భవిష్యత్తు ఎలక్ట్రిక్‌ వాహనాలదే..

Telangana: Get 600 New Electric Vehicle Charging Stations: Jagadish Reddy - Sakshi

రాష్ట్రంలో మరో 600 చార్జింగ్‌ కేంద్రాలు 

ప్రతిపాదనలు సిద్ధం చేశామన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి 

10వేల విద్యుత్‌ వాహనాలు వినియోగంలోకి వస్తే రూ.250 కోట్ల పెట్రోల్‌ దిగుమతులు ఆదా

మాదాపూర్‌ (హైదరాబాద్‌): పర్యావరణ కాలుష్యం ప్రపంచానికి సవాల్‌గా మారిందని, అందువల్ల విద్యుత్‌ వాహనాల వాడకం పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. రానున్నది ఎలక్ట్రానిక్స్‌ యుగమని, భవిష్యత్తులో విద్యుత్‌ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని చెప్పారు. శుక్రవారం హైటెక్స్‌లో టీఎస్‌రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ ట్రేడ్‌ ఎక్స్‌పో విద్యుత్‌ వాహనాల ప్రదర్శనను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల సంఖ్య పెరుగుతోందని, వీటిని మరింతగా పెంచేందుకు ఇప్పటికే 138 విద్యుత్‌ చార్జింగ్‌ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. మరో 600 చార్జింగ్‌ కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దేశ రాజధాని ఢిల్లీ, చైనా రాజధాని బీజింగ్‌ నగరాలు పొగ, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 10వేల విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు వినియోగంలోకి వస్తే రూ.250 కోట్ల పెట్రోల్‌ దిగుమతులు ఆదా అవుతాయన్నారు.

విద్యుత్‌ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయిస్తే, వాహనాల తయారీదారులకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం పలుకుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్‌ సరఫరా ఉన్నందున ఏ ఒక్కరూ వాహనాల చార్జింగ్‌ గురించి భయపడొద్దన్నారు. వాహనాలకు అవసరమైన బ్యాటరీ పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేలా ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోందని చెప్పారు.

అనంతరం హైటెక్స్‌ ప్రాంగణంలో జగదీశ్‌ రెడ్డి విద్యుత్‌ ద్విచక్రవాహనాన్ని నడిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, టీఎస్‌రెడ్కో వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జానయ్య, టీఎస్‌ రెడ్కో, ఈవీ ట్రేడ్‌ ఎక్స్‌పో నిర్వాహకులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top