త్వరలో ప్రత్యేక  అగ్నిదళం

Telangana: Government Plans Special Fire Safety Staff To Face Disasters - Sakshi

అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులు, విపత్తులు ఎదుర్కొనేలా శిక్షణ  

50 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ∙అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: అగ్ని ప్రమాదాలతోపాటు ఇతర అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో వెంటనే రంగంలోకి దిగేలా సుశిక్షితులైన 50 మంది అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) తరహాలో ఉండే ఈ బృందానికి అన్నిరకాల అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. ఈ బృందం హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు.

అగ్నిమాపకశాఖ సిబ్బందికి ఇస్తున్న శిక్షణ, అందుబాటులో ఉన్న ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలు, అగ్నిప్రమాదాల నియంత్రణకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలను శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డీజీ నాగిరెడ్డి, అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ లక్ష్మి ప్రసాద్, రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పాపయ్య, ఫైర్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రసన్న కుమార్‌తో కలిసి వివరించారు. తొలుత అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు వినియోగించే పరికరాలు, బ్రాంటో స్కైలిఫ్ట్‌ పనితీరును మాదాపూర్‌ ఫైర్‌ స్టేషన్‌లో అధికారులు వివరించారు. అనంతరం బహుళ అంతస్తుల్లో నిర్మితమవుతున్న అరబిందో భవనం, గోపన్‌పల్లిలోని హానర్స్‌ హోమ్స్‌ భవనంలో ఫైర్‌ సేఫ్టీ కోసం ఏ వ్యవస్థ ఏర్పాటు చేశారన్నది ప్రయోగాత్మకంగా పరిశీలించి చూపారు. వట్టినాగులపల్లి అగ్నిమాపకశాఖ శిక్షణ కేంద్రంలో సిబ్బందికి ఇస్తున్న శిక్షణ, ఏర్పాటు చేసిన వ్యవస్థను సైతం డీజీ నాగిరెడ్డి వివరించారు.  

అగ్నిప్రమాదాల నియంత్రణకు సంసిద్ధం 
వేసవిలో ఎదురయ్యే అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు అగ్నిమాపకశాఖ సన్నద్ధంగా ఉందని నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఫైర్‌స్టేషన్లలో అన్ని రకాలు కలిపి 400కుపైగా ఫైర్‌ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫైర్‌ సేఫ్టీ పరికరాలు పనిచేయకపోవడంతోనే స్వప్నలోక్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణనష్టం జరిగిందని గుర్తు చేశారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ఎక్కువ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఫైర్‌ ఫైటింగ్‌ కోసం రోబోలు, డ్రోన్లను వినియోగించేలా ప్రణాళికలు ఉన్నాయని, మరో ఏడాదిలో ఇవి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. అగ్నిప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి సైతం శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సైతం ఆరోగ్య భద్రత సదుపాయం కల్పించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నాగిరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఫైర్‌సిబ్బంది నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో పలురకాల అగ్నిప్రమాదాలను ఎలా నియంత్రిస్తారన్నది ప్రయోగాత్మకంగా చూపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top