌భవన్‌ ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది నియామకాలకు సంబంధించిన ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లుపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఆమె గురువారం సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, మరికొందరు అధికారులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. సుమారు 45 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. 

సందేహాలు.. వివాదాల మధ్య.. 
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో గతంలో మాదిరిగా విడివిడిగా కాకుండా, ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. అయితే ఈ బిల్లుకు సంబంధించి తనకు పలు సందేహాలు ఉన్నాయని, వచ్చి వివరణ ఇవ్వాలని విద్యా మంత్రి సబితను గవర్నర్‌ తమిళిసై కోరారు. తనకు గవర్నర్‌ పిలుపు అందలేదని, ప్రజలను రాజ్‌భవన్‌ తప్పుదోవ పట్టించవద్దని మంత్రి సబిత వ్యాఖ్యానించడం, దీనిని తప్పుపడుతూ గవర్నర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సబిత రాజ్‌భవన్‌కు వెళ్లారు. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లు తేవాల్సిన అవసరం, ఇందులో పాటించిన నిబంధనలు, యూజీసీ మార్గదర్శకాలను పరిగణనలోనికి తీసుకున్నామని గవర్నర్‌కు వివరించారు. 

ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ అసంతృప్తి 
అయితే రాష్ట్రంలోని వర్సిటీల్లో ఎనిమిదేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడాన్ని గవర్నర్‌ తమిళిసై ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపై ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. యూనివర్సిటీలకు చాన్సలర్‌ అయిన తనకు బిల్లు తెచ్చే విషయాన్ని ముందే చెప్పకపోవడంపై నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కనీసం వీసీలతోనైనా చర్చించారా? అని ప్రశ్నించినట్టు సమాచారం. ఇలాంటి బిల్లు తేవడం వల్ల విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. అయితే ప్రస్తుత విధానంలో నియామక ప్రక్రియ వల్ల అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, అందుకే ఉమ్మడి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు వివరించినట్టు సమాచారం. అలాగైతే వీసీల ప్రమేయమే లేకుండా జరిగే నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండదా? అని గవర్నర్‌ నిలదీసినట్టు తెలిసింది. బిల్లులోని అంశాలపై గవర్నర్‌ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. అధికారులు కొన్నింటికి బదులిచ్చారని.. కొన్నింటి విషయంలో స్పష్టత ఇవ్వలేకపోవడంతో గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. 

ముందే సిద్ధమైన మంత్రి 
గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లే ముందు మంత్రి సబిత తన చాంబర్‌లో అధికారులతో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో ఎవరే అంశంపై మాట్లాడాలనే దానిపై చర్చించారు. సాంకేతిక, న్యాయ సంబంధ అంశాలపై సంబంధిత శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్నట్టు తెలిసింది. అయితే గవర్నర్‌ను కలిసిన అనంతరం మంత్రి సబిత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఏ అధికారి కూడా మీడియాతో ఈ అంశంపై మాట్లాడొద్దని ఆదేశించినట్టు తెలిసింది. 

నియామకాల్లో పారదర్శకత అవసరం: గవర్నర్‌ తమిళిసై 
విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేపట్టే పోస్టుల భర్తీ పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని.. అర్హత ఆధారంగానే నియామకాలు ఉండాలని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాల నేపథ్యంలోనే తాను ఉమ్మడి బోర్డు ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేసినట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు గవర్నర్, మంత్రి భేటీ అనంతరం రాజ్‌భవన్‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

సమావేశం సందర్భంగా గవర్నర్‌ పలు సూచనలు చేసినట్టు తెలిపింది. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యూజీసీ నిబంధనలను కచ్చితంగా పాటించడం, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆందోళనలను పరిష్కరించడం అవసరమని అభిప్రాయపడినట్టు వివరించింది. యూనివర్సిటీల్లో లైబ్రరీలు, డిజిటల్‌ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రభుత్వ హాస్టళ్లను మెరుగుపర్చడంతోపాటు విద్యాసంస్థల్లో ల్యాబ్‌లు పెంచాలని అధికారులకు సూచించినట్టు తెలిపింది. విశ్వవిద్యాలయాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ పేర్కొన్నట్టు వివరించింది.
చదవండి: ధరణిలో మరో లొల్లి!.. దశాదిశ లేని ప్రభుత్వ కసరత్తు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top