వరి ఏ గ్రేడ్‌కు మద్దతు ధర రూ.1,960

Telangana Government Announces Support Price For Various Crops - Sakshi

సాధారణ రకం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,940  

వివిధ రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం 

తక్షణం అందుబాటులోకి వస్తాయన్న మంత్రి నిరంజన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతులు పంటలకు మద్దతు ధర పొందాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. వివిధ రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించారు. ఇవి తక్షణం అందుబాటులోకి వస్తాయన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్‌లో పంటల మద్దతు ధరలపై మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను మంత్రి విడుదల చేశారు. రైతులు పంట ఉత్పత్తులను శుభ్రపరచి, ఎండబెట్టి మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు.

వారి సౌకర్యార్థం మార్కెట్‌ యార్డుల్లో క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ కాంటాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ అనుకూల విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందని చెప్పారు. వ్యవసాయ వృద్ధిరేటులో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ ఇచ్చిన తాజా నివేదికనే దీనికి సాక్ష్యమన్నారు.

పంటల ఉత్పత్తిలో ఏటా తెలంగాణ రికార్డులు తిరగరాస్తోందని, రైతు రెక్కల కష్టానికి తగిన ఫలితం రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. పత్తిలో తేమ 8 నుండి 12 శాతం ఉండాలని, తేమ 6–7 శాతం ఉంటే సీసీఐ ద్వారా బోనస్‌ కూడా ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top