తుర్కయాంజాల్‌లో ప్లాట్ల అమ్మకానికి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

తుర్కయాంజాల్‌లో ప్లాట్ల అమ్మకానికి సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, May 30 2022 2:02 AM

Telangana Government Ready To Sale Land In Turkayamjal Area - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర శివార్లలో విలువైన భూముల అమ్మకానికి ప్రభుత్వం మరోసారి పచ్చ జెండా ఊపింది. గత సంవత్సరం రంగారెడ్డి జిల్లా పరిధి లోని కోకాపేట, ఉప్పల్‌ భగాయత్‌లలో భూ ముల అమ్మకం ద్వారా సుమారు రూ.2,500 కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం ఈసారి సుమారు రూ.500 కోట్ల ఆదాయం సమకూర్చుకు నేందుకు కార్యాచరణ ప్రారంభించింది. నాగార్జున సాగర్‌ హైవేను ఆనుకొని తుర్కయాంజాల్‌ పరిధిలో ఉన్న 9.5 ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా విక్రయించ నుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా వచ్చే నెలాఖరున ఈ–వేలం నిర్వహించేందుకు హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎం డీఏ) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నాగార్జునసాగర్‌ హైవేలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు లోపలవైపు కాలనీలు, మునిసిపాలిటీలకు సమీపంలో ప్రభుత్వం తొలిసారిగా భూముల అమ్మకానికి తెరలేపడం గమనార్హం. 

తొమ్మిదిన్నర ఎకరాల్లో 34 ప్లాట్లే..
నాగార్జున సాగర్‌ రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్‌–19) ను ఆనుకొని తుర్కయాంజాల్‌ పరిధిలో 9.5 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ వెంచర్‌ రూపొం దించింది. అపార్ట్‌మెంట్లు, ఆఫీసులు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలకు అనుకూలంగా 600 నుంచి 1,060 గజాల విస్తీర్ణంలో నాలుగు కేటగిరీల్లో 34 ప్లాట్లను రూపొందించారు. హెచ్‌ఎండీఏ నిబంధనలకు అనుగుణంగా రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రూపొందించిన ఈ వెంచర్‌ వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం వంటి కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు అతిచేరువలో ఉండటమే గాక హయత్‌నగర్‌లోని ఎన్‌హెచ్‌––65కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

నిరుడు రూ.2,500 కోట్ల ఆదాయం
గత సంవత్సరం హైదరాబాద్‌ శివార్లలోని భూముల్లో ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ.2,500 కోట్ల వరకు సమకూర్చుకుంది. అందు లో 2021 జూలైలో కోకాపేటలోని 49.949 ఎకరాల్లో అభివృద్ధి చేసిన భూములను వేలం వేయ డం ద్వారా ప్రభుత్వానికి రూ.2000.37 కోట్లు సమ కూరింది. దేశంలోని భారీ రియల్‌ఎస్టేట్‌ కంపెనీలు రూ.వందల కోట్లు వెచ్చించి ఈ స్థలాలను చేజిక్కిం చుకున్నాయి. ఇక్కడ 1.65 ఎకరాల ప్లాట్‌ను రాజపుష్ప రియల్టీ సంస్థ అత్యధికంగా రూ.60 కోట్లకు ఎకరం చొప్పున దక్కించుకోవడం రికార్డు. 8 భారీ సంస్థలు రూ. 2000.37 కోట్లు వెచ్చించి కోకాపేట స్థలాలను దక్కించుకున్నాయి. డిసెంబర్‌ 2021లో ఉప్పల్‌ భగాయత్‌లో 39 ప్లాట్లను విక్రయించగా, రూ. 474.61 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక్కడ అప్‌సెట్‌ ప్రైస్‌ చదరపు గజానికి రూ.35 వేలుగా నిర్ణయించగా, అత్య« దికంగా రూ.1.01 లక్షలు, అతితక్కువగా రూ.53 వేలు బిడ్స్‌ వచ్చాయి. ఈ నేపథ్యంలో తుర్క యంజాల్‌ ప్లాట్లకూ భారీగానే ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అప్‌సెట్‌ ప్రైస్‌ చ.గజానికి రూ. 40వేలు
తుర్కయాంజాల్‌లోని ప్లాట్లకు అప్‌సెట్‌ ప్రైస్‌ చదరపు గజానికి రూ.40వేలుగా నిర్ణయిం చారు. అప్‌సెట్‌ ప్రైస్‌ కన్నా కనీసం రూ.500 గానీ, అంతకు రెట్టింపులోగానీ వేలంలో ధరను పెంచాల్సి ఉంటుంది. ఈ వేలం బిడ్డింగ్‌లో పాల్గొనాలనుకొనే వారు జూన్‌ 27 సాయంత్రం 5 గంటల లోగా రూ.1,180 చెల్లించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈఎండీ కింద జూన్‌ 28లోగా ఒక్కో ప్లాట్‌కు రూ.5 లక్షలు చెల్లించాలి. ఈ–వేలం జూన్‌ 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయం త్రం 5 వరకు  నిర్వహిస్తారు.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement