తెలంగాణలో 30దాకా లాక్‌డౌన్‌

Telangana Lockdown Extended Up To May 30 2021 - Sakshi

ఈ నెల 20న జరగాల్సిన మంత్రివర్గ భేటీ రద్దు 

దానికి బదులు ఫోన్‌లో మంత్రుల అభిప్రాయాలు సేకరించిన సీఎం 

యథావిధిగా ఆంక్షలు.. అదనపు సడలింపులు లేనట్టే 

ఈ నెల 28న లేదా 29న కేబినెట్‌ భేటీ! 

అప్పటి పరిస్థితులనుబట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం

ఆంక్షలు యథాతథం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం 

సాక్షి,హైదరాబాద్: కోవిడ్‌ కట్టడి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగించారు. మంగళవారం రాష్ట్ర మంత్రులతో ఫోన్‌లో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

కరోనా రెండో వేవ్‌ ఉధృతి నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 20న మరోసారి రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై.. పరిస్థితులను సమీక్షించాలని, లాక్‌డౌన్‌ పొడి గింపుపై నిర్ణయం తీసుకోవాలని తొలుత భావించారు. కానీ ఆ సమావేశాన్ని రద్దు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. మంత్రులు జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, రోగులకు వైద్య సేవల పర్యవేక్షణ పనుల్లో తీరిక లేకుండా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దానికి బదులుగా సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మంత్రులతో మాట్లాడి, లాక్‌డౌన్‌ పొడిగింపునకు మొగ్గుచూపారని తెలిపింది. 

ఇప్పటి ఆంక్షలే కొనసాగింపు 
లాక్‌ డౌన్‌ విధించడానికి ముందు.. ఏప్రిల్‌ 20 నుంచి మే 12 మధ్య.. రోజూ రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను అమలు చేసిన విషయం తెలిసిందే. మే 12 నుంచి ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజల నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు నాలుగు గంటల పాటు అన్నిరకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే 20వ తేదీన కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ తీరును సమీక్షిస్తామని వారం కింద సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. కొన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు భావించాయి.

కానీ రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో.. ప్రస్తుతం ఎలాంటి అదనపు సడలింపులు ఇవ్వొద్దని, ఇప్పడున్న ఆంక్షలనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై సీఎం కార్యాలయం చేసిన ప్రకటనలో కూడా కొత్త సడలింపుల ప్రస్తావన ఏదీ లేదు. ఈ నెల 28న లేదా 29న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై.. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.  

 చదవండి: కరోనా నిబంధనలు గాలికి..జరిమానాలు 30 కోట్లపైనే..!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top