టీఎస్‌పీఎస్సీకి కొత్త కళ

Telangana Government Appointed TSPSC Chairman And Members - Sakshi

చైర్మన్, ఏడుగురు సభ్యులను నియమించిన ప్రభుత్వం..

చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి.జనార్దన్‌రెడ్డి 

సభ్యుల్లో మేధావి వర్గాలకు చోటు కల్పించిన సీఎం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియలో కీలక అడుగుపడింది. ఆర్నెల్లుగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)లో కోరం లేక ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదు. కొత్తగా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల కోరం లేకపోవడం, ఒకే ఒక్క సభ్యుడే ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా ఉండటంతో కొలువుల భర్తీ సంశయంలో పడింది.

టీఎస్‌పీఎస్సీకి చైర్మన్, ఏడుగురు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో అవరోధం తొలగినట్లయింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి.జనార్ధన్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా రమావత్‌ ధన్‌సింగ్, ప్రొఫెసర్‌ బి.లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్‌ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, ఆరవెల్లి చంద్రశేఖర్‌ రావు, ఆర్‌.సత్యనారాయణ పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపిక చేయగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు. వీరు ఆరేళ్లపాటు లేదా వయసు 62 ఏళ్లు నిండే వరకు ఈ పదవుల్లో కొనసాగనున్నారు.

తాజాగా నియమితులైన వారిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి సీఎం ప్రాధాన్యత కల్పించారు. అటు సామాజిక వర్గం కోణంలో, ఇటు ఉద్యోగ నియామక నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవారిని ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. చైర్మన్, సభ్యులుగా ఎంపికైన వారి నేపథ్యం ఇదీ..

డాక్టర్‌ బి.జనార్ధన్‌రెడ్డి (ఐఏఎస్‌), టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌: 
ప్రస్తుతం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా, కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీగా విధులు నిర్వహిస్తున్న ఆయన సొంతూరు మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్దాయపల్లి గ్రామం. నిబద్ధత, నిజాయితీతో పనిచేసి మచ్చలేని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎంవీఎస్సీ అగ్రికల్చర్‌ చదివిన ఆయన 1990లో ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ కలెక్టర్‌ (గ్రూప్‌1 హోదా)గా బాధ్యతలు చేపట్టారు.

ఆ తరువాత నల్లగొండ ఆర్డీఓగా, కరీంనగర్‌లో హౌసింగ్‌ శాఖ జిల్లా మేనేజర్‌గా, డీఆర్డీఏ పీడీగా, హైదరాబాద్‌లో ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ మిషన్‌ సీఈఓగా, మెప్మా డైరెక్టర్‌గా,  వరంగల్, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌గా అనేక పదవులకు వన్నెతెస్తూ ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, మార్కెటింగ్‌ శాఖల కమిషనర్‌గా, సహకారశాఖ రిజిస్ట్రార్‌గా, శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీగా, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై సీవరేజ్‌ బోర్డు ఎండీగా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా, విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు.

రమావత్‌ ధన్‌ సింగ్, సభ్యుడు: 
నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన జాత్యానాయక్‌ తండాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ పట్టా పొందారు. పబ్లిక్‌ హెల్త్‌ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇఎన్సీగా ఉన్నత పదవిని అధిరోహించారు. మిషన్‌ భగీరథ నిర్మాణ పనులను సమర్థవంతంగా నిర్వర్తించారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పలు ఫ్లైఓవర్లు, రైల్వే అండర్‌ బ్రిడ్జిలు, హైదరాబాద్‌లో రోడ్ల వెడల్పు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో రమావత్‌ ధన్‌ సింగ్‌ భాగస్వాములై ప్రతిభావంతంగా పనిచేశారు. 

ప్రొ. బండి లింగారెడ్డి, సభ్యుడు: 
ఖమ్మం జిల్లా వేమ్సుర్‌ గ్రామానికి చెందిన వారు.  కందుకూరులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో రేడియేషన్‌ ఫిజిక్స్‌లో పట్టా పొందారు. 1996లో సీబీఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. అప్పటి నుంచి 25 ఏళ్లుగా  అదే సంస్థలో వివిధ స్థాయిల్లో ఎదిగి ప్రస్తుతం ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. విస్తృత స్థాయి రీసర్చ్‌ ద్వారా ఆయన రాసిన కీలకమైన పలు జర్నల్స్‌ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచాయి. 

కోట్ల అరుణ కుమారి, సభ్యురాలు: 
ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన కోట్ల అరుణకుమారి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలో భూ భారతి విభాగం జాయింట్‌ డైరెక్టర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు.

సుమిత్రా ఆనంద్‌ తనోబా, సభ్యురాలు: 
కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి పల్లెలో వెనబడిన ఆరెక్షత్రియ వర్గానికి చెందిన సుమిత్ర తెలంగాణ ఉద్యమకారిణి. మలిదశ తెలంగాణ ఉద్యమ కాలం 2001 నుంచి కేసీఆర్‌ అడుగుజాడల్లో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేశారు. తెలుగు భాషా పండితులుగా ప్రభుత్వ టీచర్‌గా విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పుతూనే ఉద్యమకారిణిగా తెలంగాణ కోసం పాటుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫోరమ్, తెలంగాణ  రచయితల వేదికలకు వైస్‌ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ భాషా వేదికకు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.  

కారం రవీందర్‌ రెడ్డి, సభ్యుడు...
తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (టీఎన్జీఓ) కేంద్ర సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన కారెం రవీందర్‌రెడ్డి పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఉద్యోగ సంఘంలో వివిధ హోదాల్లో పనిచేసిన రవీందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. గత ఆగస్టులో డిప్యూటీ తహసీల్దార్‌ హోదాలో పదవీ విరమణ పొందారు. ఈయనది వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు.

ఆరవెల్లి చంద్రశేఖర్‌ రావు, సభ్యుడు... 
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ సొంతూరు. ఉస్మానియాలో బీఏఎంఎస్‌ పూర్తి చేశారు. ఆయన భార్య కూడా డాక్టర్‌. ఇరువురు సొంతూరు ముస్తాబాద్‌లో ఆసుపత్రి ప్రారంభించి పేదలకు వైద్య సేవలందిస్తున్నారు. నవజ్యోతి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా దుబ్బాక, సిరిసిల్ల ప్రాంతాల్లోని వృద్ధులకు వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. తోటి వైద్యుల సహాయంతో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

ఆర్‌. సత్యనారాయణ, సభ్యుడు:  
జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా సుపరిచిరుతుడు. పద్మశాలి వర్గానికి చెందిన సత్యనారాయణ మెదక్‌ జిల్లా వరిగుంతం గ్రామానికి చెందిన వారు. బీఏ డిగ్రీ చేశారు. పలు ప్రధాన దినపత్రికల్లో సీనియర్‌ జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ పిలుపునందుకుని క్రియాశీలంగా పనిచేశారు. ఆయన సేవలను గౌరవించిన కేసీఆర్‌ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవిని ఆర్నెల్లకే వదిలేసి తెలంగాణ ఉద్యమకారుడికి పదవి ముఖ్యం కాదు తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యమని చాటిచెప్పారు. 

చదవండి: తెలంగాణలో 30దాకా లాక్‌డౌన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top